Periods: పీరియడ్స్ సమయంలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే, ఇలాంటి ఆహారాలు తినండి
పీరియడ్స్ వచ్చాక మహిళలకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి
పీరియడ్స్ ఒక్కో స్త్రీకి ఒక్కోలా ఉంటాయి. కొందరికి మూడు రోజులు హ్యాపీగా గడిచిపోతాయి. మరికొందరికి మాత్రం నరకం చూపిస్తాయి. పొట్ట నొప్పితో పాటు విపరీతమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. మరికొందరు చాలా నిరాశగా, నీరసంగా మారిపోతారు. వారిలో మూడు స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానికి చికాకు పడుతుంటారు. అధిక రక్తస్రావం కావడం వల్ల శరీరం అసౌకర్యంగా ఉంటుంది. దీని వల్ల వారు చిరాకు పడుతూ ఉంటారు. ఆహారం కూడా తినాలనిపించదు. ఇలా పీరియడ్స్ సమయంలో ఆహారం తినకపోతే మరింతగా నీరసించే అవకాశం ఉంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల మూడు రోజులు సాఫీగా ప్రశాంతంగా సాగిపోతాయి. నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. చికాకు, అలసట, నీరసం వంటివి తగ్గుతాయి.
వేడి వేడి అల్లం టీని పీరియడ్స్ సమయంలో రోజుకు రెండుసార్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరంలోని కండరాల నొప్పిని తగ్గిస్తుంది. దీనివల్ల శరీరం అసౌకర్యంగా అనిపించదు. పీరియడ్స్ ప్రశాంతంగా, సాఫీగా సాగుతాయి. అలాగే తాజాగా తీసిన పండ్ల రసాలను తాగుతూ ఉండండి. నీళ్లు కూడా అధికంగా తాగండి. పెరుగు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు నిండిన బాదం పప్పులు, పిస్తాలు, వాల్‌నట్స్ వంటివి తింటూ ఉండండి. ఇవన్నీ కూడా తక్షణ శక్తిని ఇస్తాయి. పొట్టకి హాయిగా అనిపిస్తాయి. అధిక రక్తస్రావం అవుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. శరీరం ఎక్కువ మొత్తంలో రక్తాన్ని కోల్పోవడం వల్ల నీరసంగా మారుతుంది. కాబట్టి తిరిగి రక్తాన్ని నింపే ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవాలి. ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కోల్పోయిన రక్తం మళ్లీ భర్తీ అవుతుంది. కాబట్టి పాలకూర, గుమ్మడికాయ గింజలు, అరటి పళ్ళు, పాలు, పెరుగు, చేపలు, మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు, పప్పులు వంటివి అధికంగా తింటూ ఉండండి. వీటి వల్ల రక్తం శరీరంలో మళ్లీ చేరుతుంది.
శరీరంలో కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి. లేకుంటే పీరియడ్స్ సమయంలో కాళ్లు విపరీతంగా నొప్పి వచ్చే అవకాశం ఉంది. కీళ్ల నొప్పులు కూడా రావచ్చు. కాబట్టి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. డార్క్ చాక్లెట్లు రోజుకో ముక్క తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరానికి చాలా అవసరం అయినవి. పీరియడ్స్ సమయంలో ఉప్పు అధికంగా వాడకండి. అలాగే చక్కెర పదార్థాలను తినడం తగ్గించండి. కాఫీకి దూరంగా ఉండండి. కారంతో నిండిన పదార్థాలను తినకండి. ఆల్కహాల్‌కు కూడా దూరంగా ఉండండి. ఇవన్నీ కూడా మీ పీరియడ్స్ ను కష్టతరంగా మారుస్తాయి.
Also read: టేస్ట్ బాగుందని పనీర్ అధికంగా లాగిస్తున్నారా? ఇలాంటి సమస్యలు రావచ్చు
Also read: త్వరగా బరువు తగ్గేందుకు వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోపోతే కష్టాలు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.