(Source: ECI | ABP NEWS)
Liver Disease Treatment : హెన్నాతో కాలేయ ఫైబ్రోసిస్‌కు చెక్ పెట్టొచ్చట.. కొత్త ఆశ చూపిస్తున్న తాజా అధ్యయనం
Henna Dye For Liver Health : హెన్నాలోని ఓ పదార్థంతో లివర్ ఫైబ్రోసిస్‌కి చెక్ పెట్టి.. కాలేయ క్యాన్సర్ రాకుండా, ప్రాణాంతకం కాకుండా చూడవచ్చట. మరి తాజా అధ్యయనం ఏమి చెప్తుందో చూసేద్దాం.

Henna Dye Can Treat Liver Diease : పండుగల సమయంలో చాలామంది చేతులకు హెన్నా పెట్టుకుంటారు. జుట్టుని, చర్మం రంగును మార్చే గుణం హెన్నాకు ఉంది. అయితే ఇది అందాన్ని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం సహజమైన హెన్నా లివర్ సమస్యలను దూరం చేస్తుందని గుర్తించారు. ఇంతకీ ఇది ఎంతవరకు నిజం. హెన్నా ప్రభావం కాలేయంపై ఎలా ఉంటుందో చూసేద్దాం.
కాలేయ సమస్య దూరం!?
ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ప్రకారం.. హెన్నాలోని లాసోనియా ఇనర్మిస్ అనే రంగు.. లివర్ ఫైబ్రోసిస్‌కు చికిత్స చేయగలదని గుర్తించారు. మధ్యపానం అధికంగా సేవించడం వల్ల, జీవనశైలి వల్ల వచ్చే దీర్ఘకాలిక కాలేయ సమస్యలను తగ్గించడంలో హెన్నా మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
హెన్నాపై చేసిన అధ్యయన ఫలితాలు ఇవే..
ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం ఒక రసాయన స్క్రీనింగ్ వ్యవస్థను అభివృద్ది చేసింది. కాలేయ సమతుల్యతను కాపాడే యాక్టివేటెడ్ హెపాటిక్ స్టెలేట్ కణాలపై నేరుగా పనిచేసే పదార్థాలను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఈ వ్యవస్థను ఉపయోగించి.. లాసోన్ను హెపాటిక్ స్టెలేట్ కణాల యాక్టివేషన్‌ను ఇది నిరోధిస్తున్నట్లు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనంలో లివర్ ఫైబ్రోసిస్ తగ్గినట్లు తెలుసుకున్నారు.
లివర్ ఫైబ్రోసిస్ని నియంత్రిస్తుందట
బయోమెడిసన్ అండ్ ఫార్మోకోథెరపీ జర్నల్‌లో ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. ఈ అధ్యయనంలో హెపాటిక్ స్టెలేట్ కణాల్లోని యాంటీఆక్సిడెంట్ ఫంక్షన్లతో సంబంధం ఉన్న అప్రెగ్యులేటెడ్ సైటోగ్లోబిన్ను గుర్తించారు. అంటే ఈ కణాలు సాధారణ కణాలుగా మారుతున్నాయని అర్థం. హెన్నాలోని లాసోన్ ద్వారా ఔషదాలు తయారు చేస్తే.. లివర్ ఫైబ్రోసిస్‌ను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
హెపాటిక్ స్టెలేట్ కణాలను యాక్టివేట్ చేసి.. ఔషదాలను రవాణా చేయగల డ్రగ్ డెలివరీ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానిని కాలేయ ఫైబ్రోసిస్ ఉన్న రోగులకు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తున్నామని ఒసాకా మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసన్ డాక్టర్ అట్సుకో డైకోకు తెలిపారు.
లివర్ ఫైబ్రోసిస్..
కాలేయంలో దీర్ఘకాలిక గాయం లేదా వాపు ఉంటే మచ్చ కణజాల అభివృద్ది చెందుతుంది. దీనిని లివర్ ఫైబ్రోసిస్ అంటారు. అయితే దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే అది కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీయడంతో పాటు క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేసి ప్రాణాంతకమవుతుంది. అలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు హెన్నాతో శాస్త్రవేత్తలు పరిశోధలను చేస్తున్నారు.





















