Late Pregnancy Tips : లేట్ వయసులో తల్లి కావాలనుకుంటున్నారా? 30 దాటాకా ప్రెగ్నెంట్ అయితే వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Late Pregnancy Care : 30-40 ఏళ్లలో తల్లులయ్యే మహిళలు పెరుగుతున్నారు. అప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు, వైద్య సలహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips for a healthy pregnancy after 30 : కెరీర్‌పై దృష్టి పెట్టడం, ఇతర కారణాల వల్ల చాలామంది మహిళలు 30 దాటిన తర్వాత 40లోపు తల్లి అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మారుతున్న సామాజిక నియమాలు, వృత్తిపరమైన ప్రాధాన్యతలలో మార్పులు, వివిధ కారణాలు కలిసి.. సంతానోత్పత్తి, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణపై ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ఆలస్యంగా గర్భం దాల్చడమనేది చిన్న వయస్సులో గర్భం దాల్చడం కంటే భిన్నంగా ఉంటుందని.. దానితో పాటు కొన్ని ప్రమాదాలు, సవాళ్లతో నిండి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. అయితే సరైన అవగాహన, మద్దతుతో, లేట్ వయసులో కూడా మహిళలు ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీని పొందవచ్చని చెప్తున్నారు.
నేటికాలంలో తల్లిదండ్రులు కావడం అనేది ఆలస్యమైన ప్రక్రియగా మారుతుంది. పురుషులు, మహిళలు కూడా వివిధ వ్యక్తిగత కారణాల వల్ల దీనిని వాయిదా వేసుకుంటున్నారు. దీనివల్ల ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. దీనిలో భాగంగానే IVF, ఎగ్‌ఫ్రీజింగ్ వంటి పునరుత్పత్తి వైద్య విధానాలు ఎక్కువ అయ్యాయి. దీనివల్ల లేట్ వయసులో కూడా హెల్తీ బేబిని డెలివరీ చేసేందుకు వీలు అవుతుందనే భరోసా పెరిగిందని చెప్తున్నారు జైపూర్‌లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్‌గా చేస్తోన్న డాక్టర్ చారులత బన్సల్. అయితే దీనితో పాటు శారీరక, భావోద్వేగ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
రిస్క్-బ్యాలెన్సింగ్
ఆలస్యంగా గర్భం దాల్చాలనుకోవడంలో ప్రధాన సమస్య ఏంటి అంటే సంతానోత్పత్తి తగ్గడం. ఎందుకంటే 35 ఏళ్లు పైబడిన తర్వాత గుడ్ల సంఖ్య, నాణ్యత క్రమంగా తగ్గుతుంది. తల్లుల్లో డౌన్ సిండ్రోమ్ వంటి క్రోమోజోమల్ లేదా జన్యుపరమైన లోపాలను కలిగి ఉంటాయి. అందువల్ల నాన్-ఇన్వాసివ్ ప్రినేటల్ పరీక్ష (NIPT) కోసం సిఫార్సు చేస్తారు. అధునాతన సాంకేతికత కారణంగా.. ఆందోళన కలిగించే అనేక గర్భధారణ సమస్యల గుర్తింపు, నిర్ధారణ సులభంగా గుర్తించడం జరుగుతుంది.
35 ఏళ్లు పైబడిన మహిళలు గర్భధారణ సమయంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అధిక రక్తపోటు, గర్భధారణ మధుమేహం, ప్రీఎక్లాంప్సియా వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు. థైరాయిడ్ అసమతుల్యత లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి ఆరోగ్య సమస్యలకు మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి వాటి గురించిన పర్యవేక్షణ, సంరక్షణ అవసరం. వీటిపై అవగాహన ఉంటే.. అలవాట్లు, ఆరోగ్య సంరక్షణ పద్ధతులతో వీటిని తగ్గించుకోవచ్చు.
గర్భవతి అని నిర్ధారించిన తర్వాత.. అల్ట్రాసౌండ్‌లు, రక్తంలో చక్కెర, రక్తపోటు వంటివి రెగ్యులర్‌గా పర్యవేక్షించాలి. గర్భధారణ సమయంలో.. ముఖ్యంగా మీరు మూడవ త్రైమాసికానికి చేరుకున్నప్పుడు మరింత జాగ్రత్తగా, అలెర్ట్‌గా ఉండాలి.
మద్ధతు ఉండాలి..
ప్రెగ్నెన్సీతో ఉన్నవారికి తమ చుట్టూ ఉండేవారు మద్ధతునివ్వాలి. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే భావోద్వేగ, శారీరక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు వారికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి మద్ధతు ఉంటే మంచిది. పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలు ప్రెగ్నెంట్ అయితే మెటర్నిటీ కోచింగ్, డోలా మద్దతు లేదా ఆన్‌లైన్ కమ్యూనిటీల మద్దతు తీసుకోవాలి.
జీవనశైలిలో మార్పులు
ప్రెగ్నెన్సీలో పోషకాహారం, వ్యాయామం కచ్చితంగా ఉండాలి. శరీరానికి అవసరమైన ఇనుము, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇవి తల్లికి ఆరోగ్యానికి మద్ధతునిచ్చి.. లోపలున్న శిశువు పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి. అలాగే నడక, ప్రినేటల్ యోగా లేదా ఈత వంటి మితమైన వ్యాయామాలు చేస్తే ఒత్తిడి హార్మోన్లు కంట్రోల్ అవుతాయి. గర్భధారణ మధుమేహం వంటివి నిరోధించడానికి సహాయపడతాయి. నిద్ర, పరిశుభ్రత, మితమైన కెఫిన్ వంటివి మంచిది. అలాగే ఆల్కహాల్, పొగాకు వినియోగాన్ని నివారిస్తే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.






















