Changure Bangaru Raja Review: ఛాంగురే బంగారు రాజా రివ్యూ: రవితేజ నిర్మించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
రవితేజ నిర్మించిన ‘ఛాంగురే బంగారు రాజా’ ఎలా ఉంది?
సతీష్ వర్మ
కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సునీల్, సత్య, రవిబాబు, ఎస్తేర్, అజయ్, రాజ్ తిరందాసు తదితరులు
సినిమా రివ్యూ : ఛాంగురే బంగారు రాజా
రేటింగ్ : 2/5
నటీనటులు : కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సునీల్, సత్య, రవిబాబు, ఎస్తేర్, అజయ్, రాజ్ తిరందాసు తదితరులు
మాటలు : జనార్థన్ పసుమర్తి
ఛాయాగ్రహణం : ఎన్.సీ. సుందర్
సంగీతం : కృష్ణ సౌరబ్
నిర్మాత : రవితేజ
రచన, దర్శకత్వం : సతీష్ వర్మ
విడుదల తేదీ: సెప్టెంబర్ 15, 2023
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించడంతో పాటు ఈ మధ్య కొత్తవారిని ప్రోత్సహిస్తూ చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు కూడా. అలా నిర్మించిన క్రైమ్ కామెడీ థ్రిల్లరే ‘ఛాంగురే బంగారు రాజా’. సినిమా ప్రమోషన్లలో కూడా రవితేజ పాల్గొన్నారు. ‘ఛాంగురే బంగారు రాజా’ ట్రైలర్‌ను కూడా చాలా ప్రామిసింగ్‌గా కట్ చేశారు. దీనికి తోడు వినాయక చవితి నేపథ్యంలో మంచి రిలీజ్ డేట్ కూడా దొరికింది. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది?
కథ: అనకాపల్లి సమీపంలోని దుగ్గాడ అనే గ్రామంలో బంగార్రాజు (కార్తీక్ రత్నం) మెకానిక్ గా పని చేసుకుంటూ ఉంటాడు. కానిస్టేబుల్ మంగని (గోల్డీ నిస్సీ) ప్రేమిస్తాడు. అదే ఊర్లో రంగు రాళ్ళు వెతికే క్రమంలో తనకు సోము నాయుడుతో (రాజ్ తిరందాసు) గొడవ అవుతుంది. సోము నాయుడుని చంపి చెరువులో పడేస్తానని ఊరి జనం అందరి ముందు బంగార్రాజు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత సోము నాయుడుని ఎవరో హత్య చేసి చెరువులో పడేస్తారు. ఆ నేరం బంగార్రాజు మీద పడుతుంది. దీని కారణంగా బంగార్రాజు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అసలు హత్య ఎవరు చేశారు? ఈ కథలో తాతారావు (సత్య), ఘటీలు (రవిబాబు) పాత్రలు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ‘ఛాంగురే బంగారు రాజా’ కథ చాలా చిన్నది. ఒక గొడవ, దాని తర్వాత ఒక హత్య, దాని వెనుక ఒక మిస్టరీ మొత్తంగా ఇదే కథ. దీన్ని పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో దర్శకుడు సతీష్ వర్మ తడబడ్డారు. ‘ఛాంగురే బంగారు రాజా’లో ప్రధాన ప్లస్ పాయింట్ కామెడీ. సత్య, రవిబాబుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కొన్ని హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యాయి.
ఒకే కథను వేర్వేరు పాయింట్ ఆఫ్ వ్యూల్లో చెప్పడాన్ని ‘రోషోమన్ ఎఫెక్ట్’ అంటారు. కమల్ హాసన్ దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్ ‘విరుమాండి (తెలుగులో పోతురాజు)’లో కూడా ఇదే ఎఫెక్ట్‌లో తెరకెక్కించారు. ఆ తర్వాత కూడా అనేక సినిమాలు ఇదే పద్ధతిలో తీశారు. ‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ప్రారంభంలో ఒకే కథను ముగ్గురి పాయింట్ ఆఫ్ వ్యూల్లో చెబుతామని తెలిపారు. కానీ ఒకే సంఘటన ఆధారంగా జరిగిన ముగ్గురి జీవితాలని చూపించారు తప్ప వారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమీ యాడ్ చేయలేదు.
క్రైమ్ థ్రిల్లర్ అంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. అందులో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యారు. అక్కడక్కడా కామెడీ సీన్లు నవ్వించడం మినహా సినిమాలో పెద్దగా మెరుపులు ఏమీ లేవు. సినిమాలో హీరో లవ్ ట్రాక్ కంటే సత్య లవ్ ట్రాక్, రవిబాబు, ఎస్తేర్‌ల మధ్య వచ్చే సీన్లే ఆసక్తికరంగా ఉంటాయి. ముందుగా సినిమాతో ఏ దశలోనూ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోతారు.
బంగార్రాజు (కార్తీక్ రత్నం), తాతారావు (సత్య), ఘటీలు (రవిబాబు) కథల సమాహారమే ఈ సినిమా. వీటిలో బంగార్రాజు కథ అంతగా ఆకట్టుకోదు. కామెడీ కారణంగా తాతారావు, ఘటీలు కథలు ఓకే అనిపిస్తాయి. కథను మళ్లీ రొటీన్‌గానే ముగించారు.
కృష్ణ సౌరబ్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సోసోగానే ఉంటుంది. ‘సామిరంగ’ పాట ట్యూన్ బాగుంటుంది. స్క్రీన్‌పై కూడా ఆకట్టుకుంటుంది. వీలైనంత తక్కువ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తుంది.
Also Read : 'తురుమ్ ఖాన్‌లు' రివ్యూ : ముగ్గురు హీరోలు నవ్వించారా? టార్చర్ పెట్టారా?
ఇక నటీనటుల విషయానికి వస్తే... బంగార్రాజు పాత్రలో కార్తీక్ రత్నం మెప్పిస్తారు. కానీ ఇది తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం కాదు. హాస్యనటుడు సత్య నవ్విస్తాడు. కానీ అవకాశం ఉన్నా తనను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదేమో అనిపిస్తుంది. రవిబాబు చాలా కాలం తర్వాత స్క్రీన్‌పై కనిపించారు. మతిమరుపు ఉన్న ప్రొఫెషనల్ కిల్లర్ ఘటీలు పాత్రలో నవ్విస్తారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... కొన్ని కామెడీ సీన్ల కోసం థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. తీరిగ్గా ఓటీటీలో వచ్చాక చూసేయచ్చు.
Also Read : జవాన్ రివ్యూ: షారుక్ ఖాన్ మాస్ యాక్షన్ అవతార్ ఎలా ఉంది? ‘జవాన్’ బాక్సాఫీస్ దగ్గర గెలుస్తాడా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial