Honey Water: రోజూ తేనె, గోరువెచ్చని నీరు తాగుతున్నారా? లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయ్!
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ముందుగా ఎంచుకునేది తేనె, గోరువెచ్చని నీళ్ళు తాగడమే. దీన్ని తీసుకుంటే బరువు అదుపులో ఉండమే కాదు మరిన్ని ప్రయోజనాలన్నాయ్.
బరువు తగ్గించే దగ్గర నుంచి ఫ్లూ వ్యాధులను అరికట్టే వరకు తేనె అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే అందరి ఇళ్ళల్లో తేనె తప్పనిసరిగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం క్రమం తప్పకుండా తీసుకుంటే ఎంతటి కొవ్వునైనా ఇట్టే కరిగించేస్తుంది. బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో దీని తర్వాతే ఏదైనా. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. శరీరంలోని మంటని తగ్గిస్తాయి. జలుబు, ఫ్లూ నివారణగా అద్భుతంగా పని చేస్తుంది.
తేనె, గోరువెచ్చని నీటి వల్ల ప్రయోజనాలు
రోగనిరోధక శక్తి: తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వ్యాధులతో పోరాడతాయి. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తేనె, గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తాగితే జలుబు, ఫ్లూ నివారించవచ్చు. గొంతు నొప్పి, దగ్గుని కూడా ఇది తగ్గించేస్తుంది.
జీర్ణక్రియకి తోడ్పడుతుంది: తేనె, గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తుంది. జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
డిటాక్సీ ఫై: తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడతాయి. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గోరువెచ్చని నీటితో దీన్ని కలపడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకి పోతాయి. శరీరం హైడ్రేషన్ గా ఉండేందుకు సహకరిస్తుంది.
ఒత్తిడి అదుపులో: ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి పెరిగి నిద్రలేమి సమస్యతో ఎంతో మంది సతమతమవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇది చక్కని పరిష్కారం. మనసు, మెదడు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు కొద్దిగా తేనె, గోరువెచ్చని నీటిని కలిపి తాగండి. ఇది మనసుకి విశ్రాంతినిస్తుంది. పడుకునే ముందు దీన్ని తాగితే ప్రశాంతమైన నిద్ర వచ్చేలా చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తేనెలో సహజ చక్కెరలు ఉన్నాయి. ఇవి మనసుని ప్రశాంతంగా ఉంచి విశ్రాంతిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
తేనెని ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. గోరువెచ్చని నీటిలో మాత్రమే కాదు పాలు, జీలకర్ర నీళ్ళు, హెర్బల్ టీ లో కలుపుకుని తాగొచ్చు. నిద్రపోవడానికి ఒక గంట ముందు వెచ్చని పాలలో తేనే కలుపుకుని తాగితే హాయిగా నిద్రపడుతుంది. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. తేనె దంత సమస్యల్ని అడ్డుకుంటుంది. నోరు చెడు వాసన రాకుండా అడ్డుకుంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో తేనె, గోరువెచ్చని నీటిని తాగితే సమర్థవంతంగా పని చేస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
అధిక వేడి నీటిలో తేనె ఎప్పుడూ కలపకూడదు. దానిలోని పోషకాలు నశించిపోతాయి. అందుకే గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. శుద్ధి చేసిన్ తేనె మాత్రమే వినియోగించాలి. ముడి తేనె తీసుకుంటే పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కదా అని అతిగా తీసుకుంటే కొందరిలో పొట్ట ఉబ్బరం సమస్యల్ని తీసుకొస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పిజ్జా తిని కూడా బరువు తగ్గొచ్చు? ఇలా చేస్తేనే బెనిఫిట్!