Relationships: ఒక బిడ్డను కన్నాక లావుగా అయ్యాను, నా భర్త పంది, ఏనుగు అని పిలుస్తున్నాడు
లావుగా మారిన తనకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వకుండా భర్త అవమాన పరుస్తున్నాడని చెబుతున్న ఓ భార్య ఆవేదన ఇది.
ప్రశ్న: మాకు పెళ్లయిన మూడేళ్ల తర్వాత పాప పుట్టింది. అంతకుముందు నేను సన్నగానే ఉండేదాన్ని. పాప పుట్టాక లావుగా మారాను. దాంతో నా భర్త నన్ను పంది, ఏనుగు వంటి పేర్లతో పిలవడం ప్రారంభించాడు. మా ఇద్దరి మధ్య పిలిస్తే నేను ఏమీ అనుకునేదాన్ని కాదు. కానీ స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కూడా నా శరీరాన్ని హేళన చేయడం, అదే పేర్లతో పిలవడం చేస్తున్నాడు. పాప పుట్టి ఇంకా సంవత్సరమే అయ్యింది. అప్పుడే బరువు తగ్గమని బలవంతం చేస్తున్నాడు. నా బరువు గురించి పదేపదే ఎగతాళి చేస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకలా చేస్తున్నారు అని అడిగితే, సన్నగా మారాలని నిన్ను ప్రోత్సహించడానికి చేస్తున్నానని చెబుతున్నాడు. ఇది బాడీ షేమింగ్ కాదా? అని అడిగితే కాదని అంటున్నాడు. ఆయన అనే మాటలు వల్ల నా ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది. నన్ను నేనే ద్వేషించుకోవడం మొదలుపెట్టాను. ఈ పరిస్థితిలో ఏం చేయాలి?
జవాబు: ఎంతోమంది భార్యలు బిడ్డలు పుట్టాక ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బరువు. అయితే తల్లిగా మారాక ఆ దేవుడు ఇచ్చిన బహుమతి ఈ బరువు పెరగడం అనుకోవాలి. గర్భం ధరించాక శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. వాటిలో బరువు పెరగడం ప్రధానమైనది. దీన్ని అర్థం చేసుకునే భర్త మీకు లేరు. అతడిని గర్భం ధరించిన తర్వాత స్త్రీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో, ఎందుకు బరువు పెరుగుతారో తెలుసుకోమని చెప్పండి. వీలైతే వైద్యులను కలిసి కారణాలు తెలుసుకోమనండి. భార్యను నిజంగా ప్రేమించే వారు ఎవరు అలాంటి మాటలతో స్నేహితులు, కుటుంబ సభ్యుల ముందు అవమానించరు. పాప పుట్టిన ఏడాదిలోనే బరువు తగ్గడం అసాధ్యం. ఆ తరువాత మెల్లమెల్లగా తగ్గుతారు. కొత్తగా తల్లిదండ్రులైన అనుభూతిని మీరు అనుభవించకుండా, ఇలా మాటలు అనుకోవడం బాధాకరం. ఇలాంటి విషయాలు వివాహాన్ని నాశనం చేసే స్థాయికి చేరుతాయి.
ఈ విషయంలో మీరు ఇంట్లోని ఇతర ఆడవారి సాయం తీసుకోండి. ఆయనకి అక్క చెల్లెలు ఉంటే వారికి విషయం చెప్పి వారి చేత ఎందుకు స్త్రీ బరువు పెరుగుతుందో చెప్పమనండి. ఇలా అందరిలో అవమానపరిస్తే బంధం తెగేదాకా వస్తుందని ఆయనకు వివరించండి. ఆయనలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయని, ఆ లోపాలను ఏ రోజు మీరు ఎత్తి చూపలేదని, అన్నిటినీ అంగీకరించారనే విషయం ఆయనకు వివరించండి. గర్భం అనేది స్త్రీ జీవితంలో సంభవించే ఒక సున్నితమైన సమయం. పిల్లలను సురక్షితంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి తల్లిగా మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులకు గురవుతారు. ఆ విషయాన్ని ఆయనకు అర్థం అయ్యేలా చెప్పండి. సన్నగా అవ్వడానికి సమయం పడుతుందని, ఆ సమయాన్ని ఇవ్వమని అడగండి. లేకుంటే కౌన్సిలింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లి ఆయనకి కౌన్సిలింగ్ ఇప్పించండి. కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి, వాటిని మాట్లాడడం వల్ల మనసు గాయపడుతుంది. మీ మనసు గాయపడుతున్న విషయాన్ని ఆయనకు వివరించాల్సిన అవసరం ఉంది.
Also read: మనం తాగే టీ, తినే పసుపే కరోనా మరణాలను తగ్గించింది - ICMR అధ్యయనంలో వెల్లడి