Womens Day 2022: ఓ మహిళా నీ ఆలోచనలను అప్‌డేట్ చేసుకో.. నీ జీవితం, ఆనందం నీ చేతుల్లోనే
మనలో రాని మార్పు సమాజంలో కూడా రాదు. ఈ విషయాన్నే మహిళలు అర్థం చేసుకోవాలి. ముందుగా తమను తాము మార్చుకోవాలి.
మనం ఏం చేసినా చేయకపోయినా కాలం కరిగిపోతూనే ఉంటుంది. కాలుడు ‘నిరంకుశుడు’ అంటారు. అక్కడ కూడా జెండర్ వర్తిస్తుందా అనిపిస్తుంది నాకు. అలాగే కరోనా అంటే ‘వచ్చింది పోయింది’ అని ‘మహమ్మారి’ అని అంటారు. ఇక్కడ కరోనాకు జెండర్‌ను వర్తింపజేశారు. భాష యెంత విచిత్రమో, అంత సాంస్కృతికం కూడా.
అసమానతలో రెండు ఆకాశాలంత తేడా...
మహిళా దినోత్సవాలు వస్తున్నాయి,వెళుతున్నాయి. రకరకాలుగా మార్చి నెల అంతా ఫెమినిజం గురించి, ఉమెన్స్ మూమెంట్ గురించి, మహిళా సాధికారత గురించి, హక్కుల గురించి మాట్లాడుతూనే ఉంటారు.కానీ ఒక పదహారేళ్ల గిరిజన అమ్మాయి తలుపు లేని ఇంట్లో, తడికలు మాత్రమే ఉండే స్నానపు గుడిసెలో, 15 ఏళ్లు దాటితే ప్రతి వాళ్ళు మద్యం సేవించే కమ్యూనిటీలో బ్రతకాల్సిన అభద్రత గురించి మాట్లాడరు. ఒక సామాజిక కార్యకర్తగా అలాంటి అమ్మాయిలని రోజూ కలుస్తూ, వాళ్ళ చదువుకోసం,నిర్ణయాధికారం కోసం పని చేస్తూ ఉంటాము మేము. గడచిన కరోనా రెండేళ్ల కాలం చాలా గాయాలు మిగిల్చింది. ఆకాశంలో సగం మాత్రమే కాదు బాధ్యతల్లో మొత్తం, అసమానతలలో రెండు ఆకాశలంత విశాలం అని కరోనా మళ్లీ నిరూపించింది.
వివక్షను బద్దలు కొట్టామా?
ఈ సంవత్సరం థీమ్ " బ్రేక్ ది బయాస్". వివక్షను బ్రేక్ చేయడంలో ఎవరు ఎంత సాధించారు? ఈ రాడార్ లో మహిళగా మనం ఎక్కడున్నాం? అనే విషయాన్ని పరిశీలిద్దాం.
✓ ఉమెన్స్ డే ఒక దినోత్సవం అయితే, ఎంతవరకు ఉత్సవం జరుపుకునే అర్హత, అవకాశం మనకి ఉంది? అని ప్రతి మహిళ తనకు తాను ప్రశ్నించుకోవలసిన తరుణమిది.
✓ బాగా చదువుకుని ఉద్యోగాల్లో వృత్తి వ్యాపారాల్లో తమదంటూ ముద్ర వేసుకున్న ఎంతోమందిని కలుస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఆర్థిక సామాజిక స్వాతంత్య్రం ఉన్న ఇలాంటి ఎంపవర్డ్ ఉమెన్ కూడా తనపరిధిలో వివక్షని, హింసని ఎదుర్కొంటోంది. ఎందుకు ఈ హింస భరిస్తున్నాం? అనే విషయంపై ఏ మహిళా మాట్లాడదు.ఏ సంస్ధ మీటింగ్ పెట్టదు.
✓ ఆర్థిక లైంగిక సామాజిక హింస అన్ని వర్గాల్లోనూ ఉంది. అర్బన్ మహిళల్లోనూ, గ్రామీణ గిరిజన మహిళల్లోనూ ఈ హింస ఓ క్రమపద్ధతిలో జరుగుతూనే ఉంది. దీనికి రకరకాల కారణాలున్నాయి. కులం,మతం ఇంకా ఇతర రాజకీయ కారణాలు అనుకుంటే, హింసించేవారు ఎవరూ తమ తప్పును ఒప్పుకోరు. ఎందుకంటే దానివల్ల వాళ్లకి ప్రత్యక్ష, పరోక్ష లాభం ఉంది కాబట్టి. కానీ, ఎందుకు బాధితులవుతున్నాం అని తెలియని పరిస్థితుల్లో నేటి ఆధునిక మహిళ ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు దీనికి అద్దం పడుతున్నాయి.
