Mask: టైమ్ బ్యాడ్... పదహారు సెకన్ల పాటూ మాస్క్ తీసినందుకు రూ.2 లక్షల ఫైన్
ఒక వ్యక్తి చేసిన చిన్న తప్పుకు అతను భారీ మూల్యాన్నే చెల్లించాలి.
అసలే యూకేలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. బయటి ప్రదేశాల్లో అందరూ కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలనే నిబంధన కఠినంగా అమలులో ఉందక్కడ. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి మర్చిపోయి మాస్క్ తీసి వెంటనే పెట్టేశాడు. ఇదంతా 16 సెకన్లలో జరిగింది. కానీ పబ్లిక్ ప్లేసులో మాస్క్ లేకుండా ఉన్నందుకు రెండు లక్షల రూపాయలు పడింది.
క్రిస్టోఫర్ ఓటూల్ యూకేలోని లివర్ పూల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. మాస్క్ పెట్టుకునే షాపింగ్ మాల్ కు వెళ్లాడు. ఊపిరందనట్టు ఇబ్బందిగా అనిపించేసరికి ఓసారి మాస్క్ తీసి మళ్లీ పెట్టాడు. ఇది జరిగిన సమయంలోనే ఆ దుకాణంలో పోలీసులు ఉన్నారు. మాస్క్ తీసి మళ్లీ పెట్టడం చూశారు. వెంటనే అతడిని పట్టుకుని మాస్క్ ఎందుకు తీశావంటూ నిలదీశారు. ఎంతగా వివరణ ఇచ్చుకున్నా వదల్లేదు. అతని పేరు, ఫోన్ నెంబర్ అన్ని వివరాలు తీసుకున్నారు. ఎలాగో వారికి సర్ధిచెప్పి అక్కడ్నించి వెళ్లిపోయాడు క్రిస్టోఫర్. అయినా పోలీసులు మాత్రం వదల్లేదు.
కొన్ని రోజుల తరువాత అతడికి వంద పౌండ్లు జరిమానా కట్టమని లెటర్ వచ్చింది. వెంటనే తాను ఎందుకు కట్టాలని, కట్టే ప్రసక్తే లేదంటూ ఈమెయిల్ పంపాడు. అలా వాదించినందుకు ఆ ఫైన్ కాస్తా పెరుగుతూ రెండు వేల పౌండ్లకు చేరుకుంది. అంటే మన రూపాయల్లో రెండు లక్షల రూపాయలు. జరిమానా చెల్లించనని ఈమెయిల్ చేసినందుకు ఇంత స్థాయిలో మళ్లీ ఫైన్ వేశారని చెబుతున్నాడు క్రిస్టోఫర్.
అతను చాలా చిన్న జీతగాడు. రెండు వేల పౌండ్లు అతనికి చాలా ఎక్కువ. అతని జీతంతో అంత మొత్తాన్ని కట్టలేక కన్నీరుమున్నీరయ్యాడు క్రిస్టోఫర్. కొన్ని సెకన్లపాటూ మాస్క్ తీసినందుకు ఇంత పెద్ద శిక్ష పడుతుందనుకోలేదని బాధపడ్డాడు. ఇంకా ఈ గొడవ చల్లారలేదు. జరిమానా కట్టనందుకు కేసు కోర్టుకు చేరింది. త్వరలో క్రిస్టోఫర్ హాజరై తన వాదన వినిపించాలి.
అధ్యక్షుడికే ఫైన్
మాస్క్ పెట్టుకోపోతే ఫైన్ వేయడం చాలా దేశాల్లో అమలులో ఉంది. గతంలో చిలీ అధ్యక్షులు సెబాస్టియన్ పినెరా కు ఫైన్ పడింది. అతను ఒక అభిమానితో సెల్ఫీ దిగుతూ మాస్క్ తీసేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ప్రభుత్వం నోటీసు పంపింది. జరిమానాగా ఆయన రెండు లక్షల 57 వేల రూపాయలు చెల్లించారు.
మనదేశంలో కూడా ఉత్తరప్రదేశ్ లోని ఒక వ్యక్తికి మాస్క్ ధరించనందుకు పదివేల రూపాయల ఫైన్ పడింది. అంతకుముందు కూడా అతను మాస్క్ లేకుండా పట్టుబడ్డాడు. మొదటిసారి వెయ్యి రూపాయల ఫైన్ తోనే వదిలిపెట్టారు. కానీ రెండో సారి మాత్రం భారీగా వేశారు.
Also read: ఈ దోశె మొత్తం తింటే రూ.71,000 క్యాష్ ప్రైజ్... తినడానికి మీరు సిద్ధమేనా?
Also read: పొట్ట దగ్గరి కొవ్వు త్వరగా తగ్గాలా... ఈ రెసిపీలు ప్రయత్నించండి