Karivepaku Pachadi : నోరూరించే కరివేపాకు పచ్చడి.. అదిరే రుచి రావాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి
Curry Leaf Pickle : కొన్ని ఫుడ్స్ టేస్ట్ కోసమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా తినాలి. కానీ ఒకటే ఫుడ్లో టేస్ట్, ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందితే కచ్చితంగా చేసుకుని తినాలి. అదే కరివేపాకు పచ్చడి.
Karivepaku Roti Pachadi Recipe : కరివేపాకు జుట్టుకు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. కానీ.. కూరల్లో వేస్తే దీనిని తీసి పక్కన పడేసేవారుంటారు. అయితే ఇదే కరివేపాకును రుచిగా చేస్తే పక్కన పడేయడం కాదు కదా.. లొట్టలు వేసుకుని తింటారు. కరివేపాకును ఇలా టేస్టీగా చేయాలనుకుంటే హాయిగా కరివేపాకు పచ్చడి (కరివేపాకు తొక్కు)ను రెడీ చేసుకోవచ్చు. దీనిని చేసుకోవడం చాలా తేలిక. పైగా మంచి రుచి కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? రోటిలో ఎలా చేసుకోవాలి? మిక్సీలో ఎలా చేయొచ్చు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మెంతులు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మినపప్పు - గుప్పెడు
శనగపప్పు - గుప్పెడు
ధనియాలు - గుప్పెడు
కరివేపాకు - రెండు కప్పులు
పల్లీలు - గుప్పెడు
ఎండుమిర్చి - 15
వెల్లుల్లి - 1 పెద్దది
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - రుచికి తగినంత
చింతపండు - నిమ్మకాయ అంత ఉండాలి.
ఉల్లిపాయలు - 1 ముక్కలు
నూనె - 3 టీస్పూన్స్
తయారీ విధానం
ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి. అరగంట నానితే గుజ్జు బాగా వస్తుంది. కరివేపాకును కడిగి పొడి ఆరనిచ్చేందుకు పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో రెండు టీ స్పూన్లు నూనె వేయండి. ముందుగా దానిలో మెంతులు, జీలకర్ర వేయాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు మినపప్పు, శనగపప్పు వేయాలి. ఇవి మంచిగా కరకరలాడేలా రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా వేగితే రుచిమంచిగా వస్తుంది.
శనగపప్పు, మినప్పపు వేగుతున్నప్పుడు దానిలో పల్లీలు వేసుకోవాలి. అవి కూడా వేగిపోతున్నప్పుడు ధనియాలు వేసుకోవాలి. అనంతరం ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. ఇవి వేగిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. స్టౌవ్ వెలిగించి మరో కడాయిపెట్టి దానిలో ఓ స్పూన్ నూనె వేసుకుని కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఓ రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. దానిని పక్కన పెట్టండి. సాధారణంగా ఈ తొక్కును రోటిలో చేసుకుంటే బాగుంటుంది.
రోటీలో చేసుకుంటే..
కరివేపాకు కాకుండా ముందు చేసిన మిశ్రమాన్ని దంచుకోవాలి. ఆ సమయంలోనే పసుపు, ఉప్పు వేసుకోవాలి. మెత్తగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా దీనిలో వేయాలి. ఇప్పుడు మరోసారి దంచుకుని.. దానిలో వేయించుకున్న కరివేపాకు వేసి దంచుకోవాలి. చివర్లో మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దంచుకోవచ్చు. అంతే దీనిని తీసి అన్నంతో కలిపి తినడమే.
మిక్సీలో అయితే..
చింతపండు తప్పా.. అన్నీ మిక్సీ జార్లో వేసి వేయించుకోవాలి. మీకు కాస్త బరకగా కావాలనుకుంటే మరీ మెత్తగా చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. దానిలో ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసుకుని.. మరోసారి మిక్సీ చేయాలి. ఈ పచ్చడిని ఓ గిన్నెలో వేసుకుని.. ఉల్లిపాయలను మీడియం ముక్కలుగా కోసుకుని.. దానిలో కలుపుకోవచ్చు.
నిల్వ చేసుకోవాలంటే..
పచ్చడి నిల్వ ఉండాలంటే దానిలో ఉల్లిపాయలు వేసుకోకూడదని గుర్తించుకోవాలి. ఉల్లిపాయలు వేస్తే త్వరగా పాడవుతుంది. ఉల్లిపాయలు లేకుండా చేసుకుని.. గాలి చొరబడని కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు వారాలు ఉంటుంది. మీరు తినేప్పుడు దానిలో ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఉల్లిపాయ తినము అనుకుంటే వేసుకోకపోయినా రుచిగానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి.. ఈ కరివేపాకు పచ్చడి వేసుకుని తింటే ఇంకే కూర అవసరం లేదు అనేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది.
Also Read : దోశ పిండి లేకుండా టేస్టీ దోశలు ఇలా సింపుల్గా చేసేయండి.. చట్నీ కాంబినేషన్ ఇది అయితే పర్ఫెక్ట్