Virtual Dating: వర్చువల్ డేటింగ్‌లో ఉన్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవు
ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ వర్చువల్ డేటింగ్. తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే ఈ కథనం.
ఒకే ఒక్క క్లిక్‌తో ప్రపంచాన్ని గిర్రున చుట్టేసే టెక్నాలజీ కాలంలో జీవిస్తున్నాం. అందుకే వర్చువల్ డేటింగ్ పెరిగిపోయింది.ఒకప్పుడు ప్రేమ పుట్టాలంటే ‘కళ్లు కళ్లు ప్లస్’ వంటి పాటలు పాడుకోవాల్సి వచ్చేది. ఇప్పుడంత సీన్ లేదు. డేటింగ్ యాప్‌లలో పరిచయం పెంచుకుని, ఫోన్లో మాట్లాడేసుకుని, రిలేషన్‌షిప్‌కు ఓకే చెప్పేస్తున్నారు. కరోనా వచ్చాక అన్ని దేశాలలో లాక్‌డౌన్ పడింది. దీంతో డేటింగ్ యాప్స్ పుంజుకున్నాయి.ఆఫ్‌లైన్ డేటింగ్, ఆన్‌లైన్ డేటింగ్ ... ఈ రెండింటిలో ఎక్కువ మంది అమ్మాయిలు వర్చువల్ డేటింగ్‌నే ఎంచుకుంటున్నారు. దాన్ని సురక్షితమైనదిగా భావిస్తున్నారు. ఓ సర్వేలో దాదాపు 67 శాతం మంది వర్చువల్ డేటింగ్‌కే అమ్మాయిలు ఓటేశారు. ఆ డేటింగ్ ద్వారా కొంతమంది ప్రేమ... పెళ్లి దాకా చేరితే, మరికొందరు మాత్రం మోసగాళ్ల బారిన పడి ఆర్ధికంగా నష్టపోయారు. అందుకే వర్చువల్ డేటింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టొద్దు
వర్చువల్ డేటింగ్‌ను గుడ్డిగా నమ్మేయద్దు. మీ చిరునామా, మీరు పనిచేసే ఆఫీసు, కుటుంబ సమాచారం వంటివి రహస్యంగా ఉంచాలి. మీకు సంబంధించిన సమాచారాన్ని ఎంతవరకు వారితో షేర్ చేసుకోవచ్చో ముందే ఓ నిర్ణయానికి రండి. మీ ప్రొఫైల్‌ను రహస్యంగా ఉంచండి. మీకు నచ్చిన వ్యక్తితో లోతైన బంధం ఏర్పడి, అన్ని రకాలుగా అతడి గురించి తెలుసుకునే వరకు ఓపికగా ఉండండి.
స్కామర్ల బారిన పడకుండా...
మీరు డేటింగ్ యాప్ ద్వారా ప్రేమ, స్నేహం కోరుకోవచ్చు, కానీ ఎదుటివ్యక్తి అదే కోరుకోవాలని లేదు. అతడు స్కామర్ కూడా కావచ్చు. ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి కావచ్చు. అందుకే వర్చువల్ డేటింగ్ విషయంలో ఆచితూచి అడుగులెయ్యాలి. ఏదైనా లింకులు పంపితే వాటిని ఓపెన్ చేయద్దు. డబ్బులు అడిగినా ఇవ్వవద్దు. ముఖ్యంగా విదేశీయుల పేరుతోనే ఇలాంటి మోసాలు అధికంగా జరుగుతున్నాయి.
ఫోటోలు పంపొద్దు
ఆన్‌లైన్ డేటింగ్ చాలా విషయాలను సులభతరం చేసింది.అందుకే ఈ పద్ధతిలో త్వరగా మోసపోతారు. మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తి మీ వ్యక్తిగత ఫోటోలు అడిగితే పంపకండి. వాటితో బ్లాక్ మెయిల్ చేసేవారు కూడా ఉన్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చేముందు ఆలోచించుకోండి. అనవసరంగా చిక్కుల్లో పడొద్దు. ఆ వ్యక్తిని మీరు నేరుగా కలవాలని నిర్ణయించుకున్నాకే ఫోన్ నెంబర్ పంపండి.
టైమ్ తీసుకోండి
వర్చువల్ డేటింగ్ ద్వారా కొంతమంది నిజమైన ప్రేమలో పడి పెళ్లి దాకా చేరుకున్ను సందర్భాలు అధికమే. కాబట్టి మీరు నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నట్టయితే జాగ్రత్తగా వ్యవహరించండి. కనెక్ట్ అయిన వ్యక్తి మీకు సరిపోతాడో లేదో తెలుసుకునేందుకు టైమ్ తీసుకోండి. నిర్ణయాలు వెంటవెంటనే తీసుకోకండి. అతను మిమ్మల్ని కలవమని ఒత్తిడి చేసినా లొంగకండి. మీ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి కచ్చితంగా ఎన్నిరోజులైనా వేచి ఉంటారు.
నేరుగా కలిసేటప్పుడు...
మీరు ఒక వ్యక్తి పూర్తిగా నచ్చి, అతడిని కలవాలని మీకు వందశాతం అనిపిస్తేనే ముందుకు సాగండి. ఎవరి బలవంతం మీదో, ఒత్తిడి చేస్తేనో కలవాలన్న నిర్ణయం తీసుకోకండి. బయలుదేరే ముందు మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఎవరిని కలవడానికి వెళుతున్నారు? చిరునామాతో సహా స్నేహితులకు ఇచ్చి వెళ్లండి. అంతేకాదు పబ్లిక్ అధికంగా ఉన్న స్థలాల్లోనే వారిని కలవండి. మీకు అసౌకర్యంగా ఏమాత్రం అనిపించినా, భయంగా అనిపించినా అక్కడ్నించి వెంటనే వెళ్లిపోండి. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అన్న ఆలోచన వద్దు. మీ సేఫ్టీయే మీకు ముఖ్యం.
Also read: మద్యం నిజంగానే బాధల్ని మరిచిపోయేలా చేస్తుందా? శరీరంలో చేరాక ఆల్కహాల్ చేసే పనేంటి?