New Year Fitness Resolution 2024 : జనవరి 1 అని జిమ్ ఫీజ్ కడుతున్నారా? హెల్తీగా ఉండేందుకు జిమ్‌కే వెళ్లాలా ఏంటి?
New Year Resolution 2024 : చాలామంది న్యూ ఇయర్ రిజల్యూషన్ జిమ్‌కి వెళ్లడమే ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి ఎలాగైనా హెల్తీగా ఉండాలనుకుంటూ జిమ్ ఫీజులు కట్టేస్తారు. మీరు కూడా అలాంటి వారు అయితే ఇది మీకోసమే.
Fitness Goals 2024 : కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు. దాదాపు చాలా మంది ఈ సంవత్సరమైనా నేను హెల్తీగా ఉండాలి. వర్క్ అవుట్స్ ప్రారంభించాలి. చాలా స్ట్రిక్ట్‌గా డైట్ మెయింటైన్ చేయాలి అనుకుంటారు. అంతే ఆవేశంతో వెళ్లి జిమ్‌లో వేలకు వేలు డబ్బులు కట్టేస్తారు. ఒక్కరోజు జిమ్‌లో కష్టపడి న్యూ ఇయర్ గోల్స్ అంటూ స్టేటస్లు పెడతారు. అంతే మ్యూజిక్ స్టార్ట్ అన్నట్లు జిమ్‌కి అస్సలు వెళ్లారు. సరే డబ్బులు కట్టాము కదా.. వెళ్లకపోతే బాగోదు.. ఇంట్లో వాళ్లు తిడతారో అని కొన్ని రోజులు వెళ్తారు.
కొత్త ఉత్సాహం కూడా కొన్ని రోజులు జిమ్‌కి వెళ్లేలా చేస్తుంది. మహా అయితే ఓ వారం వెళ్తారు. వారంలో ఓ రోజు రెస్ట్ తీసుకుంటారు. ఇక అక్కడినుంచి అబ్బా ఉదయాన్నే లేచి జిమ్‌కి వెళ్లాలా? అనుకుంటారు. పైగా జనవరిలో చలి కూడా.. అరే ఏమి జిమ్‌కి వెళ్తావు. కాసేపు నిద్రపో అన్నట్లే ఉంటుంది. ఇలా జిమ్‌కి బ్రేక్ పడుతుంది. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్లాలనే వంకతో, జిమ్‌కి వెళ్లడానికి టైమ్ కుదరట్లేదని సాకులు వినిపిస్తాయి. మనలో చాలామంది ఇలానే జిమ్‌కి పైసలు కట్టి.. మానేసి ఉంటారు. అయితే మీరు జనవరి 1 నుంచి వెళ్లాల్సింది జిమ్‌కి కాదు.
హెల్తీగా ఉండేందుకు జిమ్‌కే వెళ్లాలా ఏంటి? మీ న్యూ ఇయర్ రిజల్యూషన్‌లో డబ్బులు పొదుపు చేయడం కూడా ఒకటి ఉండే ఉంటుంది కదా. మరి వెళ్లని జిమ్‌కి డబ్బులు కట్టడం అవసరమా? కానీ మీరు ఇంట్లో ఉండి కూడా హెల్తీగా ఉండొచ్చు తెలుసా? ఎలా అంటే తినే ఆహారం, సరైన నిద్ర, కాస్త శారీరక శ్రమ ఉంటే చాలు. మీరు హెల్తీగా, యాక్టివ్‌గా ఉండేందుకు ఇవి సరిపోతాయి. దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీ రోటీన్ లైఫ్‌ని కాస్త మార్చుకుంటే జిమ్ డబ్బులు మిగులుతాయి. మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
ఆహారం విషయంలో ఇవి ఫాలో అవ్వండి..
