Surabhi Drama Theatre: 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సురభి నాటక మండలి, అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులే
Surabhi Drama Theatre Community | తెలుగు ప్రజలకు సుపరిచితమైన సురభి నాటక మండలి 140 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎలాంటి రీటెక్స్, కట్స్ లేకుండా సింగిల్ టేకులోనే తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తారు.
140 ఏళ్ల చరిత్ర గల సురభి నాటక మండలి (Surabhi Drama Theatre Community) తెలుగు ప్రజలకు సుపరిచితమే. నాటకమే తమ బతుకు దెరువుగా భావించే సురభి కుటుంబం తమ పూర్వీకులు అందించిన ఈ కళా రూపాన్ని కొనసాగించేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నారు.
సురభి కళాకారులు చేసే నాటకాలలో కట్స్, రీ-టేక్స్ ఉండవు. ఎంత క్లిష్టమైన డైలాగులు అయినా, సింగిల్ టేక్‌లోనే చెబుతారు. చుట్టూ పందిరి, లైవ్ సౌండ్ & విజువల్ ఎఫెక్ట్స్, ఒకే వేదికపై విభిన్న రకాల పాత్రలతో కళాకారులు చేసే సురభి నాటకాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సురభి నాటక మండలి మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద ట్రెడిషన్సల్ థియేటర్ గ్రూపుగా రికార్డు సృష్టించింది. పౌరాణికాలతో పాటు సాహిత్య అంశాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలలోని సన్నివేశాలు, సామాజిక అంశాలపై సురభి కళాకారులు తమ నాటకాలను ప్రదర్శిస్తారు.
పూర్వం ఊరి జాతరలలో లేదా ప్రత్యేక సందర్భాల్లో సురభి నాటకం వేయించేందుకు పిలిచినప్పుడు, ఊళ్లకు ఊళ్లు ఎడ్ల బండ్లు కట్టి చేరేవారు. కానీ కాల క్రమేణా సురభి నాటకాలకు ప్రేక్షక ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు సురభి డ్రామా థియేటర్ సభ్యులు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కళా సంప్రదాయం
"సురభి అంటే కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు, ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కళా సంప్రదాయంగా మేము భావిస్తాము. నాటకమే మా జీవితం. మా పూర్వీకులు మాకు అందించిన ఈ కళను, ఇప్పుడు మేము భవిష్యత్తు తరాలకు అందించడానికి కృషి చేస్తున్నాం. మా కుటుంబంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ నాటక రంగంలో ప్రత్యేక గురింపు సాధించాలి అని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి, ఈ కళను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు." అని సురభి అరుణా దేవి అన్నారు.
సురభి నాటకాలను కొనసాగించడంలో వీరి కుటుంబం లో యువత కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వారి వరకు ప్రతి ఒక్కరూ సురభి నాటకాలను ప్రదర్శిస్తూ వీక్షకుల ప్రశంసలు పొందుతున్నారు.
"సురభి రామలింగయ్య గారు 1885 లో సురభి నాటక మండలిని స్థాపించినప్పుడు కేవలం పల్లె జాతరల్లో ప్రదర్శనలతో మొదలైన ఈ ప్రయాణం, నేడు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. తరతరాలుగా మా కుటుంబంలో ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా భావించి నాటక రంగంలో అంకితమై పని చేస్తున్నారు. మా పూర్వీకులు చేసిన కృషిని కొనసాగించడం, వారసత్వంగా వచ్చిన ఈ కళను పునరుద్ధరించడం మా ప్రధాన లక్ష్యం," అని సురభి వేంకటేశ్వర ప్రసాద్ తెలిపారు.
కరోనా కాలంలో ఆన్‌లైన్ ప్రదర్శనలు:
కరోనా ప్యాండమిక్ కారణంగా స్టేజి మీద ప్రత్యక్ష ప్రదర్శనలు సాధ్యం కాకపోవడంతో, సురభి నాటకాలను ఆన్లైన్ ద్వారా ప్రజల మధ్యకు తీసుకురావడం జరిగింది. "కరోనా సమయంలో ఆన్‌లైన్ ప్రదర్శనలు చేయడం ఒక కొత్త సవాలుగా నిలిచింది. కానీ, ఈ ప్రాచీన కళా రూపాన్ని ఇలా ప్రదర్శించడం ద్వారా మేము మరిన్ని ప్రేక్షకులను చేరుకోవడం జరిగింది. మా తెలుగు NRI ల సహకారంతో Zoom వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాం," అని జయానంద్ తెలిపారు.
నాటకాలలో వైవిధ్యం:
సురభి నాటక మండలి ప్రదర్శించే నాటకాలలో చారిత్రక అంశాలు, పౌరాణికాలు, సామాజిక అంశాల ఆధారంగా ఉంటాయి. మాయాబజార్, లవకుశ, పాతాళ భైరవి, హరిశ్చంద్ర కథ, సతీసావిత్రి, పాండవ వనవాసం వంటి నాటకాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి.
భవిష్యత్తు ప్రణాళికలు:
"సురభి కళ ఎప్పటికీ చెరిగిపోదు. మారుతున్న పరిస్థితులు, సాంకేతికత ఎంతగా పెరిగినా, సురభి నాటక సమాజం ప్రజల ఆదరణ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ కళను కొనసాగించడానికి మేము అంకితభావంతో పని చేస్తాము," అని సురభి వాసుదేవ రావు తెలిపారు.