(Source: ECI/ABP News/ABP Majha)
Son Of India Review - 'సన్ ఆఫ్ ఇండియా' రివ్యూ: వికటించిన ప్రయోగం!
Son Of India Movie Review Telugu: కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నటించిన సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?
డైమండ్ రత్నబాబు
మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ళ భరణి, మీనా తదితరులు
సినిమా రివ్యూ: సన్ ఆఫ్ ఇండియా
రేటింగ్: 1.5/5
నటీనటులు: మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ళ భరణి, మీనా, ఆలీ, పోసాని కృష్ణమురళి, సునీల్, 'వెన్నెల' కిషోర్, బండ్ల గణేష్, మంగ్లీ, పృథ్వీ తదితరులు
మాటలు: తోటపల్లి సాయినాథ్ - డైమండ్ రత్నబాబు
స్క్రీన్ ప్లే: మోహన్ బాబు
సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: విష్ణు మంచు
కథ - దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
విడుదల తేదీ: ఫిబ్రవరి 18, 2022
మోహన్ బాబు కలెక్షన్ కింగ్. ఆయన నటన గురించి ఈ రోజు కొత్తగా చెప్పేది ఏముంది? ఎన్నో పాత్రలకు తన నటనతో ప్రాణం పోశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లెజెండరీ నటుల్లో ఆయన ఒకరు. అంత గొప్ప నటుడి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ లేవంటూ మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో సినిమా బుకింగ్స్ మీద ఒకటే విమర్శలు. మరి, సినిమా ఎలా ఉంది? 'సన్ ఆఫ్ ఇండియా'లో ఏం ఉంది?
కథ: తిరుపతి బయలుదేరిన కేంద్ర మంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్)ని తలకోనలో కిడ్నాప్ అవుతారు. తిరుపతి వెళ్లాల్సిన ఆయన తలకోన ఎందుకు వెళ్ళరు? ఆయన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? త్వరగా కేసును చేంధించమని ఎన్ఐఏ అధికారి ఐరా (ప్రగ్యా జైస్వాల్)కు అప్పగిస్తారు. కేంద్ర మంత్రి తర్వాత ప్రముఖ డాక్టర్, దేవాదాయ శాఖ ఛైర్మన్ కిడ్నాప్ అవుతారు. వాళ్ళను కిడ్నాప్ చేసింది బాబ్జీ పేరుతో ఎన్ఐఏకు టెంపరరీ డ్రైవర్ గా వచ్చిన విరూపాక్ష (మోహన్ బాబు) అని తెలుస్తుంది. ఆ ముగ్గురిని విరూపాక్ష ఎందుకు కిడ్నాప్ చేశారు? ఆయన గతం ఏమిటి? గతంలో ఎందుకు ముగ్గుర్ని హత్య చేశాడు? కిడ్నాప్ చేసిన వాళ్ళను విడిచిపెట్టడానికి చేసిన డిమాండ్స్ ఏమిటి? అన్నది మిగతా సినిమా.
విశ్లేషణ: దేశంలో ప్రయివేట్ స్కూళ్ళు, బస్సులు, ఆస్పత్రులు ఉన్నప్పుడు ప్రయివేట్ జైళ్లు ఉంటే తప్పేంటి? అనే కథాంశంతో రూపొందిన సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. పతాక సన్నివేశాల వరకూ అసలు ఆ పాయింట్ రివీల్ కాదు. అప్పటి వరకూ సగటు రివేంజ్ డ్రామా, థ్రిల్లర్ తరహాలో ఉంటుంది. రాజకీయ, అధికార పలుకుబడి కారణంగా చాలా మంది చేయని తప్పు వల్ల జైళ్లకు వెళుతున్న కథలు వచ్చాయి. అయితే... ఆ కథను కొత్తగా చెప్పడంలో మోహన్ బాబు స్క్రీన్ ప్లే వంద శాతం ఉపయోగపడింది.
చిరంజీవి వాయిస్ ఓవర్‌తో సినిమా ప్రారంభం అయ్యింది. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదని మోహన్ బాబు పాత్రను తన గాత్రం ద్వారా చిరంజీవి పరిచయం చేశారు. వాయిస్ ఓవర్ కోసం రాసిన డైలాగుల్లో ఉన్న పదును దర్శకుడు పాత్రను పరిచయం చేసిన తీరులో లేదు. మోహన్ బాబు అంత గొప్ప నటుడు ఉన్నప్పుడు, దర్శకుడు బలమైన సన్నివేశాలు రాసుకోవాలి. కథ విషయంలో ఎక్కడా ఆ కృషి చేసినట్టు కనిపించదు.
