Tea for BP Patients : రక్తపోటు ఉన్న వారు టీ తాగవచ్చా? లేదా? బీపీ ఉన్నవారు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Tea and Blood Pressure : రక్తపోటు రోగులకు టీ సురక్షితమేనా? బీపీపై టీ ప్రభావం ఎలా ఉంటుంది? వైద్యులు ఇస్తున్న సూచనలు ఏంటో చూసేద్దాం.

Tea and Blood Pressure Connection : టీ అనేది ఒక డ్రింక్ కాదు. అది చాలామందికి ఓ ఎమోషన్. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. వివిధ సందర్భాల్లో.. వివిధ కారణాలతో చాలామంది టీ తాగుతూ ఉంటారు. టీ ఆరోగ్యానికి అంత మంచిది కాకపోయినా.. దాదాపు నిద్రలేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి పడుకునేలోపు ఏదొక సందర్భంలో టీని తాగుతూనే ఉంటారు. అయితే బీపీ సమస్యతో ఇబ్బంది పడేవారు టీని తాగవచ్చా? తాగితే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? నిపుణుల సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోతుంది. అయితే బీపీ సమస్యతో ఇబ్బంది పడేవారు టీని తాగవచ్చా? ఒక కప్పు టీ తాగితే పర్లేదా? ఏమి కాదులే అని తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త. బీపీ సమస్యతో ఇబ్బంది పడేవారు ఓ కప్పు టీ తాగడం అనేది చిన్న విషయం కాదని చెప్తున్నారు డాక్టర్ బిమల్ ఛాజేడ్. ఎందుకంటే టీ అనేది రక్తపోటును చాలా వరకు ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు.
కెఫిన్, బీపీ మధ్య లింక్ ఇదే
టీలో ఉండే కెఫిన్ తాత్కాలికంగా రక్తపోటును పెంచుతుందని డాక్టర్ బిమల్ ఛాజేడ్ తెలిపారు. అలాగే కొంతమంది కెఫిన్‌కు చాలా సున్నితంగా ఉంటారని.. అటువంటి వ్యక్తులలో టీ తాగిన వెంటనే రక్తపోటు పెరుగుతుందని తెలిపారు.
రక్తపోటు ఉన్నవారు టీ తాగవచ్చా?
డాక్టర్ ఛాజేడ్ ప్రకారం.. రక్తపోటు రోగులు టీని పూర్తిగా వదిలివేయడమే మంచిదని చెప్తున్నారు. మానుకోలేని పరిస్థితుల్లో దానిని తీసుకునే పరిమాణం తగ్గించాలని చెప్తున్నారు. అలాగే ఎలాంటి టీ తీసుకుంటున్నారు అనే అంశాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. బీపీ ఉన్నవారు రోజుకు కప్పు టీ తీసుకోవడం పెద్ద ప్రమాదం కాదని.. కానీ తక్కువ మోతాదులో తీసుకుంటే మరింత మంచిదని చెప్తున్నారు. బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ వంటి కెఫిన్ తక్కువగా ఉండేవాటిని ఎంచుకుంటే మరీ మంచిదని వెల్లడించారు. గ్రీన్ టీలో, హెర్బల్ టీలలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవచ్చని.. అవి గుండె ఆరోగ్యానికి మంచివని చెప్తున్నారు. హెర్బల్ టీలలో భాగంగా తులసి, అల్లం లేదా దాల్చిన చెక్క వంటి హెర్బల్ టీలు మంచి ఆప్షన్స్ అని తెలిపారు. వీటిని తీసుకోవడం వల్ల టీ తాగారన్నా తృప్తి కలగడంతో పాటు.. BP కూడా కంట్రోల్ అవుతుందని తెలిపారు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..
ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే.. బీపీ ఉన్నా లేకున్నా ఖాళీ కడుపుతో టీ తాగవద్దని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ పెరిగి.. హృదయ స్పందనలో సమస్యలకు దారి తీస్తుందని చెప్తున్నారు. టీతో పాటుగా ఉప్పుతో నిండిన, వేయించిన స్నాక్స్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. దీనివల్ల సోడియం స్థాయి పెరిగి.. రక్తపోటు సమస్యను మరింత పెంచుతుందని తెలిపారు. రాత్రి నిద్రపోయే ముందు టీ తాగవద్దని దీనివల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే సరైన నిద్ర లేకుంటే బీపీ ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. బీపీ కంట్రోల్లో లేకుంటే టీ తాగడం పూర్తిగా ఆపేయాలని వైద్యులు సూచిస్తున్నారు.






















