Lemongrass Tea: పరగడుపున ఖాళీ పొట్టతో ఈ టీ తాగితే బరువు తగ్గడం సులువు
నిమ్మగడ్డి రసం అదేనండీ లెమన్ గ్రాస్ తీసుకుంటే ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేకూరుస్తుంది. బరువు తగ్గించడంలో లెమన్ గ్రాస్ టీ బెస్ట్ ఎంపిక.
చాలా మంది తమ డేని కాఫీ లేదా టీతో స్టార్ట్ చేస్తారు. కొంతమంది బ్లాక్ కాఫీ తాగితే మరికొందరు హెర్బల్ టీలకు ప్రాముఖ్యత ఇస్తారు. సాధరణంగా ఉండే వాటి కంటే లెమన్ గ్రాస్ టీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ ఫ్లేవర్, రీఫ్రెష్ అనుభూతి కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ టీ ఉదయం పూట తప్పకుండా తీసుకోమని చెప్పేందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని..
రోగనిరోధక శక్తి
లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకునే తీవ్రమైన అనేక రకాల వ్యాధులను నివారించవచ్చు.
బరువు తగ్గుతారు
బరువైన శరీరంతో మీరు ఇబ్బంది పడుతుంటే లెమన్ గ్రాస్ టీ చక్కని ఎంపిక. ఇది జీవక్రియను పెంచుతుంది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఖాళీ పొట్టతో దీన్ని తీసుకోవడం వల్ల కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఊబకాయం బారిన పడే అవకాశమే ఉండదు.
రక్తపోటు నియంత్రణ
లెమన్ గ్రాస్ టీలో పొటాషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
డిటాక్సిఫైయర్
లెమన్ గ్రాస్ టీ సహజమైన డిటాక్సిఫైయర్. పొద్దున్నే తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించేస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. దీంతో చర్మ సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు.
జీర్ణక్రియ
లెమన్ గ్రాస్ టీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొండటంలో తోడ్పడుతుంది. పేగులలో మంటను తొలగిస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే పొత్తి కడుపు నొప్పి, మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మహిళలు లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది.
చర్మానికి మేలు
లెమన్ గ్రాస్ జిడ్డు లేదా మొటిమల బారిన పడే చర్మానికి స్కిన్ టానిక్, క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని టోన్ చేయడంలో బాగా సహాయపడుతుంది.
లెమన్ గ్రాస్ వల్ల లాభాలు మాత్రమే కాదు అనార్థాలు కూడా ఉన్నాయి. దీన్ని అతిగా తీసుకుంటే అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తల తిరగడం, నోరు పొడిబారిపోవడం, తరచూ మూత్ర విసర్జన, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.