Recipes: నయనతార ఇష్టంగా తినే ‘నెయ్యన్నం’, సింపుల్ రెసిపీ ఇదిగో
చాలా మంది ఫేవరేట్ హీరోయిన్ నయనతార. ఆమెకు ఇష్టమైన రెసిపీ ‘నెయ్యి అన్నం’
హీరోహీరోయిన్లు ఇష్టంగా తినే ఆహారాలేంటో తెలుసుకోవాలని వారి అభిమానులు అనుకోవడం సహజం. నయనతారకు అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. మరి ఆమె తరచూ తినే వంటకమేదో ఎంత మందికి తెలుసు? నయనతార ఇష్టంగా తినేవాటలో నెయ్యన్నం కూడా ఒకటి. దీన్ని తయారుచేయడం చాలా సులువు. వండిన అన్నం రెడీగా ఉంటే అయిదు నిమిషాల్లో నెయ్యన్నం రెడీ అయిపోతుంది. కాబట్టి పిల్లల లంచ్ బాక్సుకు ఇది బెస్ట్ ఎంపిక అని చెప్పుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - ఒక కప్పు
నెయ్యి - నాలుగు స్పూన్లు
జీడిపప్పులు - ఆరు
నీళ్లు - తగినన్ని
ఉల్లిపాయ - ఒకటి
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - నాలుగు
యాలకులు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
కుంకుమ పువ్వు రేకలు -నాలుగు
తయారీ ఇలా...
1. అన్నాన్ని పొడిగా వచ్చేలా వండుకుని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పులు వేయించుకుని తీసి పక్కన పెట్టాలి.
3. మిగిలిన నెయ్యిలో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేయించాలి.
4. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
5. అందులో వండిన అన్నం ఉప్పు వేసి పొడిపొడిగా కలుపుకోవాలి.
6. కుంకుమ పువ్వు రేకలను కాస్త నీళ్లలో నానబెట్టి, ఆ నీటిని కూడా వేసి కలుపుకోవాలి. రెండు స్పూన్లు నీళ్లు వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే అన్నం ముద్దయిపోయే అవకాశం ఉంది.
7. స్టవ్ కట్టేసి, వేయించుకున్న జీడి పప్పులను పైన చల్లుకోవాలి. అంతే టేస్టీ నెయ్యన్నం రెడీ అయినట్టే.
8. దీన్ని నేరుగా తిన్నా బావుంటుంది, లేదా ఏదైనా కర్రీతో కలుపుకుని తిన్నా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది.
నెయ్యి కొలెస్ట్రాలే కానీ...
నెయ్యి తింటే బరువుపెరుగుతారన్న భయంతో చాలా మంది దీన్ని తినరు. నిజానికి అతిగా తింటే బరువు పెరుగుతారు కానీ మితంగా తినడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. అది కూడా రోజూ నెయ్యన్నం చేసుకుని తినరుగా వారానికోసారి తినడం వల్ల బరువు ఏమాత్రం పెరగరు. అది కాకుండా నెయ్యిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని అప్పుడప్పుడ తినాల్సిన అవసరం ఉంది.
1. నిద్రలేమి సమస్యా చాలా మందిని వేధిస్తుంది. అలాంటి వారు నెయ్యి తినడం వల్ల సమస్యా కాస్త తగ్గుముఖం పడుతుంది.
2. ఆకలి లేని వారిలో కూడా నెయ్యి తినడం వల్ల ఆకలి కలుగుతుంది.
3. గర్భిణులు నెయ్యి తినడం వల్ల గర్భస్థ పిండం బాగా ఎదుగుతుంది. కాబట్టి వారు రోజూ స్పూను నెయ్యి తింటే మంచిది.
4. పరగడుపున నెయ్యిని తినడం వల్ల మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు పోతాయి.
5. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. గాయం తగిలినప్పుడు వెంటనే నెయ్యిని రాస్తే త్వరగా తగ్గుతుంది.
Also read: చెట్టు పాలతో తయారయ్యే పచ్చ కర్పూరం, ఇక హారతి కర్పూరం కథ మాత్రం వేరు
Also read: మహారాష్ట్రలో ఆ బేబీ పౌడర్‌పై నిషేధం, ఈ రసాయనాలు ఉంటే చంటి పిల్లలకు వాడకూడదు