Cinnamon: రోజూ చిన్న దాల్చిన చెక్క ముక్క నమిలితే ఈ అద్భుతాన్ని చూస్తారు, ఆ సమస్యే ఉండదు!
ఏది తిన్నా కూడా అరుగుదల సమస్య ఇబ్బంది పెడుతుందా? అయితే రోజూ ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క తినడమో లేదంటే దానితో చేసిన టీ తాగడమే చేసి చూడండి.
సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒకటి. నాన్ వెజ్ వంటకాల్లో దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే మధుమేహులకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ ఆహారంలో దీన్ని సులభంగా చేర్చుకోవచ్చు. అనేక అనారోగ్య సమస్యలని నయం చేయగల గొప్ప గుణం దీనికి ఉంది. దాల్చిన చెక్క పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైమ్ లో జీర్ణక్రియ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఇవి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కారం, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపులో మంట, గ్యాస్, ఉబ్బరం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆల్కహాల్ తాగినప్పుడు, రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేసినప్పుడు పొట్టలో వేడి పెరుగుతుంది. దీని వల్ల జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫలితంగా అధిక వేడి ఉత్పత్తి చేస్తుంది. దీంతో కడుపులో మంట, అసౌకర్యంగా అనిపిస్తుంది. వేడిని తగ్గించుకునేందుకు సరైన చర్యలు తీసుకోకపోతే అది ఇతర ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. వేడి, కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ స్థాయిలని తగ్గించడంలో సహాయపడే నివారణలపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఇంట్లోనే చిన్న చిట్కా పాటించారంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. అందుకోసం దాల్చిన చెక్క అద్భుతమైన నివారణగా పని చేస్తుంది.
దాల్చిన చెక్క పొట్టని చల్లబరచడానికి సహాయపడుతుంది. ఆహార రుచిని మెరుగుపరచడమే కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. శరీర ఉష్ణోగ్రతని అదుపులో ఉంచేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతోందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. జీర్ణ సమస్యల్ని నియంత్రిస్తుంది.
శోధ నిరోధక లక్షణాలు
ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపులో మంటని తగ్గిస్తాయి. వేడి వల్ల కలిగే అసౌకర్యాన్ని అదుపు చేస్తుంది.
జీర్ణక్రియ మెరుగు
దాల్చిన చెక్క ఎంజైమ్ ల్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది. ఈ ఎంజైమ్ లు ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయపడతాయి. జీర్ణ సమస్యలు నివారిస్తుంది.
ప్రొబయోటిక్
దాల్చిన చెక్కలో ప్రొబయోటిక్ లక్షణాలు ఉన్నాయి. కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి. పేగులని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఇన్ఫెక్షన్లతో పోరాటం
యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. ఇది కడుపుకి హాని చేసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఇన్ఫెక్షన్లని దూరం చేస్తుంది.
ఆహారంలో దాల్చిన చెక్క చేర్చుకోవడం అనేక మార్గాలు ఉన్నాయి. దీనితో టీ పెట్టుకుని తాగొచ్చు. కూరల్లో మసాలాగా పొడి వేసుకోవచ్చు. కేకులు, కుకీలకి జోడించుకోవచ్చు. కాఫీ, టీలో దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు. పొట్టని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క నమిలినా కూడ మంచి ప్రయోజనం పొందుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: మెరిసే చర్మం కోసం నారింజ రసం- కానీ దీన్ని తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి