Bestseller Review: ‘బెస్ట్‌సెల్లర్’ రివ్యూ: శృతిహాసన్‌లో మస్త్ షేడ్స్ ఉన్నాయ్! కానీ, పుస్తకమే..
శృతి హాసన్ నటించిన ‘బెస్ట్‌సెల్లర్’ వెబ్‌సీరిస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులకు నచ్చుతుందా?
ముకుల్ అభ్యంకర్
శృతి హాసన్, అర్జన్ బజ్వా, సత్యజీత్ దూబే, మిథున్ చక్రవర్తి, గౌహర్ ఖాన్, సోనాలీ కులకర్ణి తదితరులు.
తారాగణం: శృతి హాసన్, అర్జన్ బజ్వా, సత్యజీత్ దూబే, మిథున్ చక్రవర్తి, గౌహర్ ఖాన్, సోనాలీ కులకర్ణి తదితరులు.
క్రియేటర్: సిద్ధార్థ్ పి మల్హోత్రా, సప్నా మల్హోత్రా.
దర్శకత్వం: ముకుల్ అభ్యంకర్
ఓటీటీ: Amazon Prime Video.
మొత్తం ఎపిసోడ్స్: 8 ఎపిసోడ్‌లు (ఒక్కొక్కటి 35 నిమిషాల నిడివి)
కథ: తాహిర్(అర్జన్) అనే రచయిత ‘రాంద్ సాంద్ సీదీ సన్యాసి’ అనే పుస్తకం ద్వారా పాపులారిటీ సంపాదిస్తాడు. దానివల్ల తదుపరి పుస్తకం కోసం బయ్యర్స్ నుంచి భారీగా డిమాండ్ వస్తుంది. అయితే, ఏ కథ రాయాలో అతడికి అర్థం కాదు. అలాంటి సమయంలో అతడికి ఓ చిన్న పట్టణం నుంచి వచ్చి ముంబయిలోని ఓ కెఫిటేరియాలో పనిచేస్తున్న మీతు మాథూర్(శృతి)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చేతిపై ఉండే కోసినట్లుగా ఉన్న మూడు గాయాలను చూసి ఆశ్చర్యపోతాడు. ఒక్కో గాయానికి ఒక్కో కథ ఉందని చెబుతుంది. మధ్యలో ఉన్న గాయాన్ని చూపిస్తూ తాను ఓ హత్య చేశానని చెబుతుంది. దీంతో తాహిర్ షాకవుతాడు. తాను రాసిన ‘రాంద్ సాంద్ సీదీ సన్యాసి’ కథకు సీక్వెల్‌గా ఆమె కథను రాయాలని అనుకుంటాడు. అలా మొదలయ్యే పరిచయం.. ఊహించని మలుపులు తిరుగుతుంది. మరోవైపు వాణిజ్య ప్రకటనలను తయారు చేసే సంస్థలో పనిచేస్తున్న తాహిర్ భార్య మయాంక(గౌహర్ ఖాన్)కు పార్థ్ ఆచార్య(సత్యజీత్)తో పరిచయం ఏర్పడుతుంది. పార్థ్ ఆమెకు బాగా నచ్చేస్తాడు. ఆ తర్వాత పరిణామాలు మరింత భయానకంగా మారుతాయి. శృతిని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు తాహిర్‌కు తన భార్య మయాంక ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను ఎవరో హ్యాక్ చేస్తారు. శృతిపై హత్యాయత్నం కేసును సీఐడీ అధికారి ఏసీపీ ప్రమాణిక్(మిథున్ చక్రవర్తి) విచారిస్తారు. అప్పటి నుంచి కథలో థ్రిల్ పెరుగుతుంది. ఒక్కో ఎపిసోడ్ ఊపందుకుంటుంది. ఇంతకీ మితు, పార్థ్‌లు ఎవరు? వారి వల్ల తాహిర్, మయాంకల జీవితం ఎందుకు ప్రమాదంలో పడుతుందనేది.. బుల్లితెరపైనే చూడాలి.
విశ్లేషణ: కథ ఆరంభంతోనే.. ఓ కారులో కాలిపోతున్న శవంతో మొదలవుతుంది. దీంతో ఆరంభంలోనే ఆసక్తి కలిగించారు. కానీ, ఒక్కో ఎపిసోడ్ నెమ్మదిగా నెమ్మదిగా సాగుతుంది. అయితే ప్రతి ఎపిసోడ్ ఎండింగ్‌లో టర్నింగ్ పాయింట్ వద్ద ముగించడం వల్ల తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. కథ బాగున్నా.. చూసేందుకు కాస్త ఓపిక ఉండాలి. స్క్రీన్ ప్లే కాస్త వేగంగా ఉంటే బాగుండేదనే భావన కలుగుతుంది. మితు, పార్థ్‌లు ఎందుకు అలా చేస్తున్నారనేది ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే.. ఒక పుస్తకం రాసే రచయిత మీద కక్ష ఎందుకు కలుగుతుంది? పైగా అది అతడి సొంత కథ. కానీ, అక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చి ఆసక్తి రగిలించారు. ఇక పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో శృతి హాసన్‌లో మస్త్ షేడ్స్ కనిపిస్తాయి. రెండు భిన్నమైన పాత్రల్లో ఆమె ఒదిగిపోయింది. కానీ, పార్థ్ పాత్రకు సత్యజిత్ సరిపోలేదనే భావన కలుగుతుంది. అలాగే సీఐడీ ఆఫీసర్‌గా మిథున్ కూడా పర్వాలేదు అనిపించారు. ఒక్కోసారి అతడి వేసే కుళ్లు జోకులు మిస్ ఫైర్ అయినట్లుగా ఉంటాయి. కానీ, కథ స్లో అవుతుందనే భావన కలిగినప్పుడుల్లా ఆయన కొంత జీవం పోశారు. ఇక తాహిర్‌గా అర్జన్ బజ్వా ఆ పాత్రకు న్యాయం చేశారు. గౌహర్ ఖాన్ పాత్ర చాలా కూల్‌గా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె జీవించింది. కథ 5వ ఎపిసోడ్ నుంచి ఊపందుకుంటుంది.
చివరిగా.. ‘బెస్ట్ సెల్లర్’ మంచి థ్రిల్లర్, రివెంజ్ డ్రామా. కానీ, దాన్ని తెరపై చూపించడంలో గందరగోళానికి గురయ్యారు.
ప్లస్ పాయింట్స్: కథ, ట్విస్టులు, కొన్ని గ్రిప్పింగ్ సీన్స్, శృతి హాసన్ అభినయం, నేపథ్య సంగీతం.
మైనస్ పాయింట్స్: 4 ఎపిసోడ్స్ వరకు కథ చాలా నెమ్మదిగా సాగడం, లాజిక్ మిస్సవ్వడం, స్క్రీన్‌ప్లే.
Also Read: అన్‌చార్టెడ్ రివ్యూ: ‘స్పైడర్ మ్యాన్’ హీరో - మళ్లీ అదరగొట్టాడుగా!
Also Read: 'సన్ ఆఫ్ ఇండియా' రివ్యూ: వికటించిన ప్రయోగం!