Covid 19 Vaccine: ఒకే వ్యక్తికి 217 కోవిడ్ వ్యాక్సిన్లు - ఇంతకీ అతడు బతికే ఉన్నాడా?
ఓ వ్యక్తి రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా 217 వ్యాక్సిన్లు తీసుకున్నాడు. ఇదే లాబ్ టెస్టుల కోసం అనుకుంటే పొరపాటే. అయితే, ఈ విషయం తెలిసిన తర్వాత.. పరిశోధకులు కూడా అతడికి వ్యాక్సిన్స్ ఇచ్చారు. ఎందుకంటే?
కోవిడ్-19 ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో తెలిసిందే. ఈ వైరస్‌ను పారదోలేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సినేషన్ తర్వాత కోవిడ్ అదుపులోకి వచ్చింది. కానీ, మరణాలు మాత్రం ఆగలేదు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే హార్ట్ ఎటాక్‌తో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయస్సులోనే గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితికి కోవిడ్ వ్యాక్సినే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్లలు వ్యాక్సిన్‌కు, గుండె సమస్యలకు ఉన్న లింక్ ఏమిటనేది తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే, జర్మనీకి చెందిన 62 ఏళ్ల వ్యక్తి ఏకంగా 217 కోవిడ్ వ్యాక్సిన్లు పొందాడట. మరి రెండు మూడుసార్లు వ్యాక్సిన్ వేయించుకున్నవారికే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అలాంటిది 217 వ్యాక్సిన్లు తీసుకున్న అతడు బతికే ఉన్నాడా? అతడి పరిస్థితి ఎలా ఉంది?
29 నెలలుగా వ్యాక్సిన్ల మీద వ్యాక్సిన్స్..
జర్మనీలోని మాగ్డేబర్గ్‌కు చెందిన 62 ఏళ్ల వ్యక్తి 217 కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకోవడం చర్చనీయమైంది. అయితే, ఈ వ్యాక్సినేషన్ తనకు తానే స్వయంగా చేసుకున్నాడు. 2021 నుంచి 2023 వరకు వ్యాక్సిన్లు తీసుకుంటూనే ఉన్నాడు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. అతడికి ఒక్కసారి కూడా కరోనా వైరస్‌కు గురికాలేదు. కానీ, తనకు కరోనా వచ్చిందేమో అనే భయంతో నిత్యం పీసీఆర్ పరీక్షలు చేయించుకుంటూనే ఉన్నాడు. తనకు కరోనా సోకూడదనే ఉద్దేశంతో వ్యాక్సిన్లకు అలవాటు పడ్డాడు. ప్రస్తుతం అతడి వివరాలను గోప్యంగా ఉంచారు. హైపర్ వ్యాక్సినేషన్ (అవసరానికి మించి వ్యాక్సిన్లు తీసుకోవడం) వల్ల అతడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌కు గురయ్యాడనే విషయాలను వెల్లడించలేదు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై పరిశోధకులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
అతడు ఎందుకు అలా చేశాడు?
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో చాలామంది తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. అది తమకు ఎక్కడ సోకుతుందనే భయంతో ఆరోగ్యంపై అతిగా శ్రద్ధ చూపేవారు. ఇంటి చిట్కాలతోపాటు.. డాక్టర్లు చెప్పే మెడిసిన్స్ కూడా కొనుగోలు చేసి ముందుగానే వాడేసేవారు. ఇది కూడా ఒక మానసిక సమస్యే. కరోనా సోకిన తర్వాత చాలామంది ఈ ఆందోళనతోనే చనిపోయారు. జర్మనీ వ్యక్తి కూడా దాదాపు ఇలాంటి ఆందోళనతోనే వ్యాక్సిన్స్ తీసుకొని ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వాస్తవానికి రెండు మూడు డోసుల తర్వాత కోవిడ్ సోకే అవకాశం తక్కువ. అంతకంటే ఎక్కువ డోసులు వేసుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. కానీ, భయాందోళనతో అతడు మొతాదుకు మించి టీకాలు తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంతోనే ఉన్నాడని, వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు అతడికి అన్ని వ్యాక్సిన్స్ ఎలా అందాయి? అతడు ఏ విధంగా వాటిని పొందాడు తదితర అంశాలపై విచారణ కూడా జరుగుతోంది.
కోర్టు అనుమతితో వైద్యులు అతడి నుంచి లాలాజలం, రక్త నమూనాలు సేకరించారు. వాటిని మూడు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వ్యక్తుల నమూనాలతో పోల్చారు. 29 మంది వ్యక్తుల శాంపిళ్లను పరిశీలించిన వైద్యులు.. ఆ వ్యక్తికి అదనంగా మరో మూడు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చి అతడి శరీరంలో మార్పులను గమనించారు. ఈ సందర్భంగా అతడి శరీరంలో యాంటీబాడీ స్థాయిలు గరిష్ట స్థాయికి చేరినట్లు కనుగొన్నారు. వ్యాధినిరోధక వ్యవస్థలో T, B కణాలు బలోపేతమైనట్లు తెలుసుకున్నారు. అయితే, దాని వల్ల అతడిలో పెద్దగా సైడ్ ఎఫెక్టులేవీ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగా, బతికే ఉన్నాడని నిర్ధరించారు. వాస్తవానికి అతడు స్వయంగా తీసుకున్న వ్యాక్సిన్లు 83 మాత్రమే. అధికారికంగా తీసుకున్నవి 134. అతడి చర్యలు ఎలాంటివైనా.. పరిశోధకులకు కొత్త విషయాలను తెలుసుకొనే ఛాన్స్ వచ్చింది.
Also Read: ఓర్నీ, ఆ దేశంలో హిందూ దేవుళ్లకు, దెయ్యాలకు కూల్ డ్రింక్సే ప్రసాదం - దీని వెనుక పెద్ద కథే ఉందండోయ్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.