నోటికి కాస్త బ్రేక్ ఇవ్వండి గురూ, లేకపోతే దంతాలు పాడవుతాయ్ - ఎందుకో తెలుసా?
మీ డెస్క మీద ఎప్పుడూ కాఫీ కప్ లేదా కోల్డ్ కాఫీ మగ్ ఉంటూనే ఉంటుందా? లేదా తరచుగా ఏదో ఒకటి నమిలే చిరుతిండి మీకు మంచి వ్యాపకమా?ఇది మీ దంతాల మీద భయంకరమైన ప్రభావం చూపుతాయని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
మీరు కాఫీ ప్రియులా? మీ డెస్క్ మీద ఎప్పుడూ కాఫీ కప్ లేదా కోల్డ్ కాఫీ మగ్ ఉంటూనే ఉంటుందా? లేదా డ్రింక్స్ తాగడం, తరచుగా ఏదో ఒక చిరుతిండి తింటూ ఉంటారా? ఈ రోజువారీ అలవాట్ల గురించి పెద్దగా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ ఈ అలవాట్లే మీ దంతాల మీద భయంకరమైన ప్రభావం చూపుతాయని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాట్లు దంతక్షయానికి ప్రత్యక్ష కారణం కావచ్చని చెబుతున్నారు. అందుకే మీ నోటికి కాస్త బ్రేక్ ఇవ్వండని చెబుతున్నారు.
ఫిజి డ్రింక్స్ వల్ల కూడా మూత్యాల వంటి దంతాలపై తీవ్రమైన దాడి జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటితో సహా ఏ పానీయంలో అయినా సరే అన్నింటిలోనూ కొంత ఆమ్ల గుణం ఉంటుంది. టూత్ ఎనామిల్ చాలా దృఢంగా ఉండే పదార్థం. అయితే ఆసిడ్ వల్ల.. ముఖ్యంగా ఆమ్ల గుణం కలిగిన డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల మీద ఎనామిల్ డీమినరలైజ్ అయ్యి క్షీణించడం, దంతక్షయం జరగడం వంటి ప్రమాదం ఉంటుందని కొలంబియా యూనివర్సిటి డెంటిస్టులు వివరిస్తున్నారు.
నీళ్లు కాకుండా మరే పానియమైనా గంటల తరబడి సిప్ చెయ్యడం అనేది ఎప్పుడూ మంచిదికాదు. నోటిలోని లాలాజలం ఆహార కణాలను శుభ్రం చేస్తుంది. ఆసిడ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. నోట్లో పీహెచ్ అదుపులో ఉంటుంది. ఏదైనా తిన్న తర్వాత పీహెచ్ తిరిగి తటస్థ స్థాయికి రావడానికి కనీసం గంట పడుతుంది. మీరు అస్తమానం ఏదోటి తింటూ ఉంటే ఆ సమయం దొరకనందువల్ల దంతాలు పాడవుతాయట.
ఎంత ఎక్కువ సమయం పాటు నోటిలో ఆసిడ్ ఉంటే అంత ఎక్కువ నష్టం జరుగుతుంది. కాఫీ, టీలలో చక్కెర, క్రీమ్ లు కలిపి తాగేవారికి నష్టం మరింత ఎక్కువ ఉండవచ్చు. ఫిజీ డ్రింక్స్ లో పీహెచ్ స్థాయిలు 3, 4 మధ్య ఉంటాయి. నోటిలోని పీహెచ్ ఎప్పుడూ 5.5 కంటే తక్కువ ఉండకూడదు. అలా ఎక్కువ సమయం పాటు ఉంటే దంతాలకు విపరీతమైన నష్టం జరుగుతుంది. షుగర్ ఫ్రీ, డైట్ ఫిజీ డ్రింక్స్ వల్ల కూడా ఇలాంటి నష్టమే జరుగుతుంది. ఇవేమీ మినహాయింపు కాదు.
బ్రేక్ ఇవ్వకుండా ఏదో ఒకటి తాగడం లేదా తినడం అనే అలవాటు దంతాలకు విపరీతమైన హాని చేసే అలవాటుగా నిపుణులు పరిగణిస్తున్నారు. కేవలం సరిగ్గా బ్రష్ చేసుకోవడం, క్రమం తప్పకుండా ఫ్లాజింగ్ చేసుకోవడం మాత్రమే మంచి అలవాట్లు కాదు మనం తీసుకునే ఆహార పానీయాల మధ్య తగినంత విరామం పాటించడం కూడా దంత ఆరోగ్యానికి అవసరమేనని నిపుణులు సూచన చేస్తున్నారు.
Also read : రోజూ రాత్రిపూట ఇలా జరుగుతోందా? జాగ్రత్త, క్యాన్సర్ కావచ్చు - డాక్టర్‌ను సంప్రదించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.