Fathers Day 2023: 'నాన్నకు ప్రేమ'తో.. ఫాదర్స్ డే రోజు మీ నాన్నని ఇలా సర్ ప్రైజ్ చేయండి
ఫాదర్స్ డే రోజు ప్రత్యేకంగా ఉండాలంటే నాన్నకి విషెస్ చెప్పడమే కాదు అద్భుతమైన గిఫ్ట్ కూడా ఇవ్వండి. చాలా ఆనందపడతారు.
తొలిసారి బిడ్డ పుట్టినప్పుడు పొత్తిళ్లలో తన పిల్లల్ని చూసినప్పుడు తల్లి పొందే ఆనందం కంటే వెయ్యి రేట్లు అధికంగా తండ్రి ఫీలవుతాడు. తన జీవితం మొత్తం బిడ్డల కోసమే ధారపోసేవాడు తండ్రి. తొలి గురువు, మార్గదర్శి, స్నేహితుడు అన్నీ నాన్నే. అందరిలోనూ తన పిల్లలు గొప్పగా కనిపించడం కోసం తాపత్రయపడతాడు. తన చివరి శ్వాస వరకు పిల్లలే లోకంగా బతికే తండ్రులందరికీ అంకితమిచ్చే రోజే 'ఫాదర్స్ డే'. ఈ ఏడాది జూన్ మూడో ఆదివారం( జూన్ 18) ఫాదర్స్ డే వచ్చింది. ఈ సందర్భంగా నాన్నకి ప్రత్యేకమైన రోజుగా గుర్తిండిపోయే విధంగా ఆయనకి నచ్చిన మెచ్చిన గిఫ్ట్ తో సర్ ప్రైజ్ చేయండి. అది ఎంత చిన్న గిఫ్ట్ అయినా కూడ తమ బిడ్డలు చేసినందుకు ఆ తండ్రి కళ్ళలో కనిపించే ఆనందం వెలకట్టలేనిది. మీ తండ్రిని సంతోషపెట్టేందుకు ఇలా చేసి చూడండి.
స్మార్ట్ వాచ్, గ్యాడ్జెట్స్
ఇప్పుడు మొత్తం టెక్నాలజీ మీదే నడుస్తుంది. వయసు మీద పడిన తండ్రికి ఉపయోగకరమైన విధంగా స్మార్ట్ ఫోన్, ట్యాబ్, స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. స్మార్ట్ వాచ్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా సెట్టింగ్స్ అమర్చుకోవచ్చు. హార్ట్ బీట్, బీపీ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు.
పర్సనలైజ్ ఫోటో బుక్
చిన్నప్పటి నుంచి తండ్రితో గడిపిన ప్రతీ క్షణం ఒక మధురమైన జ్ఞాపకం. వాటికి సంబంధించిన ఫోటోస్ తో ఒక చిన్న సైజ్ పర్సనలైజ్ ఫోటో బుక్ క్రియేట్ చేసి ఇస్తే చాలా సంతోషిస్తారు. మీరు దగ్గర లేకపోయినా గుర్తుకు వచ్చినప్పుడల్లా వాటిని చూడగానే మొహం మీద చిరునవ్వు వస్తుంది. మనసులో ఉన్న బాధ తొలగిపోతుంది.
ఇష్టమైన వంట చేసి పెట్టండి
తండ్రికి ఇష్టమైన వంట ఏదో కనుక్కుని తమ పిల్లలు చేస్తే చాలా సంతోషంగా తింటారు. పక్కనే ఉండి ప్రేమగా వారికి కొసరి కొసరి వడ్డిస్తే వారి ఆనందం వర్ణనాతీతం. లేదంటే గిఫ్ట్ కార్డ్ ఇచ్చి వాళ్ళని సర్ ప్రైజ్ చేయవచ్చు.
ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లడం
బిడ్డ పుట్టినప్పటి నుంచి తన జీవితం మొత్తం వారికి ఏ లోటు లేకుండా చూసుకునేందుకు డబ్బు సంపాదించేందుకు కష్టపడతాడు నాన్న. ఈ ప్రయాణంలో తమ చిన్న చిన్న ఆనందాలు వదులుకుంటారు. తమకి ఇష్టమైన ప్రదేశానికి వెళ్లలేకపోయామనే బాధ మనసులో ఏదో ఒక మూలన ఉంటుంది. అది తెలుసుకుని తీరిస్తే చాలా సంతోషపడతారు. తొలిసారి విమానం ఎక్కించడం వంటివి చిన్న విషయాలే అయినప్పటికీ అవి వాళ్ళు తీర్చుకోలేనివి. వాటిని తమ పిల్లల కష్టార్జితంతో తీరిస్తే ఆ అనుభూతి జీవితాంతం గుర్తు ఉంటుంది.
రోజంతా నాన్నతో స్పెండ్ చేయండి
బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబంతో సమయం గడిపే తీరిక ఈ రోజుల్లో ఎవరికీ ఉండటం లేదు. కానీ ఫాదర్స్ డే రోజు ఎటువంటి పనులు పెట్టుకోకుండా రోజంతా తండ్రి దగ్గరే ఉండి టైమ్ స్పెండ్ చేస్తే అన్ని రోజులు తమ పిల్లల కోసం ఎదురుచూసిన క్షణాలు చిటికెలో మర్చిపోతారు. నాన్నతో కలిసి క్రికెట్ ఆడటం, షాపింగ్, సినిమాకి వెళ్ళడం వంటివి చేసి చూడండి.
Also Read: మ్యాంగో Vs బనానా షేక్: ఆయుర్వేదం ప్రకారం ఏది మంచిది?