Heads & Tales Review: 'హెడ్స్ అండ్ టేల్స్' సమీక్ష: సీరియస్ ఇష్యూకు సొల్యూషన్ అంత ఈజీనా?
Heads & Tales Review: అమ్మాయిని బొమ్మ అనుకుంటే మూడు బొమ్మల కథే 'హెడ్స్ అండ్ టేల్స్'. బొమ్మల జీవితంలో బొరుసు (అబ్బాయి)ల పాత్రేమిటి? అన్నది ఆసక్తికరం.
సాయికృష్ణ ఎన్రెడ్డి
దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి, చాందిని రావు, అరుణ్ పులవర్తి, తరుణ్ పొనుగోటి, కివీష్ కౌటిల్య, సునీల్, సుహాస్
రివ్యూ: హెడ్స్ అండ్ టేల్స్
ప్రధాన తారాగణం: దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి, చాందిని రావు, అరుణ్ పులవర్తి, తరుణ్ పొనుగోటి, కివీష్ కౌటిల్య తదితరులతో పాటు భగవంతుడి పాత్రలో సునీల్, కీలక పాత్రలో సుహాస్.
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి
సంగీతం: మణిశర్మ
సమర్పణ: ఎస్.కె.ఎన్
నిర్మాతలు: ప్రదీప్ అంగిరేకుల, రమ్య చౌదరి
కథ: సందీప్ రాజ్
దర్శకత్వం: సాయికృష్ణ ఎన్రెడ్డి
విడుదల: 22-10-2022 (జీ 5 ఓటీటీలో)
'కలర్ ఫొటో' దర్శకుడు రాసిన కథతో... ఆ సినిమాలో హీరో సుహాస్, విలన్ సునీల్ కీలక పాత్రల్లో... ఇంకా శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'హెడ్స్ అండ్ టేల్స్'. గత ఏడాది 'కలర్ ఫొటో' ఓటీటీలో హిట్ టాక్ తెచ్చుకుంది. మరి, ఆ సినిమాకు పనిచేసిన కోర్ టీమ్ కలిసి రూపొందించిన 'హెడ్స్ అండ్ టేల్స్' పరిస్థితి ఏంటి? 'జీ 5' ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?
కథ:
అలివేలు మంగ (దివ్య శ్రీపాద) పోలీస్ కానిస్టేబుల్. ఆమె భర్త బార్‌లో వెయిటర్. అతడు అద్దం పగలగొట్టడంతో దాని ఖరీదు పాతికవేలు అయినా కట్టమని లేదంటే నాలుగు నెలలు జీతం లేకుండా ఉద్యోగం చేయమని ఓనర్లు ఒత్తిడి చేస్తారు. దాంతో భార్య మెడలో బంగారం ఇవ్వమని గొడవ. ఆ టెన్షన్‌లో స్టేషన్‌కు వెళ్లిన మంగకు అనీషా (శ్రీవిద్య మహర్షి) తారసపడుతుంది. అనీషా ఓ కన్నడ నటి. తెలుగులో వేశ్య పాత్రలో నటించే అవకాశం వస్తే, క్యారెక్టర్ బావుందని హైదరాబాద్ వస్తుంది. అయితే... తనకు కాబోయే భార్య వేశ్యగా నటించడం తనకు ఇష్టం లేదని, ఆ సినిమాకు నో చెప్పి బెంగళూరు వెళ్లపోతే యాసిడ్ పోస్తానని అనీషాతో నిశ్చితార్థం చేసుకున్న దీపక్ వార్నింగ్ ఇస్తాడు. అందువల్ల, కంప్లయింట్ ఇవ్వడానికి స్టేషన్‌కు వస్తే... ఆమెకు రక్షణగా అలివేలు మంగ వెళుతుంది. డబ్బులు ఇస్తే భర్త ఉద్యోగం తిరిగొస్తుందని ఆశ. అయితే... అలివేలు మంగ, అనీషా పరిచయం వారి జీవితాల్లో ఎటువంటి మార్పులకు దారి తీసింది? మధ్యలో శృతి (చాందిని రావు) ఎవరు? ఆమె కథేంటి? ఒకరు భర్తతో, మరొకరు నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తితో, ఇంకొకరు బాయ్‌ఫ్రెండ్‌తో... ముగ్గురమ్మాయిలు అబ్బాయిల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారే. వాటి నుండి ఎలా బయటపడ్డారా? లేదా? ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ:
