Healthy Breakfast: వెజిటబుల్ ఊతప్పం - పిల్లలకు నిండైన బ్రేక్‌ఫాస్ట్
సులువుగా తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఇదీ ఒకటి.
రోజూ పిల్లలకు ఏ బ్రేక్‌ఫాస్ట్ చేయాలో అని ప్రతి తల్లి ఆలోచిస్తుంది. సులువుగా అయిపోవాలి, పిల్లలకు పోషకాలను అందించాలి... అలాంటి అల్పాహార ఐడియాల కోసం వెతుక్కుంటారు ఎంతో మంది. అలాంటి వారికి ఈ వెజిటబుల్ ఊతప్పం సరిగ్గా సరిపోతుంది. కేవలం 20 నిమిషాలలో పూర్తయిపోతుంది. అందులోనూ ఎంతో ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇందులో నిండుగా కూరగాయలు ఉంటాయి కాబట్టి పిల్లలకు కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు దీని వల్ల నిండుగా అందుతాయి.
కావాల్సిన పదార్థాలు
ఉప్మా రవ్వ - ఒక కప్పు
పెరుగు - అర కప్పు
నీళ్లు - అర కప్పు
క్యారెట్ - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
మిరియాల పొడి - అర స్పూను
క్యాప్సికం - ఒకటి
కొత్తిమీర తరుగు - రెండు టీస్పూన్లు
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. ఒక గిన్నెలో ఉప్మా రవ్వ వేసుకోవాలి. అందులో పెరుగు, నీళ్లు వేసి బాగా కలపాలి. ఓ పదినిమిషాలు అలా పక్కన పెడితే రవ్వ బాగా నానుతుంది.
2. ఇప్పుడు ఆ రవ్వ మిశ్రమంలో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
3. ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్, కొత్తిమీర వంటివన్నీ సన్నగా తరుక్కోవాలి.
4. సన్నగా తరుక్కున్న అన్నింటినీ రవ్వ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
5. పెనంపై నూనె వేసి మిశ్రమాన్ని ఊతప్పంలా వేసుకోవాలి. పలుచగా వేసుకుంటే రావు. మందంగా వేసుకుంటేనే ఇవి వస్తాయి. కాబట్టి దోశెలు, అట్లు వేసుకునేందుకు ప్రయత్నించవద్దు.
గుంత పొంగనాలుగా....
మీకు ఊతప్పంలా నచ్చక పోతే గుంత పొంగనాలుగా కూడా వీటిని వేసుకోవచ్చు. గుంత పొంగనాలు వేసుకునే ట్రేలో వీటిని వేసుకుని మూత పెడితే టేస్టీగా పొంగనాలు రెడీ అయిపోతాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గానే కాదు, సాయంత్రం స్నాక్‌గా కూడా ఇవి తినవచ్చు.
వీటిని పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ... ఇలా ఏ పచ్చడితో తిన్నా రుచిగానే ఉంటుంది. ఏ పచ్చడి లేకుండా తిన్నా బావుంటుంది.
View this post on Instagram
Also read: పుట్టుమచ్చలు పుట్టుకతో వస్తాయా? అసలెందుకు ఇవి ఏర్పడతాయి?