Glowing Skin : పండగ వేళ మచ్చలేని చర్మం కోసం మెచ్చే ఆహారం
చర్మ సంరక్షణ కోసం తీసుకోవాల్సిన చిట్కాలు.
మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరం మాత్రమే కాదు చర్మం కూడా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కావాలంటే ప్రాసెస్ చేసిన, వేయించిన జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. వాటి బదులు ప్రోటీన్ రిచ్ ఫుడ్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. చర్మం తనని తాను పునరుద్ధరించుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వయస్సు మీద పడుతున్న కొద్ది చర్మం మీద వృద్ధాప్య ఛాయలు, మొహం మీద ముడతలు కనిపిస్తాయి. వాటి నుంచి బయట పడాలంటే ఆహారం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకోసం చర్మంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలని దూరం చేయాలని అనుకుంటే ఈ సూపర్ రిచ్ ఫుడ్ తీసుకోవాల్సిందే.
రోజు 8 నుంచి 9 గ్లాసుల నీళ్ళు తాగడం శరీరానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణకి మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు తగినంత ప్రోటీన్లు తీసుకోవడం అందమైన చర్మానికి చాలా అవసరం. అప్పుడే ముడతలు లేకుండా యవ్వనమైన చర్మం పొందగలుగుతారు.
☀ మెరిసే చర్మం కావాలంటే రోజుకి కనీసం ఒక గ్లాసు కూరగాయల రసం తాగాలి. మొక్కల నుంచి ఆహారం నుంచి విటమిన్ సి, ఇ, సెలీనియం అందిస్తుంది. ఇవి వృద్ధాప్యాన్ని నిరోధించి కణాల పునరుద్ధరణకి సహాయపడతాయి.
☀ ధూమపానం మానుకోవాలి. ఇది చర్మాన్ని దెబ్బతినేలా చేస్తుంది.
☀ నూనెలో వేయించిన వేపుళ్ళు, కారం ఎక్కువ ఆహారాలు తినకూడదు. ఇవి విషపూరితం. చర్మానికి హాని కలిగిస్తాయి.
☀ కొవ్వు తీసుకోవడం పరిమితం చెయ్యాలి. వాటికి బదులుగా మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, చేప నూనెలు, ఆలివ్ ఆయిల్, కనోలా నూనె, వాల్ నట వంటి ఒమేగా కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
☀ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం పెంచాలి.
☀ ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం నిరోధించాలి. బదులుగా తాజాగా ఇంట్లో వండిన ఆహారాన్ని ఎంచుకోవాలి.
☀ విటమిన్లు ఏ, బి, సి, ఇ, జింక, గామా లీనోలేనిక్ యాసిడ్స్ వంటి చర్మ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
☀ పచ్చని కూరగాయాలతో చేసిన వంటకాలు మచ్చలేని చర్మాన్ని అందిస్తాయి. బ్రకోలి, కొత్తిమీర, బచ్చలి కూర వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం తాజాగా యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. వీటిలో చర్మ సంరక్షణకి ఉపయోగపడే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవే కాకుండా కలబందతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం పండగ వేళ మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. కలబందలో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. కణాల పెరుగుదలను ఇది ప్రోత్సహిస్తుంది. ఇది ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది. మొటిమల వల్ల వచ్చే నల్ల మచ్చలను తగ్గించుకునేందుకు కూడా కలబంద గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది చర్మానికి మరింత అందాన్ని ఇస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: బరువు తగ్గడానికి ఏది తినాలా అని ఆలోచిస్తున్నారా? ఇవి తింటే నాజూకుగా మారడం ఖాయం