సమాజంలోకి తొంగి చూస్తే చాలామంది మహిళల జీవితాల్లో కనిపించే సమస్యలను సందీప్ రాజ్ కథగా మలిచారు. సీరియస్ ఇష్యూలను తీసుకున్నారు. అలాగని, క్లాస్ పీకుతున్నట్టు కాకుండా, లెక్చర్లు ఇవ్వకుండా సింపుల్ గా చెప్పారు. ముగ్గురు అమ్మాయిల నేపథ్యం, పరిస్థితులు వేర్వేరు అయినా... జీవితంలో సమస్య ఒకే విధమైనది. అబ్బాయిల నుండి ఎదురయ్యేది. అలాగని... కథ రాసిన సందీప్ రాజ్, సినిమా తీసిన దర్శకుడు సాయికృష్ణ ఎన్రెడ్డి అమ్మాయిల వైపు మాత్రమే ఆలోచించలేదు. అబ్బాయిల కోణంలోనూ ఆలోచించారు. బొమ్మ, బొరుసు... నాణేనికి రెండు వైపులా చూపించారు. చివరకు, అమ్మాయిలకు ఒక సందేశం ఇచ్చారు. సీరియస్ ఇష్యూలకు సొల్యూషన్ అంత ఈజీనా? అనేలా ఉంటుంది. కానీ, ఆలోచిస్తే నిజమే కదా అన్నట్టు చెప్పారు. మన పెయిన్ ఎప్పుడూ పక్కనోడికి చిన్నదిగా, మనకు పెద్దదిగా కనిపిస్తుందని చెప్పారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ మార్క్ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో వినిపించింది. ప్రారంభంలో వచ్చిన పాట పర్వాలేదు. ఒక్క రోజులో, ముఖ్యంగా రాత్రి జరిగే కథ అయినా... సినిమాటోగ్రాఫర్ వెంకట్ ఆర్. శాఖమూరి రాత్రి వేళల్లో హైదరాబాద్ ఎలా ఉంటుందో చూపించారు. క్వాలిటీ సినిమాటోగ్రఫీ, బెటర్ ప్రొడక్షన్ వేల్యూస్ ఉంటే బావుండేది. 'మగాడి చిరాకు ఎవరి మీద ఉంటుంది మేడమ్? పెళ్లికి ముందు అమ్మ మీద, పెళ్లైన తర్వాత పెళ్ళాం మీద!', 'గతం చూసి గుండెలు బాదుకునే వారి కన్నా భవిష్యత్తును చూసి భుజం ఇస్తారు చూడండి. అలాంటి వాళ్లను చూసుకోండి' వంటి డైలాగులు బాగున్నాయి. అసలు కథ ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కథలో మెయిన్ పాయింట్ రావడానికి ఇంకొంత సమయం పడుతుంది. సినిమాల్లో దీన్ని ల్యాగ్ అంటరాని సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు. ఆ తర్వాత గాడిలో పడింది.
కానిస్టేబుల్ పాత్రలో దివ్య శ్రీపాద సహజంగా నటించారు. అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి నటించిన తీరు ఆకట్టుకుంటుంది. చాందిని రావు నటన తొలుత సాధారణంగా అనిపించినా... సినిమా చివర వచ్చే భావోద్వేగభరిత సన్నివేశంలో ఆకట్టుకుంటారు. ముగ్గురమ్మాయిలకు జంటగా కనిపించిన ముగ్గురు అబ్బాయిల్లో అరుణ్ కు కాస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్ర దక్కింది. నిడివి పక్కన పెడితే ముగ్గురూ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా మధ్యలో సుహాస్ సందడి చేశారు. అతడి పాత్ర, డైలాగులు కాస్త నవ్విస్తాయి. సునీల్ పాత్రను పక్కనపెట్టి నేరుగా కథలోకి వెళ్లినా బాగానే ఉంటుంది. అయితే, సునీల్‌ను భగవంతుడిగా చూపిస్తూ సినిమా ప్రారంభించడం ఆసక్తికరంగా ఉంది. ఆయన కూడా చక్కగా నటించారు.
టాస్ వేసినప్పుడు బొమ్మ, బొరుసులో ఏదో ఒకటే పైకి కనిపిస్తుంది. ఇంకొకటి నాణేనికి మరోవైపు ఉంటుంది. సినిమాలో ఆ కోణం చూపించడానికి టైమ్ తీసుకున్నారు. ముందు సునీల్, ఆ తర్వాత పాత్రలు పరిచయం చేయడానికి టైమ్ పట్టింది. దాంతో టాస్ వేసినప్పుడు కాయిన్ చాలాసేపు గాల్లో తిరిగినట్టు ఉంటుంది. అయితే, చివరకు సరిగ్గా పడింది. ఎండింగ్ బాగుంది. ఫైనల్ ట్విస్ట్‌తో 'హెడ్స్ అండ్ టేల్స్'కు సీక్వెల్ ఉంటుందని ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.