Summer Skin Care: వేసవిలో మీ చర్మాన్ని సంరక్షించే విషయంలో ఈ తప్పులు చేయొద్దు
మండే ఎండల్లో మీ అందాన్ని కాపాడుకోవడం అంటే కఠినమైన సవాలు. కానీ ఈ చిన్న తప్పులు చేయకుండా ఉంటే మాత్రం మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
చెమట, డీహైడ్రేషన్, అధిక వేడి కారణంగా చర్మం చాలా చికాకుగా అనిపిస్తుంది. వేసవి కాలంలో చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే దద్దుర్లు, టానింగ్, మొటిమలు, మెలస్మా, సన్ అలర్జీలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎండ ఉన్నా లేకపోయినా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పని సరి. ఇది దీర్ఘకాలంలో అనేక చర్మ సమస్యలను తగ్గించగలుగుతుంది. ఈ వేసవిలో మీరు ఎటువంటి చర్మ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మీరు ఈ తప్పులు అసలు చేయొద్దు.
సన్ స్క్రీన్ మళ్ళీ అప్లై చేయడం లేదా?
సూర్యుని హానికరమైన UV కిరణాల వల్ల చర్మం ఎక్కువగా దెబ్బతింటుంది. దీని వల్ల శరీరంపై మచ్చలు పడటం, ముడతలు రావడం జరుగుతుంది. దాని నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది రాసుకుంటేనే చర్మం తేమని కోల్పోకుండా నిగారింపు సంతరించుకుంటుంది. లేదంటే అధిక సన్ టానింగ్, మచ్చలు కొన్ని సార్లు చర్మ క్యాన్సర్ కింద మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే UV కిరణాల నుంచి రక్షణ పొందటానికి ప్రతి 2-3 గంటల తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలని చర్మ నిపుణులు సలహా ఇస్తున్నారు.
మాయిశ్చరైజింగ్
వేసవిలో మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడటం వల్ల చర్మం మరింత జిడ్డుగా మారి చికాకు కలిగిస్తుందని, దానికి దూరంగా ఉండమని చాలా మంది చెప్తారు. కానీ అది అపోహ మాత్రమే. జిడ్డుగల చర్మం లేదా మొటిమల బారిన పడే చర్మం అయినప్పటికీ మాయిశ్చరైజర్ అనేది చాలా ముఖ్యం. ఇది చర్మంలోని నీటి కంటెంట్ ని పోకుండా కాపాడుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. తేమ లేకపోవడం వల్ల కూడా చర్మం జిడ్డుగా ఉంటుంది. అందుకే దాన్ని శుభ్రపరుచుకోవడం చాలా ముఖ్యం. హైలురోనిక్ యాసిడ్, నియాసినామైడ్ వంటి పదార్థాలు కలిగి ఉన్న హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఉపయోగించడం ఉత్తమం.
మేకప్
ఎండలో వెళ్లేటప్పుడు చర్మాన్ని రక్షించుకోవడానికి ఎక్కువగా మేకప్ ధరించడం ఉత్తమం కాదు. ఫౌండేషన్, కన్సీలర్, కాంటార్స్ వంటివి చేయడం వల్ల చర్మం రంధ్రాలు మూసుకుపోతాయి. హానికరమైన రేడియేషన్, UV కిరణాల నుంచి రక్షించుకోవడం కోసం లేత రంగు సన్ స్క్రీన్ రాసుకుంటే సరిపోతుందని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఎక్స్ ఫోలియేట్
ఎక్స్ ఫోలియేషన్ అనేది చర్మంలో జరిగే ఒక ముఖ్యమైన ప్రక్రియ. చనిపోయిన చర్మ కణాలు తొలగిపోయి కొత్త కణాలు తయారవుతాయి. మృతకణాలు తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఇవి పేరుకుపోవడం వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. సాలిసిలిక్ యాసిడ్, గ్లైకొలిక్ యాసిడ్, మాండెలిక్ యాసిడ్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి ఏదైనా ఎక్స్‌ఫోలియేటింగ్ పదార్ధాన్ని ఉపయోగించే ముందు చర్మ నిపుణులు సలహాలు తీసుకోవడం తప్పనిసరి.
హైడ్రేట్ గా ఉండాలి
నీళ్ళు ఎంత తాగితే అంత మంచిది. వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో హైడ్రేషన్ కీలకం. సీజనల్ పండ్లు తినడం, ప్రతిరోజు కనీసం 3 లీటర్ల నీరు తాగడం వల్ల హైడ్రేట్ గా ఉంటారు. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడొచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే