Guava Health Benfits: చలికాలంలో జామ పండు తింటే డాక్టర్‌తో పనే ఉండదు, ఎందుకంటే..
జామకాయ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేకూరుస్తుంది. మధుమేహులకి ఫ్రెండ్లీ ఫుడ్ కూడా.
సీజన్ ఏదైనా దొరికే పండు జామ పండు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే దీన్ని పేదవాడి యాపిల్ గా పిలుచుకుంటారు. చాలా మంది ఇళ్ళల్లో జామచెట్లు పెంచుకుంటూ ఉంటారు. నారింజ కంటే జామలోనే అధికంగా విటమిన్-సి లభిస్తుంది. మార్కెట్లో రెండు రకాలుగా జామపండ్లు కనిపిస్తాయి. కొన్ని జామకాయలు లోపల తెల్లగా ఉంటే మరికొన్ని ఎర్రగా ఉంటాయి. ఇవి రెండూ ఆరోగ్యకరమైనవే.
మధుమేహులకి ఎంతో మేలు చేసే పండు ఇది. హృద్రోగులు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు ఎటువంటి సందేహం లేకుండా వీటిని తినొచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, ప్రోటీన్లు, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు మెండుగా ఉంటాయి. దీన్ని పరిమితంగా తీసుకుంటే మధుమేహులకి, రక్తపోటు రోగులకి చాలా సురక్షితమైన పండు. కొవ్వుని కరిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కేలరీలు తక్కువ ఉండే ఆహారం ఇది. పోషకాలు మెండుగా ఉంటాయి. జామకాయలోనే కాదు వాటి ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
మలబద్ధక సమస్యని నివారిస్తుంది
గట్ ఆరోగ్యానికి జామకాయ చాలా ఉపయోగపడుతుంది. జామపండు తినడం వల్ల జీర్ణవ్యవస్థని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందువల్లే జీర్ణవ్యవస్థ, పేగులు ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కోవిడ్ కాలం వల్ల అందరూ రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల ఇది తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కోవిడ్ ని ఎదుర్కోవాలంటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తినమని వైద్యులు సూచిస్తున్నారు. జామపండు క్రమం తప్పకుండా తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు దూరం చేసుకోవచ్చు.
ఒత్తిడి నుంచి ఉపశమనం
జామపండ్లలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒత్తిడిని అధగమించడానికి గొప్ప మార్గం. ఈ పండుని క్రమం తప్పకుండా తినడం వల్ల మనసు రిలాక్స్ గా ఉంటుంది.
బరువు తగ్గొచ్చు
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి జామకాయ అధ్బుతమైన పండు. ఫైబర్, ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది తింటే పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. థైరాయిడ్ జీవక్రియను మెరుగుపర్చడంలోను సహాయపడుతుంది. కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
జామపండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక ఫైబర్ కంటెంట్ వల్ల ఆకలి తగ్గించి సంతృప్తి అనుభూతి కలిగేలా చేస్తాయి.
జామకాయ జ్యూస్ లివర్ కి మంచిగా పని చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. చర్మ సౌందర్యానికి కొల్లాజెన్ ఉత్పత్తి చాలా అవసరం. దీని ఉత్పత్తికి అవసరమయ్యే పెక్టిన్ అనే సమ్మేళనం జామలో లభిస్తుంది. ఇది పేగుల్లోని ప్రోటీన్ ను కూడా కాపాడుతుంది. గర్భిణులు జామకాయను తింటే మేలు జరుగుతుంది. ఇందులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. శిశువుకు నాడీ సంబంధిత వ్యాధులు, లోపాలు రాకుండా జామ కాయలోని ఈ పోషకాలు కాపాడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: గర్భవతులూ.. ప్రాసెస్ చేసిన ఆహారం అతిగా తింటున్నారా? జాగ్రత్త, పుట్టబోయే పిల్లలకు ఊబకాయం రావచ్చు