Sue On Groom: ఊరేగింపుకు తీసుకెళ్లలేదని వరుడిపై స్నేహితులు రూ.50 లక్షలు దావా
పెళ్లి పనుల్లో సాయం చేసిన స్నేహితులను పట్టించుకోకుండా, కనీసం వారి కోసం వేచి చూడకుండా ఊరేంపుతో వెళ్లిపోయిన వరుడికి ఫ్రెండ్స్ ఇలా ఝలక్ ఇచ్చారు.
పెళ్లి ఊరేగింపంటే ఆ సందడే వేరు. బంధుమిత్రలు కేరింతలు, డ్యాన్సులు, డీజే.. అబ్బో, ఇంకా చాలానే ఉంటాయి. ఫ్రెండ్ పెళ్లంటే చాలు.. స్నేహితులు రెండు మూడు రోజుల ముందు నుంచే సంబరాలు మొదలెట్టేస్తారు. పెళ్లి ఊరేగింపు మొదలకుని.. పెళ్లి పూర్తయ్యేవరకు అక్కడే ఉండి హడావిడి చేస్తారు. వరుడిని ఆటపట్టిస్తూ.. హ్యాపీగా గడిపేస్తారు. అయితే, ఈ పెళ్లిలో అలా జరగలేదు. దీంతో ఫ్రెండ్స్ వరుడిపై అలిగారు. ఆగ్రహంతో రగిలిపోతూ.. అతడిపై కోర్టులో రూ.50 లక్షల దావా వేశారు.
ఈ ఘటన మరెక్కడో కాదు.. ఇండియాలోనే చోటుచేసుకుంది. హరిద్వార్‌లోని బహదురాబాద్ ప్రాంతానికి చెందిన రవి అనే యువకుడికి పెళ్లి కుదిరింది. అయితే, రవి బిజీగా ఉండటం వల్ల పెళ్లి శుభలేఖలను పంచడానికి చంద్రశేఖర్ సాయాన్ని కోరాడు. దీంతో చంద్రశేఖర్ వరుడికి బదులుగా స్నేహితులందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంచిపెట్టాడు. శుభలేఖలో పెళ్లి ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు అని ఉంది. దీంతో చంద్రశేఖర్, మిగతా స్నేహితులంతా ఐదు గంటలకు వరుడు ఇంటికి చేరారు.
అప్పటికే వరుడు రవి స్నేహితుల కోసం ఎదురు చూడకుండా ఊరేగింపుతో వెళ్లిపోయాడు. దీంతో అంతా శుభలేఖలు పంచిన చంద్రశేఖర్‌ను నిందించారు. కొందరు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మొదటి నుంచి రవి పెళ్లి పనులను చక్కబెడుతున్న చంద్రశేఖర్‌కు ఇది అస్సలు నచ్చలేదు. అతడు, మిగతా స్నేహితులతో ఓ లాయర్‌ను కలిశాడు. రవి పెళ్లికి హాజరైనవాళ్లంతా తనని మెంటల్ టార్చర్ చేశారని, రవి వల్ల తన పరువు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రవిపై రూ.50 లక్షల పరువు నష్టం దావా వేశాడు. మూడు రోజుల్లో వరుడు రవి తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. అయితే, ఈ పిటీషన్‌ను కోర్టు విచారించిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
Also Read: లేజీ ఫెలో, చెప్పులేసుకోడానికి బద్దకమేసి ఏం చేశాడో చూడండి
Also Read: ఈ ఇల్లు వరదల్లో మునగదు, చుక్క నీరు కూడా ఇంట్లోకి చేరదు