Sweeteners: చక్కెరకు బదులు స్వీటెనర్లు వాడుతున్నారా? డయాబెటిస్ బాధితులకు లాభమా? నష్టమా?
చక్కెరకు బదులుగా స్వీటెనర్లు ఉపయోగించడం ఆరోగ్యాని మంచిదంటున్నారు నిపుణులు. ఆకలిని అదుపు చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయంటున్నారు.
Sweeteners Do Not Spike Hunger Levels: చక్కెరతో ఆరోగ్యానికి లాభాలతో పోల్చితే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రకరకాలుగా చక్కెరను తీసుకుంటాం. కూల్ డ్రింక్స్, జ్యూస్ లు, టీ, కాఫీలు సహా పలు పదార్థాల్లోనూ చక్కెరను ఉపయోగిస్తాం. శరీరానికి చక్కెర కొంత మొత్తంలో అవసరం అయినా, ఎక్కువగా తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. శరీరంలో ఎక్కువ క్యాలరీలు పెంచుతుంది. ఒబేసిటీ, డయాబెటిస్, బీపీ సహా గుండె సంబంధ వ్యాధులకు కారణం అవుతుంది.
శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా స్వీటెనర్లు
శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా స్వీటెనర్లు వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్వీటెనర్లతో ఆకలి పెరగకపోగా, రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయంటున్నారు. టైప్ 2 డయాబెటిస్ తో ఉన్న వారికి ఇవి చాలా మేలు చేస్తాయంటున్నారు. లండన్ లోని లీడ్స్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన స్టడీలో స్వీటెనర్లను ఉపయోగించడం వల్ల ఆకలిపై ఎలాంటి ప్రభావం పడదని తేలింది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఊబకాయం లాంటి సమస్యలను సైతం తగ్గించుకోవచ్చని తెలిపింది.
స్వీటెనర్లు ఆహారంలో చక్కెరను సమర్థవంతంగా భర్తీ చేస్తాయి. శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. నిజానికి చక్కెర స్థానంలో స్వీటెనర్లను ఉపయోగించే విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని అధ్యయనాలు స్వీటెనర్లు తీసుకోవడం వల్ల ఆకలిని పెంచడంతో పాటు డయాబెటిస్, ఊబకాయం వస్తుందని చెప్తే, మరికొన్ని ఆకలిని కంట్రోల్ చేయడంతో పాటు ఊబకాయం లాంటి సమస్యలు రావని సూచిస్తున్నాయి. తాజాగా అధ్యయనం మాత్రం స్వీటెనర్లు ఆకలిని కంట్రోల్ చేస్తాయని వెల్లడించింది. అంతేకాదు, చక్కెరకు బదులుగా వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మేలు కలిగే అవకాశం ఉందని తెలిపింది.
డయాబెటిస్, ఒబేసిటీ కంట్రోల్
టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం లాంటి సమస్యలను అరికట్టాలంటే చక్కెర వినియోగాన్ని తగ్గించాలని లీడ్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ సైకాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ కేథరీన్ గిబ్బన్స్ వెల్లడించారు. “ప్రత్యామ్నాయం లేకుండా చక్కెర వినియోగాన్ని తగ్గించడం కష్టం. అందుకే చక్కెర స్థానంలో స్వీటెనర్లను ఉపయోగించడం మంచిది” అని అభిప్రాయపడ్డారు. నిజానికి స్వీటెనర్లు తీసుకోవడం వల్ల చక్కెరతో పోలిస్తే ఆకలి విషయంలో ఎలాంటి తేడాలు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు, రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు కూడా తగ్గినట్లు గుర్తించారు. ఆకలిని అదుపు చేయడంతో పాటు బరువును కంట్రోల్ చేసుకునేందుకు స్వీటెనర్ల బాగా ఉపయోగపడతాయన్నారు. చక్కెరతో పోల్చితే స్వీటెనర్లతో ఆరోగ్యానికి చాలా మేలుకలుగుతుందని తెలిపారు. అంతేకాదు, ఇంతకాలం స్వీటనర్ల విషయంలో ఉన్న భిన్నాభిప్రాయాలకు తాజా స్టడీ చెక్ పెట్టినట్టు అయ్యింది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.