Vitamin D: విటమిన్-D లోపంతో కండరాల నొప్పులు - ఇవి తింటే ఉపశమనం
విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యం. ఇది లోపించడం వల్ల కండరాలు త్వరగా శక్తిని కోల్పోతాయట.
శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అన్నీ సక్రమంగా అందినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఏ ఒక్కటి లోపించినా కూడా ఏదో ఒక సమస్య బయటపడుతుంది. చలికాలంలో ఎక్కువగా మంది విటమిన్-D లోపంతో బాధపడతారు. కారణం సూర్యరశ్మి తగలకపోవడం. సూర్యకాంతి ద్వారా శరీరానికి తగినంత విటమిన్-D లభిస్తుంది. కానీ చలికాలంలో దాన్ని పొందటం కొంచెం కష్టం అవుతుంది. అందువల్లే ఎక్కువ మంది ఈ లోపంతో బాధపడతారు.
విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. ఇది లోపించడం వల్ల గుండె జబ్బులు మాత్రమే కాదు కండరాలు కూడా బలహీనంగా మారిపోతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు ఈ విటమిన్ చాలా అవసరం. కానీ ఈ విటమిన్ లోపం వల్ల కండరాల నష్టం వేగంగా ఉంటుందని కొత్త అధ్యయనం చెబుతోంది. సాధారణంగా వయస్సు మళ్లిన వారిలో కండరాలు బలహీనంగా మారడం జరుగుతుంది. కానీ విటమిన్ డి లోపం వల్ల అది మరింత ఎక్కువగా ఉంటుందని తేలింది. కాల్సిఫైడ్ టిష్యూ ఇంటర్నేషనల్, మస్క్యులోస్కెలెటల్ రీసెర్చ్‌లో ఈ అధ్యయనం నిర్వహించింది. 50 సంవత్సరాలు పైబడిన దాదాపు 3205 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.
నాలుగేళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వ్యక్తుల్లో కండరాల బలహీనత 70 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకునే వాళ్ళు, బోలు ఎముక వ్యాధి రోగులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ విటమిన్ లోపం వల్ల ఎముకలకే కాదు గుండెకి కూడా నష్టం వాటిల్లుతుంది. దీన్ని ఆహార పదార్థాల కంటే సూర్యరశ్మి ద్వారా పొందటం సులభం.
విటమిన్ డి అందించే ఆహార పదార్థాలు
⦿ పుట్ట గొడుగులు
⦿ పాలు
⦿ గుడ్లు
⦿ సాల్మన్, సార్డినెస్ చేపలు
⦿ కాడ్ లివర్ ఆయిల్
విటమిన్ డి ఎముకలని బలోపేతం చేస్తుంది. కండరాలు బలహీనంగా మారకుండా కాపాడుతుంది. ఇవి రెండు వయస్సు పైబడే కొద్ది జరుగుతాయి. కండరాలు ధృడంగా ఉంచుకునేందుకు మార్గాలు ఉన్నాయి. అవేంటంటే..
⦿ విటమిన్ డి ఉండే ఆహారాన్ని తినడం
⦿ తగినంత కాల్షియం పొందటం
⦿ సాల్మన్, చికెన్, టర్కీ వంటి లీన్ ప్రోటీన్లు తీసుకోవడం
⦿ క్రమం తప్పని వ్యాయామం
71 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు రోజుకి 800 IU విటమిన్ డి పొందాలి. మిగతా వాళ్ళు రోజుకి 600 IU పొందేలా చూసుకోవాలి. విటమిన్-డి లోపం వల్ల కొందరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. మరికొందరిలో ఒత్తిడి, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్ వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి.. శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్తపడటమే కాకుండా, మీరు తీసుకొనే ఆహారంలో కూడా విటమిన్-డి ఉండేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. వ్యాయామం కూడా తప్పనిసరి. స్త్రీలు, వృద్ధులు రెగ్యులర్‌గా విటమిన్-డి స్క్రీనింగ్ చేయించుకోవడం ముఖ్యం. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను, కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్-డి అవసరమవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మీ గోళ్ల మీద తెల్లటి మచ్చలు ఉన్నాయా? మీలో ఈ సమస్య ఉన్నట్లే!