Loneliest Home: ప్రపంచంలోనే ‘ఒంటరి ఇల్లు’, ఇప్పుడు అమ్మకానికి వచ్చింది, ధరెంతో తెలుసా?
ప్రపంచంలో ఇలాంటి ఇల్లు దొరకడం కష్టం. నచ్చితే కొనేసుకోండి.
ప్రపంచంలో మీరు మాత్రమే ఉన్న ఫీలింగ్ కావాలా? అరిస్తే నాలుగు దిక్కుల నుంచి అరుపు ప్రతిధ్వనించాలా? అయితే మీకు ఈ ఇల్లు సరిగ్గా సరిపోతుంది. సింగిల్ బతుకు సో బెటర్ అని ఫీలయ్యే వాళ్లకి ఈ ఇల్లు మంచి ఆప్షన్. ఓ చిన్న దీవిలో ఒకే ఒక ఇల్లు. అది కూడా సింగిల్ బెడ్ రూమ్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. చూడగానే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది.
ఎక్కడ? ఎంత?
ఇంతకీ ఈ ఇల్లు ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అమెరికాలోని వోహో బే ప్రాంతంలో ఉంది. నీళ్ల మధ్యలో ఉన్న చిన్న భూభాగంపై ఉన్న చెక్క ఇల్లు. ఆ భూభాగం విస్తీర్ణం ఎకరంన్నర ఉంటుంది. ఆ దీవి పేరు ‘డక్ లెడ్జెస్’. ఈ దీవిలో గడ్డి తప్ప చెట్లు కనిపించవు. చక్కగా చేపలు పట్టుకుని బతికేయచ్చు. అప్పుడుప్పుడు సముద్రం నుంచి సీల్స్, సముద్రపు పక్షులు వచ్చి పలకరిస్తుంటాయి. ఈ ఇంటిని 2009లో నిర్మించారు. ఇప్పటికీ అది చెక్కుచెదరకుండా ఉంది. ప్రస్తుతం ఆ ఇల్లు బిలీ మిలికేన్ అనే హౌసింగ్ ఏజెంట్ పేరిట ఉంది. ఇది 540 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. దీని ధర 3,39,000 డాలర్లు. అంటే మన రూపాయల్లో రెండున్నర కోట్లు.
ఈ ఇంటి ఫోటో 2020లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా వైరస్ అధికంగా ఉన్న సమయంలో క్వారంటైన్ ఉండడానికి ఇదే ఉత్తమ స్థలం అని చాలా మంది సోషల్ మీడియాలో ఈ ఇంటి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఇంటిని ఒక బిలియనీర్ కట్టించుకున్నాడని, అతనికి జాంబీల ఫోబియా ఉందని, అందుకే ఇలా ఎవరూ వెళ్లలేని చోట ఇల్లు కట్టుకున్నట్టు చెబుతారు. దాన్ని బిలీ అనే వ్యక్తికి అమ్మడానికి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. చాలా మంది ఆ ఇల్లు ఎప్పటికైనా సముద్రంలో మునిగిపోతుందనే భయంతో ఉన్నారు. అందుకే అంత త్వరగా దాన్ని కొనేందుకు ముందుకు రావడం లేదు. అందులోనూ ఆ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు. బయటే చిన్న రూమ్ కట్టారు. అది కూడా ఆ ఇంటికి మైనస్ లా మారింది.