టేస్ట్ పేరుతో.. వండుకునే సమయం లేదనో చాలా మంది బయట ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా తినేస్తారు. ఇవి టేస్ట్‌ని ఇవ్వడం సంగతి పక్కన పెడితే మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి మీరు ఇంట్లోనే వండిన ఫుడ్ తినడానికి ప్రయత్నించండి. ఇంటి ఫుడ్ దొరకకుంటే ఎక్కువ శాతం కూరగాయలు, పండ్లు, వాటితో చేసిన సలాడ్స్ తినడం ప్రారంభించండి. మీరు ఫుడ్ విషయంలో చేసుకోవాల్సిన అత్యంత పెద్ద మార్పు ఏంటంటే.. టైమ్‌కి తినడం. చాలా మంది పనిలో ఉన్నామనో.. ఇప్పుడు కుదరదనో.. ఆకలి వేయట్లేదనో.. సరైన సమయానికి ఫుడ్ తినరు. దీనివల్ల మీ జీవక్రియ పూర్తిగా దెబ్బతింటుంది. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి సమయానుసారం ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. పైగా వీటిని ఫాలో అయితే బరువు కూడా మీ కంట్రోల్లో ఉంటుంది.
నిద్ర విషయంలో ఇవి పాటించాల్సిందే..
చాలామంది నిద్రను చాలా అశ్రద్ధ చేస్తారు. ఫోన్లలో మునిగిపోతూ వస్తున్న నిద్రను ఆపేసుకుని మరీ.. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. నిద్ర అనేది శారీరకంగానే కాదు.. మానసికం కూడా ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగ్గా లేకుంటే మీ హెల్త్ కరాబ్ కావడంతో పాటు.. మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల రాత్రి నిద్ర ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. ఫోన్ వంటి పరికరాలను కాస్త దూరంగా ఉంచి.. త్వరగా నిద్ర పోయేందుకు ప్రయత్నించండి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు వైద్యుల సహాయం తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సరైన నిద్ర ఉంటే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి. బరువు తగ్గుతారు.
శారీరక శ్రమ ఎక్కువ అవసరం లేదు..
శారీరక శ్రమ కోసం జిమ్‌కి వెళ్లాల్సిన పని లేదు. మీ పనులు మీరు చేసుకోగలిగితే చాలు. ఉదయాన్నే లేవండి. కాసేపు విటమిన్ డి కోసం ఎండలో కూర్చోండి. జస్ట్ 5 నిముషాలు చాలు. ఉదయాన్నే పొందే ఎండ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? అలా ఎండలో కుర్చున్నప్పుడు శ్వాసను పూర్తిగా తీసుకుని.. వదిలేయండి. మీ బ్రేక్‌ఫాస్ట్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఇంటి పనులు చేయండి. పాలు బ్లింక్ ఇట్లో ఆర్డర్ చేయకుండా మీరే సరదగా నడుచుకుంటూ వెళ్లి కావాల్సినవి తెచ్చుకోండి.
ఆఫీస్‌కి బస్ లేదా మెట్రోలో వెళ్తున్నారా? అవి మీ ఇంటికి తక్కువ దూరంలో ఉంటే నడిచి వెళ్లండి. కుదిరితే లిఫ్ట్‌లు అవాయిడ్ చేయండి. అమ్మో మా ఆఫీస్ 20వ ఫ్లోర్లో ఉంటుందనుకుంటే.. కనీసం రోజూ ఓ మూడు ఫ్లోర్లు మెట్లు ఎక్కండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే పడుకుని కాకుండా.. చక్కగా హాల్లో నడుస్తూ మాట్లాడండి. ఇలాంటి చిన్న చిన్న పనులే మీ ఆరోగ్యంలో పెద్ద మార్పులు, ఫలితాలు ఇస్తాయి. ముందు వీటిని ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల టైమ్ మేనేజ్ చేయడం కూడా వస్తుంది. ఈ రోటీన్ మీకు అలవాటు అయ్యాక.. జిమ్‌లో జాయిన్ అవ్వండి. జిమ్ అంటే జనవరి 1వ తేదీనే కాదు.. సంవత్సరంలో 365 రోజులు మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది.
Also Read : ఈ సింపుల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీ జీవితంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి