రాత్రి పూట ఈ మందులు వేసుకుంటే నిద్రకు దూరమవ్వడం ఖాయం
కొన్ని రకాల మందులు నిద్రను తెప్పిస్తాయి. మరికొన్ని నిద్రను రాకుండా అడ్డుకుంటాయి.
జీవితంలో ఒత్తిళ్లు పెరిగిపోతాయి. ఆ ఒత్తిళ్లు రకరకాల ఆరోగ్యసమస్యలకు కారణం అవుతాయి. దీని వల్ల నిద్రలేమి కూడా వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి నిద్ర వచ్చేలా చేసే ఆహారాన్ని, అలవాట్లను చేసుకోవాలి. అలానే నిద్రను రాకుండా అడ్డుకునే పనులను కూడా మానుకోవాలి. ఎందుకంటే నిద్ర చాలా అవసరం. ఒక వ్యక్తి సరిగ్గా నిద్రపోకపోతే, అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. రోజూ సాయంత్రం కాఫీ, టీలు తాగడం నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ఆ అలవాటును మానుకుంటే మంచిది. అలాగే కొందరు కొన్ని రకాల ఆరోగ్యసమస్యలకు మందులు ఉపయోగిస్తారు. వాటిని దాదాపు ఉదయం పూట వేసుకోవడమే మంచిది. అవి రాత్రి పూట వేసుకోవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఎలాంటి మందులు రాత్రి పూట వేసుకోవడం వల్ల నిద్ర చెడిపోతుందో తెలుసుకోండి.
జలుబు మందులు
జలుబుకు ఇచ్చే మందుల్లో యాంటీ హిస్టామైన్లు ఉంటాయి. ఇవి మగతగా ఉండేలా చేస్తాయి. ఆ మగతను రాకుండా ఉంచేందుకు ఆ మందుల్లోనే సూడో ఎఫెడ్రెన్ కలుపుతారు. ఇది నిద్ర రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి మీ మందులో ఇది ఉంటే మాత్రం రాత్రి పూట వేసుకోకపోవడమే మంచిది. వీలైనంతగా ఉదయం పూటతోనే ఆపేయాలి.
యాంటీ డిప్రెసెంట్స్
యాంటీ డిప్రెసెంట్ మందుల్లో సెలెక్టివ్ సెరోటోనిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. ఇవి మెదుడులో ఉత్తేజాన్ని కలిగించే సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. దీని వల్ల మీ మానసిక స్థితి ఉల్లాసంగా మారుతుంది. అలాగే ఫ్లూక్సెటైన్ వంటివి కూడా అందులో కలుపుతారు. ఇవి నిద్రను రాకుండా అడ్డుకుంటాయి. మీరు ఒకవేళ ఈ మందులను రాత్రిపూట తీసుకుంటున్నట్టు అయితే... మీ వైద్యుడిని అడిగి ఉదయం పూట వేసుకోవడం ఉత్తమం. అయితే మీ వైద్యుని అనుమతితోనే ఈ మార్పులు చేయాలి.
నికోటిన్ పాచెస్
సిగరెట్ మానేయాలని ప్రయత్నించేవారు నికోటిన్ పాచెస్ వెంట పడతారు. వాటిని నములుతూ ఉంటారు.ఇవి కూడా నిద్ర లేమికి కారణం అవుతాయి. నిద్రపోయే ముందు వీటిని తినడం మానుకోవాలి. లేకుంటే మీకు అర్ధరాత్రి దాటాక కానీ నిద్ర రాదు. నిద్రలేమి వల్ల తలనొప్పి, తిరిగి సిగరెట్ కాల్చాలన్న ఆలోచన పెరిగిపోతుంది. కాబట్టి నికోటిన్ ప్యాచెస్‌ని సాయంత్రం దాటాకా నమలకపోవడమే మంచిది.
Also read: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.