పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే
హైబీపీ ఉన్నవాళ్ళు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలకి దారితీసే ప్రమాదం ఉంది.
అధిక రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే అది జీవితాంతం వెంటాడుతుంది. ఉప్పు తగ్గించుకుని తినాలి, చక్కెర పదార్థాలకి దూరంగా ఉండాలి. తీసుకునే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. చలికాలంలో మరీ ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్లో రక్తపోటు పెరుగుతుంది. ఇదొక సైలెంట్ కిల్లర్. గుండె పోటు, స్ట్రోక్, హృదయ సంబంధ వ్యాధులు(సీవీడీ) రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. భారతదేశంలోని మొత్తం మరణాల్లో మూడింట ఒక వంతుకి కారణం అధిక రక్తపోటు. ఎటువంటి లక్షణాలు బయటకు కనిపించవు. కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం అధిక రక్తపోటుని నయం చెయ్యలేరు. కానీ జీవనశైలిలో మార్పులు చేసుకుని మందులు వాడుతూ ఉంటే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
అధిక రక్తపోటు ప్రసరణ వ్యవస్థని ఎలా ప్రభావితం చేస్తుంది?
సీవీడీలు రావడానికి అతిపెద్ద కారణం అధిక రక్తపోటు. రక్త ప్రసరణ వ్యవస్థ గుండె నుంచి ఊపిరితిత్తులకి ఆక్సిజన్ పొందడానికి, రక్తాన్ని పంపడంలో సహాయపడుతుంది. గుండె ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని ధమనుల ద్వారా శరీరంలోని మిగిలిన భాగాలకి సరఫరా చేస్తుంది. అధిక రక్తపోటు గుండెని కష్టపడేలా చేస్తుంది. ధమనుల లోపల ఉండే సున్నితమైన కణజాలాలని దెబ్బతీస్తుంది.
అధిక రక్తపోటు వల్ల పీఏడీ సమస్య
అధిక రక్తపోటు ప్రభావం పాదాలు చూపిస్తాయి. ధమనులు కాళ్ళు, పాదాల్లో కూడా ఉంటాయి. దీని వల్ల శరీరంలోని పేలవమైన ప్రసరణకి దారితీస్తుంది. ఫలితంగా పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధికి దారితీస్తుంది. ఇది ప్రమాదకరమైనది కాకపోయినా కూడా చికిత్స చేయకుండా వదిలేస్తే అది గుండె వైఫల్యం లేదా గుండె పోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది.
పీఏడీ లక్షణాలు
అధిక రక్తపోటు కారణంగా వచ్చే పీఏడీ లక్షణం పాదాలు చల్లగా మారిపోవడం. అంతే కాదు పాదాలు ఎరుపు లేదా నీలం రంగులోకి మారిపోతాయి. పాదాలు జలదరింపుగా అనిపిస్తాయి. కాళ్ళపై ఉండే జుట్టు రాలడం కూడా పేలవమైన రక్త ప్రసరణ సమస్యకి సంకేతంగా నిపుణులు సూచిస్తున్నారు.
అధిక కొలెస్ట్రాల్ కూడా కారణం
పీఏడీ వ్యాధి రావడానికి అధిక కొలెస్ట్రాల్ కూడా మరొక కారణం కావొచ్చు. కొవ్వు పదార్థాలు ధమనుల్లో పేరుకుపోయినప్పుడు అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తరచుగా అధిక కొలెస్ట్రాల్ వల్లే వస్తుంది. గుండె జబ్బులకి మరొక పెద్ద ప్రమాదకారకం ఇది. అథెరోస్క్లెరోసిస్ గుండెకి ధమనుల వల్ల వెళ్ళే రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. దీని వల్ల కాళ్ళు, పాదాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి.
ఈ వ్యాధి లక్షణాలు
మయో క్లినిక్ ప్రకారం అధిక కొలెస్ట్రాల్ తో సంబంధం ఉన్న పీఏడీ వ్యాధి వచ్చే ముందు కనిపించే లక్షణాలు
☀ కాళ్ళు తిమ్మిరి లేదా బలహీనంగా మారిపోవడం
☀ కాళ్ళలో పల్స్ తక్కువగా ఉండటం
☀ కాళ్ళపై చర్మం మెరుస్తూ ఉండటం
☀ చర్మం రంగు మారడం
☀ గోళ్ళ పెరుగుదల నెమ్మదించడం
☀ కాళ్లు, పాదాలపై పుండ్లు నయం కాకుండా దీర్ఘకాలికంగా బాధించడం
☀ కాళ్ళు కదిలిస్తే తిమ్మిర్లు, నొప్పులు కలగడం
☀ జుట్టు రాలడం లేదా కాళ్ళపై జుట్టు నెమ్మదిగా పెరగడం
అధిక రక్తపోటు నియంత్రించే మార్గాలు
అధిక రక్తపోటుని నివారించడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అందుకు చేయాల్సిందల్లా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
⦿ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
⦿ బరువు అదుపులో ఉంచుకోవాలి
⦿ శరీరం చురుకుగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి
⦿ ధూమపానం, మద్యపానం అలవాట్లకి దూరంగా ఉండాలి
⦿ కంటి నిండా నిద్రపోవాలి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు - అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ కావొచ్చు