Beetroot for Men: బీట్ రూట్‌తో ఆ సామర్థ్యం పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Beetroot health benefits: బీట్ రూట్‌తో బీపి తగ్గుతుంది, వర్కవుట్ సామర్థ్యం పెరుగుతుంది వంటి ఇతర ఆరోగ్యప్రయోజనాలు సరే. మరి యూకే డాక్టర్లు చెప్తున్నట్టు బీట్ రూట్ నిజంగా వయాగ్రాలా పనిచేస్తుందా?
యూకే మార్కెట్లలో అకస్మాత్తుగా బీట్ రూట్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయి బీట్ రూట్ కొరత ఏర్పడింది. అందుకు కారణం యూకేలో టీవీ డాక్టర్‌గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ మైఖెల్ మోస్లీ బీట్ రూట్‌ను వెజిటబుల్ వయాగ్రా అని చెప్పడమే కారణం.
బీట్ రూట్ ప్రత్యేకతలు
బీట్ రూట్ మాత్రమే కాదు బెర్రీలు, గింజలు, ఆకూకూరలు అన్నీ కలిపి మానవ ఆరోగ్యం మీద సూపర్ ఫూడ్‌గా పనిచేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఇతర సూక్ష్మపోషకాలన్నీ కూడా మోతాదు కంటే ఎక్కువే కలిగి ఉంటాయి. ముఖ్యంగా బీట్ రూట్‌లో విటమిన్లు B,Cలు, ఖనిజాలు, ఫైబర్ ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ మరో ప్రత్యేకత ఏమిటంటే వండటం వల్ల వీటిలోని పోషకాలు పెద్దగా నష్టపోవు. కాప్సుల్స్, పౌడర్, చిప్స్, జ్యూస్‌గా చేసినపుడు మాత్రం వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కొద్దిగా సామర్థ్యాన్ని కోల్పోతాయి.
నిజంగా బీట్ రూట్ వెజిటబుల్ వయాగ్రానా?
బీట్ రూట్‌తో పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుతుందన్న ప్రచారం విస్తృతంగా సాగడంతో ఇది నిజమేనా అనే అనుమానం మొదలైంది. పోషకాలతో నిండి ఉంటుంది కాబట్టి.. బీట్ రూట్ తీసుకున్నపుడు ఆ సామర్థ్యం కూడా మెరుగుపడుతుండవచ్చు. కానీ.. ప్రత్యేకంగా ఆ సామర్థ్యం పెంచుతుందని చెప్పేందుకు తగినన్ని ఆధారాలు లేవని డాక్టర్లు అంటున్నారు. శారీరక కలయికపై వాంఛ, ఆరోగ్యం ఇతర అంశాలను గురించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
బీట్ రూట్ తిన్నపుడు దానిలోని బ్యాక్టీరియా, ఎంజైములతో రసాయన ప్రతిచర్య జరిగి బీట్ రూట్‌లోని నైట్రేట్ నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తాయి. ఇది రక్తనాళాలు విస్తరించేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ లభించే కూరగాయల్లో పాలకూర, బీట్ రూట్ మఖ్యమైనవి.
ఈ నైట్రిక్ ఆక్సైడ్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ మెరుగుపడేందుకు కూడా దోహదం చేస్తుందట. అందువల్ల ఆ సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. రక్తప్రసరణ మెరుగవడం వల్ల గుండె, రక్తనాళాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యం నేరుగా ఆ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి.. బీట్ రూట్ తో ఆ సామర్థ్యం పెరుగుతుందని చెప్పవచ్చు. బీట్ రూట్ ఆ సామర్థ్యం మెరుగు పడవచ్చు, కానీ అద్భుతాలు చేస్తుందని ఆశించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఆక్సిడేషన్ ఒత్తిడి తగ్గించడానికి బీట్ రూట్ చాలా మంచి పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు. అంతేకాదు బీపి అదుపు చెయ్యడంలో కూడా బీట్ రూట్ ముందుంటుంది.
మునగ కంటే బీట్ రూట్ బెటరా?
ఇన్ని రోజులు మునగ కాయలు, ఆకులు.. పువ్వులు.. పురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచుతాయనే భావన ఉంది. అయితే, పోషకాలు విషయంలో బీట్‌రూట్‌కు, మునగ.. దేనికదే ప్రత్యేకం. ఆ సామర్థ్యం పెంచడంలో రెండూ ఒకేలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మునగ అందుబాటులో లేనప్పుడు బీట్‌రూట్‌ను తీసుకోవచ్చు. మునగతో పోల్చితే బీట్‌రూట్ రక్త ప్రసరణ మెరుగుపరిచి మరింత ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.
Also Read : Brain Size: మనిషి మెదడు పరిమాణం పెరుగుతోందట, ఆ రోగులకు ఇది శుభవార్త? స్టడీలో ఏం తేలింది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.