Hair Color Risks : జుట్టుకు రంగు వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయట
Hair Color : జుట్టుకు చాలామంది రంగులు వేసుకుంటున్నారు. అయితే ఇలా డై వేయడం వల్ల కిడ్నీలు, లివర్ సమస్యలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇది ఎంతవరకు నిజమో చూసేద్దాం.

Hair Color Kidney Damage : ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జుట్టు మెరవడం అనేది ఓ సమస్యగా మారింది. దీనిలో భాగంగానే తమ లుక్స్ మార్చుకోవడానికి, వైట్ హెయిర్ కవర్ చేయడానికి జుట్టుకు రంగు వేయించుకోవడం చేస్తున్నారు. ఓ రకంగా ఇది చాలామంది బ్యూటీ రొటీన్లో భాగమవుతుంది. అయితే మీకు తెలుసా? ఈ రంగుల్లోని కొన్ని రసాయనాలు ఆరోగ్యంపై.. ముఖ్యంగా మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు నిపుణులు. మరి ఇవి ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు చూసేద్దాం.
మూత్రపిండాలపై ప్రభావం
మూత్రపిండాలు మన శరీరంలో సహజమైన ఫిల్టర్లాగా పనిచేస్తాయి. కాలేయం కూడా శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇవి రక్తం నుంచి విషపూరిత పదార్థాలను, వ్యర్థాలను తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే జుట్టుకు రంగు వేసుకున్నప్పుడు.. వాటిలోని కొన్ని రసాయనాలు తలపై చర్మంలోకి ప్రవేశించి.. అక్కడి నుంచి రక్తప్రవాహంలోకి వెళ్తాయి. ముఖ్యంగా పారా-ఫినైలెండియామైన్, అమైనో ఫినాల్స్ వంటి రసాయనాలు చాలా హాని కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా సింథటిక్ డైలలో కనిపిస్తాయి.
ఆ తరహా రంగులను పదేపదే, ఎక్కువమోతాదులో ఉపయోగిస్తే.. అది మూత్రపిండాల వడపోత సామర్థ్యాన్ని, కాలేయ పనితీరును నెగిటివ్‌గా ప్రభావితం చేస్తాయి. కాలేయ వాపు లేదా తేలికపాటి మంటను కలిగిస్తాయని ఓ అధ్యయన తెలిపింది. జర్నల్ ఆఫ్ ది పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్‌లో ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. అధిక మొత్తంలో PPDకి గురికావడం వల్ల తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు, కాలేయ సమస్యలు వస్తాయని దానిలో పేర్కొన్నారు. పరిస్థితి తీవ్రమైతే మూత్రపిండాల వైఫల్యం కూడా జరుగుతుందని ప్రచురించారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రతీసారి జుట్టుకు రంగు వేయించుకోవడం వల్ల మూత్రపిండాలపై, కాలేయంపై ప్రభావం ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలనే విషయాలపై అవగాహనతో ఉండాలి. రంగు రసాయనాల ప్రభావం శరీరంలో ఉంటే.. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ సమయంలో కాళ్లు, చీలమండలు లేదా చేతులలో వాపు, అలసట లేదా బలహీనత ఉంటాయి. ఆకలి తగ్గడం లేదా నిరంతరం వికారం, మూత్రంలో మార్పులు, కళ్లు చుట్టూ వాపు కనిపిస్తే వంటి లక్షణాలు కనిపించి.. కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కెమికల్స్ లేని వాటిని హెయిర్ కలర్‌కోసం ఎంచుకోవాలి. లేదా సహజంగా జుట్టును నల్లగా మారేలా చేసే అంశాలపై దృష్టి పెట్టాలి.
వారు దూరంగా ఉంటే మంచిది
దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి లేదా రక్తపోటు, కాలేయ సమస్యలు ఉన్నవారు హెయిర్ కలర్‌కి దూరంగా ఉంటే మంచిది. రెండవది మధుమేహం ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. సెన్సిటివ్ స్కిన్ లేదా అలెర్జీలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కవసార్లు లేదా ముదురు రంగులను జుట్టుకు ఉపయోగించే వారు కూడా కలర్స్ వేసుకోవడం తగ్గిస్తే మంచిది.
జుట్టుకు రంగు వేయాలనుకుంటే..
మూత్రపిండాల, కాలేయ సమస్యలను నివారించాలనుకుంటే.. కొన్ని చర్యలు తీసుకోవాలి. సహజమైన రంగును వినియోగించాలి. మార్కెట్ నుంచి కొనుగోలు చేసేవి అయితే.. అమ్మోనియా-రహిత, PPD-రహిత ఉత్పత్తులను ఎంచుకోవాలి. మూలికలతో చేసిన రంగులు లేదా సెమీ-పర్మినెంట్ కలర్స్ ఉపయోగించాలి. ఏవి ట్రై చేసినా.. ముందుగా అలెర్జీ ప్రమాదాన్ని నివారించడానికి ప్యాచ్ టెస్ట్ చేయించుకోవాలి. నిపుణుల సూచనలు కూడా తీసుకుంటే మంచిది.






















