మీ చేతి వేళ్లు ఇలా మారుతున్నాయా? అయితే, మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!
కొన్ని వ్యాధుల ముప్పును మీ శరీరం ముందే చెప్పేస్తుంది. అయితే, మనకు వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల ఏం జరుగుతుందనేది తెలుసుకోలేం. అందుకే, ఈ లక్షణాల గురించి తెలుసుకోండి.
చర్మం, జుట్టు సాధారణంగా ఉన్నాయంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. వాటిలో ఏ మార్పులు కనిపించినా కూడా ఏదో అనారోగ్యం శరీరంలోకి వచ్చినట్టు అర్థం. మధుమేహం బారిన పడుతుంటే చేతులే చెప్పేస్తాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా ఎటాక్ చేస్తున్న వ్యాధి మధుమేహం. ప్రపంచంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్ళే ఉంటున్నారు. అయితే ఇది చాలా మందికి వచ్చే ముందు కొన్ని మార్పులు శరీరంలో చోటుచేసుకుంటాయి. వాటిని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన లక్షణాలు తరచుగా అనారోగ్యంగా అనిపించవు. కానీ చేతులని బట్టి మీరు టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారో లేదో తెలుసుకోవచ్చు.
చేతి వేళ్ళు వంగడం
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తుల వేళ్ళల్లో నొప్పి, వంగిపోవడం గమనించవచ్చని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. అవి వంచితే బాధకారంగా ఉంటాయి. దీన్నే ట్రిగ్గర్ ఫింగర్ అని కూడా పిలుస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ళు వంగినట్లుగా అయిపోతాయి. తరచుగా ఉంగరం వెలు లేదా బొటనవేలు వంగిన స్థితిలో ఉండిపోతుంది. దాన్ని మళ్ళీ సాధారణంగా నిటారుగా చెయ్యడం కష్టం. బాధకరమైన ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు కార్టిసోన్ ఇంజెక్షన్లతో చికిత్స చేయవచ్చు. కొన్నిసార్లు శస్త్రచికిత్స అవసరం అవుతుంది. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న వారిలో ఇది కనిపిస్తుంది.
గోళ్ళ చుట్టూ ఎర్రబడటం
మధుమేహం ఉన్న వారిలో తరచుగా రక్తప్రసరణ సమస్యలతో బాధపడతారని గతంలో ఒక అధ్యయనం వెల్లడించింది. డయాబెటిస్ ముప్పు ఉన్నవారికి గోళ్ళ చుట్టూ ఎర్రగా మారడం గుర్తించవచ్చు. క్యూటికల్స్, గోరు లోపల చర్మం ఎలా ఉందో గమనించడం చాలా ముఖ్యం. గోళ్ళ చుట్టుపక్కల ప్రదేశం ఎరుపుగా మారుతుంటే మధుమేహం బారిన పడుతున్నట్లే.
గోర్లలో మార్పులు
కొంతమంది గోర్లు గమనిస్తే ఒత్తిడి పడినట్లుగా, తెల్ల మచ్చలు, సగం గోరు ఒక రంగు మరో సగం ఎర్రగా లేదా తెల్లగా, గోర్ల మీద చొట్ట పడిన గుర్తులు కనిపిస్తాయి. మధుమేహంతో సహా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న అనేక మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.
పసుపు గోర్లు
మధుమేహం ఉన్న వాళ్ళు గోళ్లలో వచ్చే ఒనికోమైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఈ పరిస్థితి వస్తే గోర్లు పసుపు రంగులోకి మారి పెళుసుగా అయిపోతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉంటే ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇవే కాకుండా సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం జరుగుతుంది. రాత్రి వేళ ఎక్కువగా జరుతుంది. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు మూత్రపిండాలు దాన్ని బయటకి పంపించేందుకు కష్టపడతాయి. దాని వల్లే మూత్రం ఎక్కువగా వస్తుంటాయి. మధుమేహ బాధితుల్లో కనిపించే మరో లక్షణం అధిక దాహం. అలిసిపోయినట్లుగా అనిపించడం మరో లక్షణం. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల వస్తుంది. ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే బరువు తగ్గిపోవడం, గాయాలు నయం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం, కంటి చూపు మసకబారటం వంటి లక్షణాలు అన్నీ మధుమేహాన్ని సూచిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఈ సప్లిమెంట్స్ అతిగా వినియోగిస్తున్నారా? జాగ్రత్త, ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడతారు