Heart Health: మహిళలూ ఇవి తిన్నారంటే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ
స్త్రీలు, పురుషులు ఎవరైనా గుండెని కాపాడుకోవాలి. ఒత్తిడి తగ్గించుకుని సమతుల్య ఆహారం తీసుకుంటే గుండె జబ్బుల వ్యాధుల దరిచేరకుండా నివారించవచ్చు.
పురుషుల్లోనే కాదు మహిళల్లోను గుండె పోటు సంభవిస్తుంది. అయితే అది వచ్చే ముందుగా మహిళల్లో కొన్ని సార్లు అస్పష్టంగా లక్షణాలు కనిపిస్తాయి. మహిళలు గుండెపోటుకు గురవడానికి వారాల ముందు నుంచి లక్షణాలు అనుభవిస్తారని పరిశోధనలు సూచిస్తున్నాయి. చాలా మంది స్త్రీలు ఈ లక్షణాలను తేలికగా తీసుకుని పట్టించుకోరు. దీని వల్లే వారిలో మరణాల రేటు పెరుగుతోంది. పురుషులతో పోలిస్తే మహిళల గుండె కాస్త చిన్నదిగా ఉంటుంది. గుండె గోడలు కూడా సన్నగా ఉంటాయి. అందువల్లే రక్తసరఫరా తక్కువగా ఉంటుంది.
మహిళల్లో మాత్రమే కలిగే పాలిసిస్టిక్ అండాశయ వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఎండో మెట్రియోసిస్ వంటివి స్త్రీలలో గుండెసంబంధిత వ్యాధులు రావడానికి ఎక్కువ కారణాలు. అందుకే గుండె మీద కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మనం తినే ఆహారం గుండెతో సహా ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు. మహిళలు ఆరోగ్యకరమైన, ధృడమైన గుండె కోసం తప్పకుండా ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోవాలి.
చిక్కుళ్ళు: చిక్కుళ్ళు ప్రోటీన్, ఫైబర్ కి పవర్ హౌస్. తక్కువ కేలరీలు ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి మీ ఆహారంలో బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, శనగలు, చిక్కుళ్ళు తీసుకోవడం మరచిపోవద్దు.
ఆలివ్ ఆయిల్: రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరిచి గుండె లయలని స్థిరీకరించడంలో సహాయపడే ఆహారాల్లో ఆలివ్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో గొప్పగా పని చేస్తుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.
తృణధాన్యాలు: ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వీటిలో అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నట్స్, గింజలు: డ్రై ఫ్రూట్స్, గింజలు నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండెతో సహా ఇతర అవయవాల పనితీరుకి ఇవఈ చాలా అవసరం. గుండె పనితీరుని అదుపులో ఉంచే విటమిన్ ఇ వనరులు ఇవి.
పొటాషియం ఉండే ఆహారాలు: మంచి మొత్తంలో పొటాషియం తీసుకోవడం వల్ల హృదయ స్పందన చక్కగా ఉంటుంది. రక్తపోటు, గుండె కండరాల సంకోచాలను, గుండె లయని స్థిరంగా ఉంచుతుంది. అరటిపండు, అవకాడో, గుమ్మడికాయలో శరీరానికి కావాల్సిన పొటాషియంని అందిస్తాయి.
వెల్లుల్లి: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు నేచురల్ బ్లడ్ థిన్నర్ గా కూడా పని చేస్తుంది. గుండెని కాపాడటంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
ఆర్గానిక్ టీ: నలుపు, తెలుపు, ఊలాంగ్, మాచా వంటి ఆర్గానిక్ టీలు గుండెకి మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ని తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: అరటిపండు ఉడకబెట్టుకుని తింటే ఈ రోగాలన్నీ నయమవుతాయ్