Eat Twice a Day : రోజుకు రెండుసార్లే భోజనం చేయాలా? తినే ఆహారానికి మధ్య 5 నుంచి 8 గంటల గ్యాప్ ఇవ్వాలన్న సద్గురు.. బెనిఫిట్స్ ఇవే
Sadhguru Meal Timing Advice : భోజనాల మధ్య 5 నుంచి 8 గంటల విరామం ఇస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సద్గురు సూచిస్తున్నారు. మరి రోజుకు రెండుసార్లు భోజనం చేయడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?

- సద్గురు సూచన: భోజనాలకు 5-8 గంటల విరామం జీర్ణవ్యవస్థకు మంచిది.
- వయసు, ఆరోగ్యం బట్టి భోజనాల సమయం మారుతుంటుంది, కఠిన నియమం కాదు.
- రెండుసార్లు తిన్నా పోషకాలు ముఖ్యం; ఆహార నాణ్యత, పరిమాణం కీలకమైనవి.
- తరచూ తింటే పెద్దపేగు శుభ్రపడదనే వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు.
Ideal Gap Between Meals : ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? ఎంత తినాలి? రోజులో ఎన్నిసార్లు భోజనం చేయాలి? అనే విషయాలపై చాలామందికి సందేహాలు ఉంటాయి. కొందరు రోజుకు మూడు పూటలా భోజనం చేస్తే.. మరికొందరు రెండు పూటలకే పరిమితమవుతారు. ఇంకొందరు ఆకలి వేసిన ప్రతిసారీ కొంచెం కొంచెం తింటూ ఉంటారు. అయితే భోజనాల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వాలని ఆధ్యాత్మిక గురువు సద్గురు సూచించారు.
భోజనాల మధ్య విరామం గురించి సద్గురు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. భోజనం ఎప్పుడూ చేసినా.. సుమారు 5 నుంచి 8 గంటల విరామం ఇవ్వడం మంచిదని తెలిపారు. ఎందుకంటే జీర్ణవ్యవస్థకు మధ్యలో విరామం ఇవ్వడం వల్ల శరీరంలోని సహజ ప్రక్రియలు సక్రమంగా సాగుతాయని సూచించారు. మరి రోజుకు రెండుసార్లు భోజనం చేయడమే అందరికీ మంచిదేనా? తరచూ తినడం వల్ల పెద్దపేగులో వ్యర్థాలు పేరుకుపోతాయా? దీనిలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
భోజనాల మధ్య 5 నుంచి 8 గంటల గ్యాప్
చాలామంది ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం తింటారు. వీటికి అదనంగా టీ, కాఫీతో పాటు బిస్కెట్లు, చిప్స్, స్వీట్లు వంటి చిరుతిళ్లు కూడా తింటుంటారు. ఆకలి లేకపోయినా అలవాటు కొద్దీ ఏదో ఒకటి తినేవారు కూడా ఉంటారు. అయితే అనవసరమైన చిరుతిళ్లను తగ్గించి.. నిజంగా ఆకలి వేసినప్పుడే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలని సద్గురు సూచించారు.
భోజనాల మధ్య తగిన విరామం తీసుకోవడం వల్ల కొందరిలో రోజంతా ఏదో ఒకటి తినే అలవాటు తగ్గవచ్చు. అలాగే మొత్తం కేలరీలు కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 5 నుంచి 8 గంటల గ్యాప్ ఇవ్వాలనే వైద్యపరమైన నియమం లేదని.. వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితి, ఆహార అవసరాలను బట్టి భోజన సమయాలు మారుతుంటాయి.
Also Read : తరచూ విషయాలు మర్చిపోతున్నారా? మతిమరుపు ఎక్కువైతే ఈ ఫుడ్ కాంబినేషన్స్ ట్రై చేయండి
రోజుకు రెండుసార్లు తింటే మంచిదేనా?
రోజుకు రెండుసార్లు భోజనం చేయడం ఆరోగ్యంగా ఉండే పెద్దలకు సరిపోవచ్చు. ముఖ్యంగా అనవసరంగా చిరుతిళ్లు తినే అలవాటు ఉన్నవారు దీనిని పాటిస్తే ఫుడ్ కంట్రోల్ చేసుకోగలుగుతారు. అయితే రోజుకు రెండుసార్లు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని అనుకోకూడదు. రోజులో రెండు పూటలే తిన్నా.. ఆ రెండు భోజనాల్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తగినంత శక్తినిచ్చే పోషకాలు అందేలా చూసుకోవాలి.
రెండుసార్లు తగ్గించాలనే ఉద్దేశంతో అవసరమైన ఆహారాన్ని కూడా తగ్గిస్తే నీరసం, అలసట, పోషకాల లోపం వంటి సమస్యలు రావచ్చు. అలాగే రోజుకు మూడు పూటలు తినేవారంతా అనారోగ్యంగా ఉంటారని.. రెండు పూటలు తినేవారంతా ఆరోగ్యంగా ఉంటారని భావించడం కూడా సరికాదు. ఎన్నిసార్లు తినడం అనేది పక్కన పెడితే.. ఆహార నాణ్యత, పరిమాణం, మొత్తం కేలరీలు, జీవనశైలి వంటి అంశాలు ముఖ్యమని చెప్తున్నారు.
Also Read : ఆకలి ఎక్కువగా వేస్తుందా? బరువు పెరగకుండా ఫుడ్ క్రేవింగ్ తగ్గించాలంటే చిప్స్ మంచిదా? పాప్‌కార్న్?
ఎక్కువసార్లు తింటే పెద్దపేగు క్లీన్ అవ్వదా?
తరచూ ఆహారం తీసుకోవడం వల్ల పెద్దపేగు వ్యర్థాలను బయటకు పంపించే ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని కొందరు భావిస్తారు. అయితే దీనికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేసి, అందులోని పోషకాలను శోషించుకుంటుంది. పెద్దపేగు ప్రధానంగా నీటిని శోషించుకోవడం, మిగిలిన వ్యర్థాలను మలం రూపంలో బయటకు పంపించేందుకు సహకరిస్తుంది.
కాబట్టి రోజుకు రెండుసార్లు తింటేనే పెద్దపేగు శుభ్రంగా ఉంటుందని, తరచూ తినడం వల్ల వ్యర్థాలు పేరుకుపోతాయని చెప్పే ఆధారాలు ఏవి లేవు. మలబద్ధకం వంటి సమస్యలను నివారించుకోవడానికి తగినంత నీరు తాగడం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, శారీరకంగా చురుకుగా ఉండడం వంటి అలవాట్లు గట్ క్లీన్ అవ్వడంలో హెల్ప్ అవుతాయని చెప్తున్నారు నిపుణులు.
Also Read : అన్నం మళ్లీ వేడి చేసి తింటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా? ఫుడ్ పాయిజన్‌కు కారణమిదే
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























