Sleep Schedule: ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం, అంతకన్నా తగ్గితే ఏమవుతుంది?
శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే అవసరం.
చాలా మంది నిద్రను తక్కువ అంచనా వేస్తారు. ఉదయమంతా పనిచేసి రాత్రి ఇంటికి చేరి ఫోన్లో అధిక సమయం గడిపేస్తుంటారు. వరుస పెట్టి వెబ్ సిరీస్‌లు చూస్తుంటారు. ఏ అర్థరాత్రికో నిద్రపోతారు. దీని వల్ల వారికి నిద్రా సమయం తగ్గుతుంది. కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోని వారి సంఖ్య చాలా అధికంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. నిద్ర తగ్గించుకుని మరీ సినిమాలు, షికార్లు ఎంజాయ్ చేసేవారికి షాకిచ్చే విషయం ఏంటంటే.. మీ వయసుకు తగినంత నిద్రపోకపోతే గుండె పోటు నుంచి నరాల బలహీనత వరకు ఏదైనా త్వరగా ఎటాక్ చేయగలదు. అందుకే మీ వయసుకు తగినంత నిద్ర పోవడం ఉత్తమం. ఏ వయసు వారు ఎంత నిద్రపోవాలంటే...
పుట్టినప్పటి నుంచి 3 నెలల వయసు: 14 నుంచి 17 గంటలు
4 నుంచి 11 నెలలు : 12 నుంచి 16 గంటలు
1 నుంచి 2 సంవత్సరాలు: 11 నుంచి 14 గంటలు
3 నుంచి 5 సంవత్సరాలు : 10 నుంచి 13 గంటలు
6 నుంచి 12 సంవత్సరాలు: 9 నుంచి 12 గంటలు
13 నుంచి 18 సంవత్సరాలు: 8 నుంచి 10 గంటలు
18 నుంచి 64 సంవత్సరాలు: 7 నుంచి 9 గంటలు
65 ఏళ్లపై బడిన వారు : 7 నుంచి 8 గంటలు
ఎన్ని నష్టాలో...
నిద్ర తక్కువైతే వెంటనే కనిపించే లక్షణాలు తలనొప్పి, చికాకు, కళ్లకింద నల్లటి వలయాలు, చర్మం పాలిపోవడం, మగతగా ఉండి ఆహారం తినాలనిపించకపోవడం, తిన్నా కూడా వాంతులొచ్చేట్టు అనిపిస్తుంది. తగినంత నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కార్టిసోల్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల హైబీపీ త్వరగా వచ్చే అవకాశం ఉంది. నిద్ర సరిపోని వారిలో తీపి పదార్థాలు తినాలన్న కోరిక పెరిగిపోతుంది. చర్మంపై గీతలు, ముడతలు అధికమవుతాయి. శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ పెరిగిపోతుంది. రకరకాల టాక్సిన్లు, సూక్ష్మజీవులు శరీరంపై దాడి చేస్తున్నా వాటిని ఎదుర్కొనే శక్తి రోగనిరోధక వ్యవస్థకు తగ్గిపోతుంది. కాబట్టి నిద్రను ఎప్పుడూ అశ్రద్ధ చేయద్దు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: నలభై ఏళ్లు దాటిన వారు రోజుకో గుడ్డు తినాల్సిందే అంటున్న అధ్యయనాలు
Also read: క్యారెట్ హల్వాలాగే ఆపిల్ హల్వా, రుచి అదిరిపోతుంది