Measles: రోజురోజుకీ పెరిగిపోతున్న తట్టు వ్యాధి కేసులు? ఈ అంటు వ్యాధి లక్షణాలు ఏంటి?
భారత్ లో తట్టు వ్యాధి మళ్ళీ తిరగబెడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాలను తట్టు వ్యాధి వణికిస్తోంది. అనేక రాష్ట్రాల్లో తట్టు వ్యాధి బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటి వరకు 135 కొత్త తట్టు వ్యాధి కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. తట్టు(మీజిల్స్) అనేది ఒక అంటువ్యాధి. భారత్ లో తట్టు వ్యాధి తిరగబెడుతోందా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే ఈ వ్యాధి ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మీజిల్స్ అనేది కండ్ల కలక, దగ్గు, జ్వరం, శరీరం మీద ఎర్రటి దద్దుర్లు వంటివి తీసుకొచ్చే శ్వాసకోశ వ్యాధిగా నిర్వచించారు. ఎక్కువగా ఐదేళ్ల లోపు పిల్లలు, యాబై ఏళ్లు దాటిన పెద్దల్లో తట్టు బారిన పడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. తట్టు సోకిన రోగి తుమ్మినా, దగ్గినా ఆ వ్యక్తి లాలాజలం నుంచి వైరస్ గాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ గాలి పీల్చిన ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా దీని బారిన పడొచ్చు. తట్టు ఉన్న వ్యక్తిని నేరుగా తాకిన కూడా ఇది వ్యాపిస్తుంది.
పిల్లల్లో కనిపించే తట్టు వ్యాధి లక్షణాలు
☀ఆకలి లేకపోవడం
☀శరీరం మీద ఎర్రటి దద్దుర్లు
☀కాంతి చూడలేకపోవడం
☀పొడి దగ్గు
☀జలుబు
☀కళ్ళ వెంట నీరు, వాపు
☀అలసట, నీరసం
☀అతిసారం
☀ఒళ్ళు నొప్పులు
☀తలనొప్పి
☀గొంతు మంట
మీజిల్స్ ఎవరికి వచ్చే ప్రమాదం ఉంది?
⦿20 ఏళ్లు పైబడిన పెద్దలు
⦿5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు, పిల్లలు
⦿గర్భిణీ స్త్రీలు
⦿బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవాళ్ళు
⦿హెచ్ఐవి రోగులు
⦿లుకేమియా బాధితులు
తట్టు లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. సొంతంగా వంటింటి చిట్కాలు పాటిస్తే వ్యాధిని తీవ్రతరం చేస్తుంది. చిన్న పిల్లలకు ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్స్ వేయించాలి. తట్టు వ్యాక్సిన్ తో పాటు రూబెల్లా వ్యాక్సిన్ కూడా వేయించడం మంచిది. విటమిన్ ఏ లోపంతో బాధపడే వాళ్ళు ఈ వ్యాధి బారిన త్వరగా పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాన్ని అధిగమించాలంటే పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి. పిల్లల్లో తగ్గకుండా జ్వరం శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తే ఆలస్యం చేయకుండా రోగనిర్ధారణ పరీక్షలు చేయించడం ఉత్తమం. గతేడాది దాదాపు 3,500 కి పైగా తట్టు కేసులు భారత్ లో నమోదయ్యాయి. మహారాష్ట్రలోని మురికివాడల్లో ఈ కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యాధి ప్రబలకుండా బీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: హోలీ రోజు భంగ్ ఎందుకు తాగుతారు? ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడటం ఎలా?