Lung Cancer Risk Factors: ఈ సప్లిమెంట్స్ అతిగా వినియోగిస్తున్నారా? జాగ్రత్త, ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడతారు
విటమిన్స్, మినరల్స్ లోపాలతో బాధపడే వాళ్ళు వాటిని భర్తీ చేసేందుకు సప్లిమెంట్స్ తీసుకుంటారు. కానీ వాటిని అతిగా తీసుకోవడం వల్ల అనార్థాలు ఎక్కువగా ఉన్నాయి.
విటమిన్స్, మినరల్స్ కోసం చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉంటారు. ఏదో ఒక కారణం చెప్పి వాటిని వినియోగించడం కొనసాగిస్తారు. అయితే అలా చేయడం వల్ల ప్రాణాంతక ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఒక షాకింగ్ అధ్యయనం బయటపడింది. రోగనిరోధక శక్తి, కంటి చూపు బాగుండటం కోసం ఎక్కువగా విటమిన్ ఏ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ అదే ప్రాణాంతకంగా మారుతోందని చైనాకి చెందిన పెకింగ్ యూనివర్సిటీ నిపుణులు వెల్లడించారు. ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ కి కారణం అవుతోందని హెచ్చరిస్తున్నారు.
విటమిన్ ఏ తీసుకోవడం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని మునుపటి పరిశోధనలో వెల్లడైంది. తాజాగా ఊపిరితిత్తుల క్యాన్సర్లతో కూడా అనుబంధం ఏర్పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అడెనోకార్సీనోమా ఉపపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని గుర్తించారు. పొలుసుల కణ క్యాన్సర్, అడెనోకార్సినోమా రెండూ ఊపిరితిత్తుల క్యాన్సర్ సాధారణ రకాలు. అడెనోకార్సినోమా అనేది అత్యంత సాధారణ రకం శ్లేష్మ గ్రంథి కణాలలో మొదలవుతుంది. ఈ అధ్యయనం సుమారు 11వేల మందికి పైగా ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల ఆరోగ్య రికార్డులు పరిశీలించిన ఆధారంగా రూపొందించబడింది.
ఎంత మోతాదులో తీసుకోవాలి?
డాక్టర్ సలహా ఇస్తే తప్ప సొంతంగా సప్లిమెంట్స్ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు రోజుకి 7మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా బీటా కెరోటిన్ సప్లిమెంట్స్ తీసుకోకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే ధూమపానం చేసే వాళ్ళు ఆస్బెస్టాస్ట్ కు గురైన వ్యక్తులు కూడా బీటా కెరోటిన్ సప్లిమెంట్లు తీసుకోకూడదని సూచించారు. కొన్ని ఇతర విటమిన్ సప్లిమెంట్లు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. అవేంటంటే..
సెలీనియం
సెలీనియం అనేది గుడ్లు, ఎల్లో ఫిన్ ట్యూనా చేపలు, పొద్దు తిరుగుడు గింజలు వంటి ఆహారాల్లో లభించే ఖనిజం. ఇది జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు థైరాయిడ్ గ్రంథి పనితీరుకి సహకరిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని అనుకుంటారు, కానీ అది ఎంతమాత్రం సహాయపడదని నిపుణులు తేల్చి చెప్పారు. నిజానికి ఇవి తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ సప్లిమెంట్లు తీసుకున్న రోగుల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. పురుషులు రోజుకు 0.075mg సెలీనియం, మహిళలు అయితే 0.060mg మించి తీసుకోకూడదు. అది కూడా 19-64 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఫోలిక్ యాసిడ్స్
గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో కీలకంగా తీసుకునే సప్లిమెంట్ ఇది. శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇవి వాళ్ళ నాడీ నాళాలను ఏర్పాటు చేసేందుకు సహకరిస్తుంది. మెదడు, వెన్నెముక సమస్యలు వంటి కొన్ని ప్రధాన జన్యుపరమైన లోపాలని నివారించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే ఇది ఎక్కువగా తీసుకుంటే మాత్రం ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సిఫార్సు ప్రకారం రోజుకి 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా గర్భవతి అయిన తర్వాత 12 వారాల వరకు మాత్రమే. ఒక వేళ గర్భవతి కాకపోతే రోజుకు 200 మైక్రో గ్రాములు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అతిగా వినియోగించడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే సూచనల్ని పరిశోధకులు గుర్తించారు. ఫోలిక్ యాసిడ్, బి 12 ట్యాబ్లెట్స్ వేసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం 21 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
విటమిన్-E
వేరుశెనగ, బాదం, బచ్చలికూర, మిరియాలు వంటి వాటి నుంచి తగినంత విటమిన్ ఇ పొందవచ్చు. కానీ దీన్ని ఆహారం నుంచి కాకుండా సప్లిమెంట్స్ ద్వారా భర్తీ చేయడం వల్ల పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? ఈ వాటర్ ట్రైచేస్తే సన్నగా మారిపోతారు!