మోహన్ బాబు నటన, డైలాగుల మీద దర్శకుడు 'డైమండ్' రత్నబాబు ఎక్కువగా ఆధారపడ్డారు. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశంలో మోహన్ బాబు అద్వితీయమైన నటన కనబరిచారు. రచనలో లోపాలు చాలావరకూ ఆయన నటనలో కొట్టుకుపోయాయి. కానీ, సాంకేతిక అంశాల పరంగా జరిగిన లోపాలను మాత్రం కవర్ చేయలేకపోయారు. ఇటీవల తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రపంచ సినిమాలకు ధీటుగా తెలుగు సినిమాల్లో గ్రాఫిక్ వర్క్స్ ఉంటున్నాయి. ఎంతో ఖర్చుపెట్టి గ్రాఫిక్స్ చేయించామని చెప్పిన 'సన్ ఆఫ్ ఇండియా' పాటలో గ్రాఫిక్స్ బాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాలేదు. సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్ పుట్ తీసుకోవడంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు ఫెయిల్ అయ్యారు.
'సన్ ఆఫ్ ఇండియా' ప్రారంభంలో చిత్రీకరణ పరంగా ప్రయోగం చేశామని మోహన్ బాబు తెలిపారు. కొంత మంది నటీనటులు చివర్లో మాత్రమే కనిపిస్తారని, తెరపై సన్నివేశాల్లో వారి వాయిస్ మాత్రమే వినిపిస్తుందని, తాను ఏకపాత్రాభినయం చేశానని ఆయన చెప్పారు. చెప్పినట్టు... పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్, రాజా రవీంద్ర తదితరులు తొలుత కనిపించలేదు. వాళ్ళ పాత్రలకు ముగింపు ఇచ్చే సన్నివేశాల్లో మాత్రమే కనిపించారు. ఇటువంటి ప్రయోగం చేయడానికి ముందుకు వచ్చిన మోహన్ బాబును తప్పకుండా అభినందించాలి. ఆయన ధైర్యంగా ముందడుగు వేశారు. కానీ, ఆ సన్నివేశాలను జనరంజకంగా తీయలేకపోయారు దర్శకుడు 'డైమండ్' రత్నబాబు. ఆరిస్టుల బదులు డూప్‌లను పెట్టి ముఖాలు బ్లర్ చేయడం, నరేష్ వాయిస్ వినిపిస్తుంటే... ఫేస్ కనిపించకుండా లైటింగ్ పెట్టడం వంటివి కంటికి ఇబ్బందిగా అనిపిస్తాయి. వాయిస్ వినిపిస్తుంటే ఆర్టిస్టులను చూపించకుండా గతంలో చాలా మంది దర్శకుడు సన్నివేశాలు తీశారు. ఆ ప్రభావం చూపించారు. అలా చేయడంలో రత్నబాబు ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఓటీటీ కోసం తీసిన చిత్రమిదని దర్శకుడు చెప్పారు. అందువల్ల, బడ్జెట్ పరిమితులు పెట్టుకున్నారేమో? గతంలో మోహన్ బాబు సంస్థ నుంచి వచ్చిన సినిమాల స్థాయిలో నిర్మాణ విలువలు లేవు. ఇక, లాజిక్కులు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇళయరాజా నేపథ్య సంగీతంలో మెరుపులు లేవు.
Also Read: దీపికా పదుకోన్ 'గెహరాయియా' రివ్యూ: ఆ ఒక్క రొమాంటిక్ మిస్టేక్ కంటే జీవితం పెద్దది!
'అఖండ'తో భారీ విజయం అందుకున్న ప్రగ్యా జైస్వాల్, ఈ సినిమాలో ఎన్ఐఏ అధికారిగా కనిపించారు. శ్రీకాంత్, పోసాని, రాజా రవీంద్ర, సునీల్, ఆలీ, బండ్ల గణేష్, 'వెన్నెల' కిషోర్ మీనా తదితరులు తెరపై కనిపించేది తక్కువ సేపే. న్యూస్ యాంకర్లుగా ఆలీ, సునీల్, బండ్ల గణేష్, 'వెన్నెల' కిషోర్ చేసిన వినోదం పండలేదు. మిగతా నటీనటులు ఉన్నంతలో బాగా చేశారు. మోహన్ బాబు మాత్రం ప్రారంభం నుంచి ముగింపు వరకూ సినిమాను భుజాల మీద మోశారు. నటనలో ఆయన మేజిక్ వర్కవుట్ అయ్యింది. కానీ, లాజిక్స్ మాత్రం లేవు. మోహన్ బాబు కోసం ఎవరైనా సినిమా చూడాలని అనుకుంటే చూడొచ్చు.
Also Read: 'మళ్ళీ మొదలైంది' రివ్యూ: సుమంత్ విడాకుల సినిమా ఎలా ఉందంటే?