Womens Day Special Desserts : ట్రెడీషనల్ స్వీట్ అమ్మకి.. ట్రెండీ స్వీట్ సిస్టర్‌కి.. సింపుల్ రెసిపీలు ఇవే
Womens Day 2024 : ఈ ఉమెన్స్ డే రోజు ఇంట్లో మీ అమ్మకి లేదా భార్యకి స్వీట్‌గా ఏమైనా తయారు చేసి పెట్టాలనుకుంటారా? అయితే వంటరాదని బాధపడకండి. ఇక్కడ సింపుల్‌గా చేయగలిగే రెసిపీలు ఉన్నాయి.
Easy Dessert Recipes : సాధారణంగా వంటను ఎక్కువ ఆడవారే చేస్తారు. దానర్థం మగవారు చేయరని కాదు. కొందరు మగవారు వంటను చాలా బాగా చేస్తారు. మరికొందరికి అసలు వంట చేయడమే రాదు. అయితే ఉమెన్స్ డే రోజు మీ ఇంట్లోని ఆడవారికి కమ్మని స్వీట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని గిఫ్ట్లుకొన్నా సరే రాని ఆనందం.. వారికోసం మీరు స్పెషల్‌గా ఓ డిష్ చేస్తే వస్తుంది. కరెక్టే కానీ మాకు వంటరాదు.. అని ఆలోచిస్తున్నారా? అస్సలు కంగారు పడకండి. ఈరోజు మీ ఇంట్లోవారి నోరు తీపి చేసేలా ట్రెండీ, ట్రెడీషనల్ స్వీట్స్‌ని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మీ తల్లి, సోదరి, భార్య లేదా స్నేహితురాలిని తియ్యని డెజర్ట్‌తో ఆశ్చర్యపరచడానికి ఇవి చాలా మంచి ఎంపిక. పైగా వీటీని తయారు చేయడం కూడా చాలా సింపుల్. అయితే రెండు డిష్‌లు ఎందుకు అని ఆలోచిస్తున్నారా? అమ్మలకు ట్రెడీషనల్గా చేసే స్వీట్లు నచ్చుతాయి. భార్య, చెల్లికి కాస్త ట్రెండీగా స్వీట్ తయారు చేసిపెట్టవచ్చు. వీటిని చేయడానికి పెద్ద సమయమేమి పట్టదు. ఇప్పుడు మనం చేసే డిష్‌లు ఏంటో.. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. రెసిపీలు ఎలా చేయాలో చూసేద్దాం.
కేసరి ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పాలు - 1 లీటరు
బియ్యం - అరకప్పు
చక్కెర - అరకప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
బాదం, జీడిపప్పు, పిస్తా - పావు కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
తయారీ విధానం
ముందుగా బియ్యం కడిగి.. నీటిని వడగట్టి ఓ గంట నానబెట్టాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి.. పాలు వేయాలి. అవి మరుగుతున్న సమయంలో.. ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసి బాగా కలపాలి. స్టౌవ్‌ను సిమ్‌లో ఉంచి.. అన్నాన్ని పాలల్లో ఉడికించాలి. గిన్నె చివర బియ్యం అంటుకోకుండా.. తరచుగా దానిని గరిటతో తిప్పాలి. అన్నం మెత్తగా, పాలు చిక్కబడేవరకు ఉడికించాలి. దీనికి 20 నిమిషాలు పట్టొచ్చు.
అన్నం ఉడికిన తర్వాత మిశ్రమం చిక్కగా అయ్యాక.. దానిలో పంచదార, నానబెట్టిన కుంకుమపువ్వు వేయాలి. పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపాలి. ఈ సమయంలో ఖీర్ బాగా గట్టిగా అయిందనుకుంటే.. మరికొన్ని పాలు తీసుకుని.. వేడి చేసి దీనిలో మిక్స్ చేసుకోవాలి. స్టౌవ్ వెలిగించి చిన్న కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. వాటిని ఖీర్‌లో వేయాలి. చివర్లో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మరో 5 నిమిషాలు ఉడికించి స్టౌవ్ ఆపేయాలి. ఇది వేడిగా సర్వ్ చేసినా బాగానే ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక తినిపించినా బాగానే ఉంటుంది.
ట్రెండీ స్వీట్.. వెనిలా మగ్ కేక్
కావాల్సిన పదార్థాలు
మైదా పిండి - 2 కప్పులు
పంచదార - 2 టేబుల్ స్పూన్లు
బటర్ -2 టేబుల్ స్పూన్లు
పాలు - అరకప్పు
బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
ఉప్పు - చిటికెడు
వెనిలా ఎసెన్స్ - అర టీస్పూన్
తయారీ విధానం
ముందుగా కప్పులో మైదా, పంచదార, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. పాలు, బటర్, వెనిలా ఎసెన్స్ వేసి.. మిశ్రమాన్ని మృదువైనంత బాగా కలపాలి. ఇప్పుడు మైక్రోవేవ్‌ను 70 సెకన్లకు ప్రీ హీట్ చేయండి. దానిలో మగ్ పెట్టి బేక్ సరి.. వేడి వేడి మగ్ కేక్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం.. ఉమెన్స్ డే రోజు కోసం.. ఈ రోజు నుంచే వంటగదిలో మీకు కావాల్సిన పదార్థాలు వెతుక్కోవడం స్టార్ట్ చేయండి.
Also Read : బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ కోసం ఈ మేకప్ టిప్స్ ఫాలో అయిపోండి