✓ ఆర్థిక స్వేచ్ఛ, లైంగిక స్వేచ్ఛ కొంతవరకు సాధించిన అమ్మాయిలు భావ స్వేచ్ఛను సాధించారా? ఎమోషనల్ డిపెండెన్సీను తగ్గించుకున్నారా? అన్న విషయం మాత్రం ఇంకా చర్చనీయాంశమే. బేటీ పఢావ్.. బేటీ బచావో లాంటి స్లోగన్లు చదివినప్పుడు నవ్వొస్తుంది నాకు. చిన్నప్పుడు వ్యాసరచన పోటీలు పెట్టేవారు. కత్తి గొప్పదా కలం గొప్పదా, మహిళలకు విద్య అవసరమా కాదా ఇలాంటివి. ఇప్పటికీ ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని గోడల మీద రాసి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు తప్ప అమ్మాయి చదువు ఆత్మవిశ్వాసానికి మొదటి మెట్టు అని ఎక్కడా రాయట్లేదు.
✓ ఇకపోతే లైంగిక స్వేచ్ఛ, ఒక మాట మాట్లాడితే వెంటనే ఆడవాళ్ళు వేసుకునే బట్టలు ద్వారా వాళ్ల వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని అంచనా వేసి వాళ్ళ జీవితాలని, నిర్ణయాలని ట్రోల్ చేసే ప్రస్తుత పరిస్థితుల్లో లైంగిక స్వేచ్ఛ వెబ్ సిరీస్‌ల వరకు పరిమితం అయింది అనిపిస్తుంది.అది కూడా మార్కెట్లో వాటి డిమాండ్‌ను బట్టి.
✓ ఇకపోతే ఆర్థిక పరమైన హక్కులు, ఇంకా ఆస్తి హక్కులు చట్టం ఎంత ఖచ్చితంగా, ఎంత క్లియర్‌గా ఉన్నా, అమలు చేసే మిషనరీ మాత్రం పితృస్వామిక విలువలతో కూడి ఉన్నప్పుడు ఆస్తి హక్కులో సమానత్వం అన్నది ఇంకా అందని ద్రాక్షలాగే ఉంది. కొండేపూడి నిర్మల గారు అనుకుంటా ఒక మాట అన్నారు సమాజం మగవాళ్ళని పోషిస్తుంది ఇది ఆడవాళ్ళని పోలీసింగ్ చేస్తుంది అని.. ఒక న్యాయవాదిగా, ఆస్తి కేసులు, విడాకుల భరణం కేసులు, అత్యాచార కేసుల , కాగితం మీద అ పరిష్కారం దొరికిన అమలులోకి రాని కేసులు చూసినప్పుడు, ఆగ్రహమే కాదు ఆలోచన కూడా వస్తుంది. సగం పైగా మంది మహిళలు అనవసరంగా విడాకులు తీసుకున్నాను, అనవసరంగా కేసు వేశాము అనే సందిగ్ధం లోనే ఉంటారు. ఈ ద్వంద్వ ప్రవృత్తికి కారణం సమాజం ఒక మహిళను చూసే తీరు.
✓ ఒక వికలాంగ మహిళ గా నేను నేర్చుకున్న మొదటి పాఠం.. నేను అంటే నా శరీరం కాదు, నా వ్యక్తిత్వం, ఆలోచనలు, తత్వం, ఆశలు, కలలు, కోరికలు.. వీటికి ఎలాంటి అంగవైకల్యం లేదు. యాక్సెప్టెన్స్ రాగానే నేను నా శరీరం పట్ల, వికలాంగత పట్ల, నేను చేయలేని విషయాల పట్ల అనవసరమైన గిల్ట్ లేదా న్యూనత ఫీల్ అవడం మానేసాను. ఆధునిక మహిళ నిరంతరం గిల్ట్ కీ, న్యూనత కు మధ్య కొట్టుమిట్టాడుతోంది. కాబట్టే, హింసకు సులువుగా బలి అవుతోంది.
మార్పు రావాల్సింది మనలోనే..
మహిళలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో రాని మార్పు సమాజంలో కూడా రాదని. ఒక సిస్టం కరప్ట్ అయితే, వైరస్ పడితే, మొత్తం క్లీన్ చేస్తాం. అలాగే మహిళలు కూడా తమ ఆలోచన ఆచరణ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మరి మరి అనిపిస్తుంది. అలాంటి అప్డేషన్ కి పోస్ట్ పాండమిక్ కన్నా మంచి తరుణం ఏముంటుంది?? సమస్యల కొత్త కొత్త కోణాలు కొత్త కొత్త ముఖాల్లో పలకరిస్తున్నప్పుడు, పరిష్కారాలు కూడా కొత్తగానే ఉండాలి కదా. తన జీవన నాణ్యత తన ప్రధాన బాధ్యత అని మహిళ అనుకోనంతవరకు, ఎన్ని మహిళా దినోత్సవాలు వారోత్సవాలు వచ్చినా,వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏమీ లేదు.
అందుకే అమ్మాయిలు అప్డేట్ అవ్వండి మీ హ్యాపీ ఉమెన్స్ డే మీ చేతుల్లోనే..!!
-వ్యాసకర్త
సాయి పద్మ, సామాజిక కార్యకర్త.