చలికాలంలో రోజుకోసారి ఇలా పసుపు టీ చేసుకొని తాగండి, ఏ వ్యాధి దరిచేరదు
చలికాలం ముగిసే వరకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
వేడిగాలి కన్నా చల్లగాలి చాలా ప్రమాదమైనది. వేడిగాలికి ఎక్కువసేపు గురైతేనే దానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది, కానీ చల్లగాలికి ఒక్కసారి గురైనా చాలు, వెంటనే జలుబు దగ్గు వంటి సమస్యలు దాడి చేస్తాయి. అందుకే చలికాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది పసుపుతో చేసిన టీ. దీన్ని చాలా తక్కువ మంది తాగుతారు. రోజుకొకసారి తాగినా చాలు, చలికాలంలో చల్లని గాలి వల్ల కలిగే వ్యాధులను తట్టుకునే శక్తి వస్తుంది. రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఎన్నో అలర్జీలతో పోరాడే శక్తి కలుగుతుంది.
దీనిని తయారు చేయడం చాలా సులువు. ఒకటిన్నర కప్పు నీళ్లలో... పావు టీ స్పూను ఎండిన అల్లం పొడి, పావు టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు పొడి, పావు టీ స్పూన్ నెయ్యి, తీపిదనం కోసం తేనే లేదా బెల్లం వేసుకొని... రెండు మూడు నిమిషాలు స్టౌ పై మరిగించాలి. దీన్ని వడకట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ పొడులే కాబట్టి నీళ్లలో కరిగిపోతాయి. ఉదయం లేదా సాయంత్రం ఈ తేనీరు తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
పసుపులో ఉన్న గుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో సమ్మేళనాలు పసుపులో పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియా వలన కలిగే అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది. ఇక ఇందులో వాడిన అల్లం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది. అందుకే ఆయుర్వేద ఔషధాల్లో కూడా అల్లాన్ని, పసుపును ముఖ్యంగా ఉపయోగిస్తారు. అల్లం, పసుపు, మిరియాలు, బెల్లం ఈ నాలుగు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సాయపడతాయి. దీని రుచి గురించి పెద్దగా బెంగ పెట్టుకోనక్కర్లేదు. అల్లం టీ తాగినట్టు అనిపిస్తుంది.
Also read: మొఘల్ చక్రవర్తులకు ఎండు అల్లం అంటే ఎందుకంత ప్రేమ? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.