Fashion Diva Sudhareddy: సుధారెడ్డి... అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలుగందం... అసలు ఎవరీమె?
మెట్ గాలాలో భారత్ నుంచి పాల్గొన్న ఒకే ఒక వ్యక్తి సుధారెడ్డి. ఈమె పక్కా హైదరాబాదీ.
ప్రియాంక చోప్రా, దీపిక పడుకునే వంటి ఫ్యాషన్ తారలు మెరిసిన ‘మెట్ గాలా’ వేదికపై ఓ హైదరాబాదీకి చోటు దక్కింది. ఈసారి దేశం నుంచి మెట్ గాలాలో పాల్గొన్న ఏకైక వ్యక్తి సుధారెడ్డి. బాలీవుడ్ తారలు, బిలియనీర్లు ఎంతోమంది ఉండగా సుధారెడ్డిని ఆ అవకాశం వరించింది. ఇంతవరకు పెద్దగా ఎక్కడా వినిపించని పేరు... ఇప్పుడు హఠాత్తుగా వార్తల్లోకి వచ్చింది. అందుకే సుధారెడ్డి గురించి గూగుల్ సెర్చ్ లు ఎక్కువైపోయాయి. అసలు ఎవరీమె? ఏం చేస్తారు? మెట్ గాలాలో మెరిసే అవకాశాన్ని ఎలా దక్కించుకున్నారు?
సుధారెడ్డి... హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త భార్య. బిలియనీర్ కూడా. ఈమె ఓ ప్రముఖ సంస్థకు డైరెక్టర్ కూడా. సాధారణ ప్రజలకు ఆమె తెలియకపోవచ్చు... కానీ హైదరాబాద్ సోషల్ సర్కిల్ లో మాత్రం అందరికీ తెలిసిన వ్యక్తే.
సేవాగుణం ఎక్కువే...
ఇన్ స్టా ఖాతాలో ఆమె తనను తాను బిజినెస్ ఉమెన్, ఆంత్రప్రెన్యూర్, ఫిలాంత్రపిస్టు, హోమ్ మేకర్ గా పరిచయం చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే చైతన్య కార్యక్రమాలు, విరాళాలసేకరణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారీమె. ఆ కార్యక్రమాల్లోనే ఆమెకు పలు అంతర్జాతీయస్థాయి వ్యక్తులతో పరిచయాలు కూడా అయ్యాయి. పిల్లల ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన చైతన్యకార్యక్రమాలు, బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా సదస్సులు... వంటి వాటిలో అమెరికా నటీమణులు ఇవా లాంగరియా, ఎలిజబెత్ హర్లీ లతో కలిసి పనిచేశారు. ఫ్రాన్స్ లో జరిగిన ఓ సేవా కార్యక్రమంలో దాదాపు 135000 యూరోలు విరాళంగా ఇచ్చారు. అంటే మన రూపాయల్లో కోటి పైనే. ఇలాంటి గ్లోబల్ ఈవెంట్లు సుధారెడ్డికి కొత్త కాదు. ఆమె సేవా గుణానికి గుర్తింపుగానే మెట్ గాలాలో మెరిసే అవకాశం దక్కింది.
ఈమెకు ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఎక్కువ. గతంలో ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు షాపింగ్ చేయడం చాలా ఇష్టమని చెప్పారు. హైదరాబాద్ వీధుల్లో అమ్మే వస్తువుల నుంచి హైక్లాస్ లగ్జరీ ఉత్పత్తుల వరకు అన్నీ కొంటానని తెలిపారు. అంతేకాదు నోట్లో ఎడమవైపు ఓ పన్ను స్థానంలో వజ్రంతో చేసిన పన్ను పెట్టించుకున్నట్టు చెప్పారు. తాను నవ్వినప్పుడల్లా ఆ వజ్రం మెరుపు కనిపిస్తుందని తెలిపారు.
ఖరీదైన బహుమతి
ఆమె నలభయ్యవ పుట్టినరోజు వేడుకలు 2018లో హైదరాబాద్లోని హైటెక్స్ లో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా భర్త ఆమె కోసం చాలా ఖరీదైన రోల్స్ రాయిస్ కారును బహుమతిగా అందించారు. ఆ మోడల్ కార్లు ప్రపంచంలో చాలా పరిమితసంఖ్యలోనే ఉన్నాయి. పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నప్పుడే రోల్స్ రాయిస్ ప్రతినిధులు కారును తీసుకొచ్చి ఆమెకు అందించారు. ఈ కారును నలుపు, బంగారు రంగుల్లో ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించారు సుధా భర్త. ఆ పుట్టిన రోజు వేడుకలకు ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటూ అంతర్జాతీయ స్థాయిలోని ఫ్యాషన్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అతి పెద్ద కేకును కట్ చేసింది. అప్పట్లో పేజ్ త్రీ సర్కిల్ లో ఆమె పుట్టిన రోజు పెద్ద వార్తగా మారింది.
ఫ్యాషన్ ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో ఆమె అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలను కూడా నిర్వహిస్తుంటారు. ఆ షోల కోసం దుబాయ్, ఫ్రాన్స్, అమెరికాల నుంచి ప్రత్యేకంగా డిజైనర్లను తీసుకొస్తుంటారు.
ఇప్పుడు తొలిసారి మెట్ గాలా వంటి ఓ అంతర్జాతీయ వేదికపై మెరిసి మంచి గుర్తింపు పొందారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ప్రణవ్, మనర్ ఉన్నారు.
">