Surya Mudra: రోజుకో పదినిమిషాలు సూర్యముద్ర... డయాబెటిక్ రోగులకు ఎంతో మేలు
యోగాతో రోజు మొదలుపెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. యోగాలో భాగం ప్రాణాయామం.
ప్రాణాయామంలో భాగంగా రకరకాల ముద్రలను చేతులతో వేస్తారు. ప్రతి ముద్రకు ఒక కారణం ఉంది. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో సూర్య ముద్ర కూడా ఒకటి. పద్మాసనం వేసుకుని కూర్చుని చేసే ప్రాణాయామంలో సూర్య ముద్ర ముఖ్యమైనది. రోజుకు పదినిమిషాల పాటూ సూర్య ముద్ర వేయడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. మానసిక, శారీరక సమస్యలకు దీని ద్వారా ఉపశమనం పొందచ్చు. దీన్ని అగ్ని ముద్ర అని పిలిచేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ముద్ర శరీరంలో అగ్నిని రాజేస్తుంది.
ఎలా వేయాలి?
ప్రశాంతంగా కూర్చుని ఊపిరి గట్టిగా తీసి వదులాలి. ఇప్పుడు మీ ఉంగరపు వేలిని ముందుకు వంచాలి. దాన్ని మీ బొటనవేలితో పట్టి ఉంచాలి. అలా అని మరీ గట్టిగా కాదు, తేలికగా. బొటనవేలితో చాలా తక్కువ ప్రెషర్ నే ఉంగరపు వేలిపై కలిగించాలి. యోగా శాస్త్రం ప్రకారం మీరెంత గట్టిగా ఒత్తుతుంటే శరీరంలో అంతగా అగ్ని పుడుతుంది. కాబట్టి అధికంగా నొక్కడం వల్ల నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది.
ఎన్ని ప్రయోజనాలో...
1. రోజూ పద్మాసనంలో ప్రశాంతంగా కూర్చుని సూర్య ముద్ర వేసే వారిలో నిద్రలేమి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది కనుక నిద్ర చక్కగా పడుతుంది.
2. మనిషిని కుదురుగా ఉంచని ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగ, కుటుంబ సమస్యలు మానసికంగా కుంగుబాటును తెస్తాయి. దాని బారిన పడకుండా ఉండాలంటే రోజూ సూర్య ముద్ర వేయాలి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
3. మూత్రాశయ సమస్యలను కూడా సూర్య ముద్ర తగ్గిస్తుంది. మూత్రం సరిగా రాక ఇబ్బంది పడేవారికి ఈ ముద్ర మేలు చేస్తుంది. శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గిస్తుంది.
4. డయాబెటిక్ రోగులు త్వరగా ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు. వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. సూర్య ముద్ర వేయడం వల్ల వారి ఆరోగ్యం బావుంటుంది.
5. రోజూ నీరసంగా అనిపిస్తోందా, శక్తి లేనట్టుగా భావిస్తున్నారా... అయితే సూర్య ముద్ర ప్రయత్నించండి. శరీరంలో శక్తి స్థాయిలు పెంచడంలో ఈ ముద్ర పనిచేస్తుంది. ఉత్సాహం మారుతారు. అలసట దరిచేరదు. మనిషిని చురుగ్గా మార్చడంలో సూర్యముద్ర చాలా ఉత్తమమైనది.
6. శరీరంలో ఇన్‌ఫ్లమ్మేషన్ కలిగే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. ఇన్‌ఫ్లమ్మేషన్ అంటే వాపులు, నొప్పుల్లాంటివి. సూర్యముద్ర వాటిని రాకుండా అడ్డుకుంటుంది.
7. ఆహారం జీర్ణం కాక ఇబ్బందిపడేవారికి కూడా సూర్యముద్ర చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.
8. గుండె ఆరోగ్యానికి ఈ ముద్ర వేయడం చాలా అవసరం. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గాలంటే మాత్రం రోజుకు రెండుసార్లు 20 నిమిషాల పాటూ ఈ ముద్రను వేయాలి.
ఎప్పుడు చేయాలి?
సూర్యముద్రను కొన్ని సమయాల్లో చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. సూర్యోదయానికి ముందు, ఆహారం తినకముందు చేస్తే చాలా మంచిది. ఆహారం తిన్నాక కూడా చేయచ్చు కానీ తిన్న వెంటనే మాత్రం కాదు. ఓ గంట, రెండు గంటల తరువాత చేసుకోవచ్చు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.