Coffee: కాఫీ మరింతగా ఆస్వాదించాలా? వీటిని మిక్స్ చేసుకుని తాగితే ఆ కిక్కే వేరు
కాఫీ తాగే వారు మరింతగా ఆ పానీయాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా చేయండి
కాఫీ గొంతులో పడనిదే చాలా మందికి తెల్లారదు. కాఫీ తాగాకే బెడ్ దిగే వారు కూడా ఎంతో మంది. ప్రపంచవ్యాప్తంగా కాఫీకి ఉన్న డిమాండ్ ఇంతా అంతా కాదు. అందులోనూ చాలా అధ్యయనాలు రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం వల్ల ఆరోగ్యమని చెప్పడం వల్ల కూడా కాఫీకి మరింతగా డిమాండ్ పెరిగిపోయింది. ఇక వానాకాలంలో వేడి వేడి కాఫీ గొంతులో పడుతుంటే ఆ హాయి ఎలా ఉంటుందో వర్ణించడానికి మాటలు చాలవు. కాఫీ నెక్ట్స్ లెవెల్లో ఆస్వాదించాలనుకుంటే ఆ పానీయంలో ఇంట్లో ఉన్న ఈ పదార్థాలు కలుపుకోండి. రుచి అదిరిపోతుంది. అన్నట్టు ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంచే ఉత్పత్తుల్లే కాబట్టి. కలుపుకుని తాగడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా.
దాల్చిన చెక్క
సుగంధ ద్రవ్యాలు లేదా మసాలా దినుసులలో దాల్చిన చెక్కది ప్రత్యేక స్థానం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ముందుంటుంది. కాఫీలో దాల్చిన చెక్ వేసి మరిగించినా లేదా దాల్చిన చెక్క పొడిని కలుపుకున్నా రుచి అదిరిపోతుంది. ఒక్కసారి ఇలా తాగడం మొదలుపెట్టారో రోజూ తాగాలనిపించేస్తుంది.
వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్
కేకులు చేసే వారింట్లో కచ్చితంగా ఉండేది వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్. చాలా మందికి కాఫీలో కాఫీ క్రీములు కలుపుకుని క్రీమీ ఫ్లేవర్ ఆస్వాదించే అలవాటు ఉంటుంది. అలాంటివారికి వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ సరైన ఎంపిక. కాఫీకి దీన్ని కలపగానే మరింత రుచికరంగా మారుతుంది. అలాగని ఎక్కువ మిక్స్ చేయకూడదు. కప్పుకు రెండు మూడు చుక్కలను మించకూడదు.
యాలకులు
ఒకప్పుడు కాఫీలో యాలకులు వేసుకుని తాగే అలవాటు ఉండేది. తరువాత అది కాలక్రమేణా అంతరించిపోయింది. కాఫీలో చిటికెడు యాలకుల పొడి వేసి మరిగించి తాగితే అరుదైన రుచి వస్తుంది. అద్భుతమైన వాసన మీ కాఫీని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.
జాజికాయ
జాజికాయ పొడిని రెడీ చేసి పెట్టుకోవాలి. లేదా కాఫీని మరిగిస్తున్నప్పుడు చిన్న జాజికాయ ముక్కని వేసేయాలి. ఇది కాఫీకి విలక్షణమైన, ఆహ్లాదకరమైన తీపిని జోడిస్తుంది. మరీ అధికంగా మాత్రం వేసుకోవద్దు. రుచి మారిపోతుంది. చిటికెడు పొడి లేదా చాలా చిన్న ముక్క వేయాలి.
పెప్పర్మింట్ ఆయిల్
ఈ ఆయిల్ సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. పిప్పర్ మెంటు ఫ్లేవర్ కాఫీతో కలిపి తాగితే ఆ కిక్కే వేరు. పిప్పర్ మెంటు రుచిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. కాఫీలో కేవలం ఒకటి లేదా రెండు చుక్కల పిప్పరమెంటు నూనెను ఉపయోగించడం వల్ల కాఫీకి అద్భుతమైన రుచి వస్తుంది. అంతేకాదు మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
Also read: వరలక్ష్మీ వ్రతానికి బెల్లం అన్నం, పులగం రెసిపీలు ఇవిగో, ఇలా సింపుల్‌గా చేసేయచ్చు
Also read: డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన నాలుగు కూరగాయలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.