Heart Attack: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?
వారంలో సోమవారంనాడే గుండె పోటు వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు ఓ అధ్యయనం చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా గుండె పోటు కేసులు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా యువతలో గుండె వ్యాధులు తొంగిచూస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధ వ్యాధులపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కొత్త అధ్యయనం ప్రకారం వారంలో అన్ని రోజులతో పోలిస్తే సోమవారం నాడే ఎక్కువ గుండె పోటు కేసులు నమోదవుతున్నారు. మాంచెస్టర్‌లో జరిగిన బ్రిటిష్ కార్డియోవాస్కులర్ సొసైటీ (BCS) కాన్ఫరెన్స్‌లో ఈ అధ్యయనం ఫలితాలను వివరించారు. బెల్‌ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్, ఐర్లాండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వైద్యులు ఈ అధ్యయనం చేశారు. దీనిలో భాగంగా 20,000పై అధ్యయనం నిర్వహించారు.
గుండెపోటు రావడానికి అత్యంత తీవ్రమైన రకాల్లో ఒకటి ST-సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (STEMI). ఎక్కువ మంది రోగులలో ఇది కనిపించిందని పరిశోధకులు కనుగొన్నారు. STEMI గుండెపోటు రేటు సోమవారం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. STEMI పరిస్థితుల్లో కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీనివల్ల గుండెకు ఆక్సిజన్, రక్త సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు ఏర్పడతాయి. STEMI కారణంగా 30,000 కంటే ఎక్కువ మంది రోగులు UKలోని ఆసుపత్రులలో చేరారు. STEMI గుండెపోటు అత్యంత క్లిష్టమైన రకాల్లో ఒకటి. ఎందుకంటే ఇవి ఊపిరితిత్తులకు రక్తాన్ని పంప్ చేసే గుండె గదులు, కండరాలకు ఎక్కువ నష్టాన్ని చేస్తుంది. శరీరానికి రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండె కండరాలు పునరుత్పత్తి కానందున, కండరాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. అలా మరణపు అంచులకు రోగి చేరే అవకాశం ఉంది.
బ్రిటన్లో ప్రతి అయిదు నిమిషాలకు ఒకరు ఈ ప్రాణాంతక గుండె పోటు కారణంగా ఆసుపత్రిలో చేరుతున్నారు. అందుకే గుండె పోటు అంశంపై ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. పొగాకు వాడకం, ధూమపానం, మధుమేహం, కొలెస్ట్రాల్, ఆల్కహాల్, కొకైన్ వంటి మందులు వాడడం, తక్కువ శారీరక శ్రమ కారణంగా STEMI గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. చెడు జీవనశైలి, అలవాట్ల వల్లే ఈ గుండె పోటు వస్తుంది. అలాగే కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే వారిలో STEMI గుండె పోటు వచ్చే అకా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
సోమవారమే ఎందుకు?
పురుషుల్లో సోమవారం గుండె పోటు వచ్చే అవకాశం 20 శాతం పెరుగుతుందని, అదే మహిళల్లో 15 శాతం ఉందని అధ్యయనకర్తలు చెప్పారు. సోమవారం తిరిగి ఆఫీసుకు వెళ్లాలనే ఒత్తిడి అధికంగా ఉంటుందని, దాని వల్ల సోమవారం గుండె పోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు. అదే వారాంతాల్లో మాత్రం చాలా తక్కువగా గుండె పోటు కేసులు నమోదవుతున్నాయి.
Also read: ఆల్కహాల్ తక్కువ తాగినా ప్రమాదమే, శరీరంలో ఏం జరుగుతుందంటే...
Also read: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.