(Source: Poll of Polls)
Hysterectomy: గర్భసంచిలో గడ్డలు ఎవరికి వస్తాయి? ఇవి వస్తే ప్రమాదమా?
ఎక్కువమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో గర్భసంచిలో గడ్డలు రావడం కూడా ఒకటి.
మాతృత్వానికి అడ్డుపడుతున్న సమస్యల్లో గర్భసంచిలో గడ్డలు రావడం కూడా ఒకటి. ఇలా గర్భసంచిలో కణితులు ఏర్పడితే ఆ స్త్రీ తల్లి కావడం కష్టంగా మారుతుంది. అయితే దీనికి ఈ ఆధునిక కాలంలో మెరుగైన చికిత్సలు ఉన్నాయి. దీనివల్ల ఆ గడ్డలను తొలగించుకుని మాతృత్వాన్ని పొందే అవకాశాన్ని ఎంతోమంది సాధించారు. అసలు గర్భసంచిలో ఎందుకు గడ్డలు వస్తాయి? అది రాకుండా అడ్డుకోలేమా?
వైద్యులు వివరిస్తున్న ప్రకారం గర్భసంచిలో గడ్డలు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల కారణంగా ఇలా గడ్డలు పెరుగుతాయి. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు గర్భసంచిలో ఉండే ఫైబ్రాయిడ్ ల పరిమాణం పెరిగిపోతుంది. అవే గడ్డలుగా మారతాయి. వీటిపై ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ రెండు హార్మోన్ల ప్రభావం అధికంగా ఉంటుంది. ఇలా గడ్డలు ఉంటే గర్భం ధరించడం చాలా కష్టంగా మారుతుంది. ఈ గడ్డలు గర్భాశయం లోపల ద్వారం దగ్గర, గోడల పొరలకు అతుక్కుని ఎక్కడైనా ఏర్పడవచ్చు. అందుకే ఇవి ఉన్నచోట పిండం తయారు కాదు. గర్భం ధరించలేరు.
గర్భాశయంలోని లోపలి గోడల్లో ఈ గడ్డలు ఏర్పడితే ఎక్కువగా అధిక రక్తస్రావం అవుతుంది. అధిక రక్తస్రావం కావడం, గర్భం ధరించలేకపోవడం వంటి లక్షణాల ద్వారానే వీటిని గుర్తిస్తారు. స్కానింగ్లో వీటి పరిమాణం బయటపడుతుంది. ఇవి వేరుసెనగ గింజల పరిమాణం నుంచి పుచ్చకాయ సైజు వరకు పెరుగుతాయి. పిల్లలు లేని వారికి ఈ గడ్డలు వస్తే వాటిని కరిగించి లేదా తొలగించడం ద్వారా సంతానం కలిగేలా చేస్తారు. చికిత్స వాటి పరిమాణం పై ఆధారపడి ఉంటుంది. వీటిని తొలగించాక గర్భం ధరించే అవకాశం ఉంది. కొన్ని గడ్డలు మందులతోనే కరిగిపోతాయి. కొన్ని మాత్రం సర్జరీ ద్వారా తొలగించాల్సి వస్తుంది.
గర్భసంచిలో గడ్డల సమస్యతో బాధపడే వారికి రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి అధిక రక్తస్రావం అవుతుంది. అందుకే ముందుగా రక్తహీనత సమస్యకు చికిత్స చేస్తారు. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కాకుండా నియంత్రించే మందులను సూచిస్తారు. పిల్లలు లేనివారికి కణితిని తొలగించడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఉన్నవారికి గర్భసంచినే తొలగించడం ద్వారా శాశ్వత చికిత్స చేస్తారు
గర్భసంచిలో గడ్డలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా కష్టం. అవి ఎప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టారాన్ హార్లోన్లు పెరుగుతాయో మనం అంచనా వేయలేం. కాబట్టి సమస్య వచ్చాక వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవడం ఒక్కటే మార్గం.
Also read: ఇక్కడున్న ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు బాస్ అనేది గుర్తుపట్టండి, అది కూడా కేవలం 10 సెకండ్లలో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.