‘అక్కడ’ దురద ఎక్కువగా ఉందా? కళ్లు మసకబారుతున్నాయా? జాగ్రత్త, అది ఈ వ్యాధే కావచ్చు!
చెప్పుకోలేని చోట ఎక్కువ దురద పెడుతోందా? కళ్లు మసక బారుతున్నాయా? అయితే, మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.
ఈ మధ్య కాలంలో జీవన స్థితి గతులు, పని వేళలు, ఆహార పద్ధతులు అన్నీకూడా చాలా మారిపోయాయి. పెరిగిన టెక్నాలజీ వల్ల కూడా కూర్చున్న చోటుకే ప్రతి విషయం అందుబాటులో ఉంటుంది. ఫలితంగా శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోయింది. మొత్తంగా శరీరం రకరకాల జబ్బుల పాలవుతోంది. అలాంటి వాటిలో డయాబెటిస్ ముందుంటుంది. మన దేశంలో అత్యంత వేగంగా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతోంది. ఇది వరకు కనీసం నడి వయసుకు వచ్చే వరకు డయాబెటిస్ లేకుండా బతికే వీలుండేది. ఇప్పుడు యువతలో కూడా విరివిగానే కనిపిస్తున్న ఈ జబ్బు గురించిన అవగాహన చాలా అవసరం.
డయాబెటీస్ రెండు రకాలు టైప్ 1, టైప్ 2
డయాబెటిస్ కు చికిత్స తీసుకోక పోతే రకరకాల ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి. శరీరంలో పెరిగిపోయిన గ్లూకోజ్ స్థాయిల వల్ల రక్తనాళాలు, నాడులు, ఇతర ముఖ్యమైన అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. అందుకే తప్పని సరిగా ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి అవగాహన ఉండడం చాలా అవసరం. పెద్దగా లక్షణాలు కనిపించని సైటెంట్ కిల్లర్ ఇది. శరీరంలో జరిగే ప్రతి చిన్న మార్పును గమనించాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.
- దాహంగా ఉండడం
- ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి రావడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అవసరం ఏర్పడడం
- అలసటగా ఉండడం
- బరువు తగ్గడం ముఖ్యంగా కండరాల సాంద్రత తగ్గినట్టు అనిపించడం
ఇవి డయాబెటిస్ లో అందరికి తెలిసిన లక్షణాలే. ఇవే కాదు బాగా గమనిస్తే మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.
‘అక్కడ’ దురదగా ఉండడం
రక్తంలో గ్లూకోజ్ పెరిగినపుడు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు సాధారణం. ఎందుకంటే శరీరంలోని చక్కెర కాండిడా అనే ఈస్ట్ పెరిగే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ అదుపులో లేనివారిలో ఈ రకమైన ఇన్ఫెక్షన్ సాధారణం. రక్తంలో గ్లూకోజ్ పెరగడం అంటే శరీరంలోని మూత్రం, చెమట, లాలాజలం, మిగతా భాగాల్లో కూడా గ్లూకోజ్ పెరిగినట్టే. అందువల్ల జననాంగాల్లో ఈస్ట్ పెరుగుతుంది. అందువల్ల జననావయవాల్లో దురదగా ఉంటుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే అది త్రష్ గా మారుతుంది.
గాయాలు
డయాబెటిస్ తో బాధపడుతున్న వారిలో చర్మం మీద ఏర్పడే చిన్న చిన్న గాయాలు, ఇన్ఫెక్షన్లను సరిగా ఎదుర్కోలేదు. హై బ్లడ్ షుగర్ వల్ల బ్లడ్ కెమిస్ట్రీ మారిపోవడం వల్ల శరీరంలోని ఇమ్యూన్ సిస్టం పనితీరు నెమ్మదిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. చాలా డయాబెటిక్స్ లో పాదాలు పళ్లు పడుతుంటాయి.
కంటి చూపు మందగించడం
డయాబెటిస్ కంటిలోని మాక్యూలాను పాడు చేస్తుంది. మాక్యులా అంటే రెటినాలోని మధ్య భాగం. ఇది స్ట్రేయిట్ విజన్ కు ఉపయోగపడే కంటి భాగం. డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోతే రక్తనాళాలు చిట్లడం వల్ల కంటి చూపులో స్పష్టత లోపిస్తుంది.
చర్మ సంబంధ సమస్యలు
డయాబెటిక్స్ లో చర్మ సమస్యలు చాలా సాధారణం. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు, నాడుల మీద ప్రభావం నేరుగా ఉంటుంది. ముఖ్యంగా అకాంథసిస్ నైగ్రికన్ అనే పరిస్థితి వస్తుంది. ఈ సమస్యలో చర్మం కొంత మేర నల్లబడి, వెల్వెట్ లా మారుతుంది. ముఖ్యంగా మెడ వెనుకభాగంలో, చర్మం మడతలు పడే భాగాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొంత మంది తమ చర్మం మందంగా కూడా తయారైందని చెబుతున్నారు. డయాబెటిస్ కంట్రల్ చేస్తే ఈ సమస్య దానంతట అదే చక్కబడుతుంది.
జుట్టు రాలడం
రక్తంలో గ్లూకోజ్ పెరగడం వల్ల రక్త ప్రసరణలో మార్పుల రావడం, ఇమ్యూన్ సిస్టం బలహీన పడడం వంటి కారణాల వల్ల జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది. మాడు మీద జుట్టు పలుచబడుతుంది.
డయాబెటిస్ తో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఇవి మాత్రమే కాదు ఇంకా రకరకాల లక్షణాలు, సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ సాధారణం అయిపోయిన నేటి సమాజంలో అందరూ తప్పని సరిగా శరీరంలో వస్తున్న చిన్నచిన్న మార్పులను సైతం గమనించుకుంటూ తరచుగా పరీక్షలు చేయించుకుని అప్రమత్తంగా అవసరమని నిపుణుల సూచన.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.