Covid 19: కరోనాతో కాపురం, ఇతడికి 78 సార్లు కోవిడ్ పాజిటివ్, 14 నెలలుగా క్వారంటైన్‌లోనే!
14 నెలల్లో ఒక్కసారి కూడా అతడికి కోవిడ్ ఫలితాలు నెగటివ్ రాలేదు. 78 సార్లు అతడికి కోవిడ్-19 పాజిటివ్ చూపించింది. ఇప్పటికీ అతడు ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు.
కోవిడ్-19 ప్రపంచాన్ని పలకరించి ఇప్పటికే రెండేళ్లు కావస్తోంది. ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయారు. కొందరైతే బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. ముఖ్యంగా కోవిడ్ డెల్టా వేరియెంట్ ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. అది కాస్త శాంతించిందని శ్వాస పీల్చుకొనేలోపే ఒమిక్రాన్ వేరియెంట్ వేళ్లూనుకుంది. లక్కీగా ఈ వేరియెంట్ అంతగా ప్రభావం చూపకపోవడంతో ప్రజల్లో భయం పోయి ధైర్యం వచ్చింది. డేల్టా కంటే ఈ సారి ఎక్కువమందికే కరోనా వచ్చింది. అయితే, టెస్టులు చేయించుకోకుండా చాలామంది ఇళ్లలోనే సొంత ట్రీట్మెంట్‌తో కోలుకుంటున్నారు. దీంతో అధికారుల వద్ద కేవలం కోవిడ్-19 టెస్టులు చేయించుకున్న వివరాలు మాత్రమే ఉన్నాయి. టెస్టులు చేయించుకొనేవారు తగ్గడం వల్ల కేసులు తగ్గినట్లుగా భావిస్తున్నారు. అయితే, ప్రపంచంలో అందరికీ కోవిడ్ వచ్చి తగ్గిపోతోంది. కానీ, టర్కీలో నివసిస్తున్న ఈ వ్యక్తిని మాత్రం కరోనా వదిలి పెట్టడం లేదు. పరీక్షలు చేయించుకున్న ప్రతి సారి అతడికి కోవిడ్ పాజిటీవే వస్తోంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అతడికి 78 సార్లు పాజిటివ్ వచ్చింది. ఫలితంగా అతడు 14 నెలలుగా క్వారంటైన్లోనే ఉంటున్నాడు.
Also Read: నగ్నంగా నిద్రపోతే ఇన్ని ప్రయోజనాలా? పరిశోధకులు ఏమంటున్నారు?
ఇస్తాంబుల్‌లో నివసిస్తున్న 56 ఏళ్ల ముజాఫర్ కయాసన్‌కు నవంబరు 2020లో మొదటిసారి కరోనా వైరస్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి అతడు మందులు మింగుతూనే ఉన్నాడు. చివరికి వైరస్ వల్ల హాస్పిటల్‌లో కూడా చికిత్స పొందాడు. తీవ్రత తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేసినా.. కోవిడ్ మాత్రం తగ్గలేదు. లక్షణాలు అలాగే కొనసాగేవి. గత 14 నెలల్లో ఎన్నిసార్లు చికిత్స చేయించుకున్నా.. అతడికి పాజిటీవ్ మాత్రమే వచ్చేది. ఒక్కసారైనా తన రిపోర్టులో నెగటివ్ వస్తుందేమో.. చూసి తరిద్దాం అనుకున్న ప్రతిసారి అతడికి నిరాశే ఎదురైంది. దానివల్ల అతడు నిత్యం ఐసోలేషన్‌లోనే ఉండాల్సి వచ్చేది. చివరికి కుటుంబ సభ్యులు కూడా అతడిని కలవలేని పరిస్థితి నెలకొంది. అప్పుడప్పుడు హాస్పిటల్.. లేకపోతే ఇల్లు.. ఇలా 14 నెలలుగా బెడ్ రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాడు.
ముజాఫర్ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యాక్టీవ్‌గా లేకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని అతడికి చికిత్స అందిస్తున్న వైద్యుడు తెలిపాడు. టర్కీలో కోవిడ్-19 నెగటివ్ వస్తేనే బయట తిరిగేందుకు అనుమతి ఇస్తారు. దానివల్ల ముజాఫర్ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాల్సి వస్తోంది. అతడి, భార్య, కొడుకు మాత్రం కోవిడ్ నుంచి సురక్షితంగానే ఉన్నారు. ఇద్దరికీ నెగటివ్ వచ్చింది. పైగా ముజాఫర్ రక్త క్యాన్సర్ (లుకేమియా)తో బాధపడుతున్నాడు. దీంతో అతడి కుటుంబికులు ఎప్పుడు ఏమవుతుందనే భయాందోళనలతో గడుపుతున్నారు.
Also Read: పురుషులూ జాగ్రత్త, మీ ప్రైవేట్ పార్ట్‌లో ఈ మార్పులు కనిపిస్తే డేంజరే!
తన దయనీయ పరిస్థితి గురించి ముజాఫర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ వల్ల నేను వ్యాక్సిన్ తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఒకే గదిలో ఐసోలేషన్‌లో ఉండటం బాగానే ఉంది. కానీ, నా కుటుంబికులతో ఎప్పటిలా కలిసి ఉండలేకపోతున్నా అనే బాధ వెంటాడుతోంది. వారిని కనీసం టచ్ కూడా చేయలేని దయనీయ స్థితిలో ఉన్నాను’’ అని తెలిపాడు. తనకు కోవిడ్ ఎందుకు తగ్గడంలేదో తెలియదని, దీనికి తగిన పరిష్కారం సూచించాలని ముజాఫర్ అధికారులను కోరుతున్నాడు. మరి, ముజాఫర్ కోవిడ్ నుంచి ఎప్పుడు కోలుకుంటాడో చూడాలి.