Snored to Death: గురక మరణానికి సంకేతమా? మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
గురకను తక్కువ అంచనా వేయకండి. గురకను నిర్లక్ష్యం చేయడమంటే.. మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే.
గురక.. ఈ సమస్య ఉన్నవారి పరిస్థితి ఎలా ఉన్నాగానీ, వారి పక్కన నిద్రపోయేవారికి మాత్రం నరకయాతనే. వారి గురకను భరించలేక నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. గురక అంటే.. శబ్దంతో కూడిన శ్వాస. నిద్రలో శ్వాస పీల్చుకున్నప్పుడు గొంతులో విశ్రాంత దశలో ఉండాల్సిన కణజాలాలు కొన్ని సమస్యల వల్ల కంపిస్తాయి. అవి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాన్నే మనం గురక అంటాం. దాదాపు ప్రతి ఒక్కరూ నిద్రలో గురక పెడతారు. అయితే, కొందరి గురక చాలా బిగ్గరగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు, ఆరోగ్య సమస్యలున్నాయని వైద్యులు తెలుపుతున్నారు. అలర్జీలు, జలుబు, మద్యం సేవించడం, అలసట వల్ల కూడా గురక రావచ్చు. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా గురకపెడతారు. అయితే, ప్రతి రోజు పెద్దగా గురక పెడితే మాత్రం.. దాన్ని ఆరోగ్య సమస్యగానే భావించాలి.
గురక రావడానికి గల కారణాలు:
⦿ నాసల్ టర్బినేట్ హైపర్ట్రోఫీ
⦿ మందంగా.. మృదువుగా ఉండే అంగిలి
⦿ టాన్సిల్స్, అడియానిడ్స్‌ల వాపు
⦿ దవడ ఎముక కదలిక
⦿ గొంతు, నాలుకలోని పేలవమైన కండరాలు
⦿ నాలుక పెద్దగా ఉండటం
⦿ మెడలోని కణజాలంలో కొవ్వు నిల్వలు పెరగడం
⦿ అధిక బరువు, ఊబకాయం
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త:
⦿ మీకు తెలియకుండానే నిద్రలో శ్వాస తీసుకోవడం ఆపేస్తారు. (దీన్ని మీరు గుర్తించలేరు. ఇతరులే తెలుసుకోగలరు)
⦿ నిద్రలో గట్టిగా గాలి పీల్చడం
⦿ నిద్రలేచే సమయానికి నోరంతా పొడిగా ఉండటం
⦿ ఉదయం నిద్రలేవగానే తలనొప్పి.
⦿ నిద్రపోవడం కష్టంగా ఉండటం (నిద్రలేమి)
⦿ పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం (హైపర్సోమ్నియా)
⦿ మెలకువగా ఉన్నప్పుడు ఏకాగ్రత లోపించడం
మద్యం సేవించడం, మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నవారు నిద్రలేమితో బాధపడతారు. దానివల్ల వారి గొంతు కండరాలు ఎక్కువగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా ఆ వ్యక్తులకు గురక ఎక్కువగా వస్తుంది. గురక ఎక్కువగా ఉన్నా, పగటి వేళ ఎక్కువగా నిద్రపోవాలని అనిపించినా, గురకతో ఉక్కిరి బిక్కిరై.. ఊపిరి పీల్చుకున్నట్లు అనిపిస్తున్నా.. మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
గురకను ఎలా నివారించాలి?: ముక్కు, గొంతుల ఎండోస్కోపిక్ అసెస్‌మెంట్, CT స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు, స్లీప్ స్టడీస్ ద్వారా గురక సమస్యకు కారణాలను తెలుసుకోవచ్చు. ఇంట్లో లేదా ల్యాబ్, ఆసుపత్రుల్లో నిర్వహించే స్లీప్ స్టడీని పాలిసోమ్నోగ్రఫీ అని కూడా పిలుస్తారు. ఈ పరీక్షల్లో హృదయ స్పందన రేటు, అప్నీక్ ఎపిసోడ్స్ సంఖ్య, శ్వాస తీరును తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా గురకకు గల కారణాలను తీసుకుని చికిత్స అందిస్తారు.
ఇలా చేస్తే గురక సమస్య తగ్గుతుంది:
⦿ బరువు తగ్గడం
⦿ క్రమం తప్పకుండా వ్యాయామం
⦿ నిద్రవేళకు ముందు మద్యపానానికి దూరంగా ఉండటం
⦿ పక్కకు తిరిగి పడుకోవడం
గురక వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?: దీర్ఘకాలిక గురక వలన స్లీప్ అప్నియా ఏర్పడుతుంది. నిద్రలేమి వల్ల పగటిపూట నిద్ర వస్తుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు వస్తాయి. గురక, పగటిపూట అలసట వంటి స్లీప్ అప్నియా లక్షణాలు మనకు చిన్నవిగా అనిపించవచ్చు. అయితే ఈ సమస్య మరణ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్లీప్ అప్నియా మీ గుండె, ఊపిరితిత్తులు, మెదడుకు సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి, మీరు గురక సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!